సజ్జనార్ పేరుతో టోపీ..

Update: 2025-11-15 07:11 GMT

హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడ్డారు కొందరు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి.. తనకు తెలిసిన వాళ్లను మోసం చేస్తున్నారని, ఇలాంటి మోసాల వలలో పడొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రజలకు, స్నేహితులకు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా పంపొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

‘‘నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు ₹20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్య‌క్తిగ‌త ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది; https://facebook.com/share/1DHPndApWj/ . ఇది మిన‌హా నా పేరుతో ఉన్న మిగ‌తా ఖాతాల‌న్నీన‌కిలివే. ఈ ఫేక్ ఖాతాల‌ను మెటా స‌హ‌కారంతో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం టీం తొల‌గించే ప‌నిలో ఉంది. నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ‌ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వ‌చ్చే రిక్వెస్ట్‌ల‌ను స్పందించ‌కండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి. ఒక‌వేళ అలా ఎవ‌రైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌ ల‌ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే… సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News