లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లు
ఎన్డీఏ కీలక మిత్రపక్షాలు TDP, JD(U) మద్దతిస్తాయా?;
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) (Waqf (Amendment) Bill) బిల్లును బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నారు. మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాల వాదన.
బీజేపీ తర్వాత ఎన్డీఏ(NDA లో కీలక భాగస్వాములయిన తెలుగుదేశం పార్టీ (TDP), జనతాదళ్ (యునైటెడ్), శివసేన, ఎల్జెపి (రామ్ విలాస్) పార్టీలు ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేశాయి.
కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న AIMIM సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. ‘‘ముస్లింల మత స్వేచ్ఛను హరించే వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగ విరుద్ధం’’ అని పేర్కొన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చే TDP, JD(U)కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎన్డీఏకు రాజ్యసభలో పూర్తి మెజార్టీ ఉండడం వల్ల లోక్‌సభలో బిల్లు పాసయితే ఎగువసభలో బిల్లు పాస్ కావడం సులభం. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా కూడా మంగళవారం బిల్లుకు మద్దతు పలికింది.
కాగా తమ మూడు సిఫార్సులను ముసాయిదా బిల్లులో చేర్చిన తర్వాత బిల్లుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని టీడీపీ, పవన్ కళ్యాణ్ జన సేనపై ముస్లిం వర్గాలు ఒత్తిడి తెచ్చాయి.