ముర్షిదాబాద్ అల్లర్ల బాధితుల కోసం ‘సామరస్య నిధి’
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడ్డారు. ‘హార్మోని ఫండ్’లో ఇప్పటి దాకా రూ.4 కోట్ల జమయ్యాయి.;
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్(West Bengal) అట్టుడికింది. ముర్షిదాబాద్(Murshidabad)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడ్డారు. చాలా మంది హిందువుల దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. మీకు అండగా ఉంటామని ఇప్పటికే సీఎం మమత బెనర్జీ(CM Mamata Banerjee) హామీ ఇచ్చారు. మరోవైపు బాధిత కుటుంబాలను ఇరుగుపొరుగు వారు ఆదుకుంటున్నారు. ముర్షిదాబాద్ మైనార్టీ కమ్యూనిటీ సామరస్య నిధి ఏర్పాటు చేసి బాధితులను ఆర్థిక సాయం చేస్తోంది.
స్థానిక ప్రజలు, బీడి తయారీదారులు కలిసి ఈ నిధిని సమకూర్చారని జంగిపూర్ టీఎంసీ(TMC) ఎంపీ ఖలీలుర్ రెహ్మాన్ చెప్పారు. ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలా సేకరించిన నిధులతో ఇళ్లు, వ్యాపారాలు కోల్పోయిన వారిని ఆర్థిక సాయం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయానికి ఇది అదనం. బాధితులు మళ్లీ తమ పూర్వ జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఈ రుణ సాయం ఉపయోగపడుతుంది.
మమత హామీ..
బాధితులను ఆదుకుంటామని సీఎం మమత ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కొందరి ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయిన విషయం తెలిసిందే.
'క్రౌడ్ ఫండింగ్' నిధులు..
ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.4 కోట్లు సేకరించామని షంషేర్‌గంజ్ ఎమ్మెల్యే అమిరుల్ ఇస్లాం చెప్పారు, ఇప్పటికే సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశామని పేర్కొన్నారు. స్థానిక ముస్లిం కుటుంబాలు ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫండ్ ద్వారా తమకు ఆర్థిక సాయం అందిందని బాధిత కుటుంబాలు 'ది ఫెడరల్'కు ఫోన్‌లో చెప్పారు,
పలుచోట్ల ఆస్తినష్టం..
అల్లర్ల సమయంలో ధూలియన్ మునిసిపాలిటీ వార్డు నెం.16లోని సాహా పారా ప్రాంతానికి చెందిన చిత్తరంజన్ పాల్‌కు చెందిన కిరాణా దుకాణాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే వార్డు నంబర్లు 14, 7, 3, షంషేర్‌గంజ్‌లోని జఫ్రాబాద్, బేద్బోనా, జంగిపూర్ సబ్‌డివిజన్‌లోని సూతి ప్రాంతాల్లోనూ అల్లర్లు చెలరేగి ఆస్తినష్టం సంభవించింది.
క్రౌడ్ ఫండ్ ద్వారా అందిన డబ్బుతో తన వ్యాపారం తిరిగి ప్రారంభించానని పాల్ సంతోషంగా చెప్పారు. ధూలియన్ మున్సిపాలీటీకి చెందిన మరో ఇద్దరు బాధితులు ప్రతిమా సహా, పింటు కూడా ఇల్లు నిర్మించుకునేందుకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిందని చెప్పారు.
ఔదార్యం చాటుకున్న తోటి కుటుంబాలు..
కొన్ని కుటుంబాలు స్వయంగా తమ పొరుగువారికి సాయపడ్డాయి. అల్లర్ల సమయంలో పాల్ దుకాణంలోని ఫ్రిజ్ ధ్వంసమైంది. పనిరాకుండా పోవడంతో ధూలియన్‌కు చెందిన నూర్ కుటుంబం వార్డు నెం.16లోని కదమతల ప్రాంతవాసి రవీంద్రనాథ్ పాల్‌కు ఫ్రిజ్‌ను కొనిచ్చారు. అల్లర్లలో ధూలియన్ మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన భరత్ రజత్ సైకిల్ ముక్కలైంది. దాంతో ఆయనకు స్థానికులు కొత్త సైకిల్ కొనిచ్చారు. ఈ తరహా సహాయ కార్యక్రమాన్ని టీఎంసీ నాయకులు ఖలీలుర్ రెహ్మాన్, అమిరుల్ ఇస్లాం, బయరన్ బిశ్వాస్, మణిరుల్ ఇస్లాం కలసి చేపట్టారు.
ఆందోళనకారులు మణిరుల్ ఇంటిపైనా దాడి చేశారు. మత రాజకీయాలకు అతీతంగా బాధితులకు ఆర్థిక సాయం చేశారని షంషేర్‌గంజ్ ఎమ్మెల్యే చెప్పారు,
బీజేపీ ఆర్థిక సాయం..
బీజేపీ నేత సువేందు అధికారి(Suvendu Adhikari) కూడా కొన్ని బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. అల్లర్లలో చనిపోయిన చందన్ దాస్, హర్గోబింద్ దాస్ కుటుంబాలకు రూ.20 లక్షలు ఇచ్చారు. మృతుల పిల్లలు చదువుకునేందుకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కుటుంబాలు మొదట రాష్ట్ర ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించాయి.
బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక.. నష్టపరిహారం మొత్తాన్ని ఆందోళనకారుల నుంచి 12% వడ్డీతో వసూలు చేస్తామని అధికారి చెప్పారు. ముర్షిదాబాద్‌లో మైనారిటీ వాసులు చూపించిన సామూహిక సహకారానికి ఇది పూర్తి భిన్నం అని చెప్పారు. రాజకీయాలను పక్కనబెట్టి ఇలాంటి సహాయక కార్యక్రమాలు చేస్తే బాధితులకు ఎంతో ఊరట లభిస్తుందని కోల్‌కతా రాజకీయ విశ్లేషకుడు ముహమ్మద్ సదుద్దీన్ అన్నారు.