మద్ధతు ధరతో ఐదేళ్ల కాలానికి ఒప్పందం?

కేంద్ర ప్రభుత్వం, రైతు నాయకులతో చండీగఢ్ లో జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. కొన్నిపంటలను ఐదేళ్ల కాలానికి మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రతిపాదించింది.

Update: 2024-02-19 05:29 GMT

మరికొన్ని డిమాండ్లపై మాత్రం ఇప్పుడిప్పుడే పరిష్కారం కనుగొనడం సాధ్యం కాదని, దానిపై విస్తృత ప్రజాభిప్రాయం, చర్చల తరువాత చెప్పగలమని ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిపాదనపై రైతు నాయకులు రెండు రోజుల్లో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు.

పంజాబ్- హర్యానా సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి 8 గంటలకు మరోసారి చర్చలకు దిగింది. ఇవి అర్థరాత్రి 2 రెండు గంటల వరకు కొనసాగాయి. రైతులు- కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో ఇవి నాలుగోవి. ఇందులో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా చర్చల్లో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పంటల్లో పప్పు ధాన్యాలు, మొక్కజోన్న, ప్రత్తి పంటలు ఉన్నాయి. వీటిని కనీస మద్థతు ధరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎంత మొత్తం సేకరించాలి అనే దానిపై పరిమితి అంటూ ఏం ఉండదని ప్రభుత్వం హమీ ఇచ్చింది.

ఈ పంటలు పండించే రైతులతో ఎన్సీసీఎఫ్( నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్) నాఫెడ్( నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వంటి సహకార సంఘాలు ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటాయని పీయూష్ గోయల్ చెప్పారు.

చర్చల్లో తాము ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ ఆలోచించామని వివరించారు. రైతులు మొక్క జొన్న పంటను వైవిధ్య పరచాలని అనుకుంటున్నారని, కానీ ధరలు పడిపోయినప్పుడు వచ్చే నష్టాలను నివారించాలని కోరుకుంటున్నారని వివరించారు. " పంటల కొనుగోలు పై ఎటువంటి పరిమితి ఉండదు. దీనికోసం ఒక ఆప్ ను డెవలప్ చేయాలని అనుకుంటున్నాం" అని చెప్పారు. పంజాబ్ వ్యవసాయాన్ని కాపాడడంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడి కూడా తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మిగిలిన అంశాలు కొత్త ప్రభుత్వం వచ్చాకే..

రైతులు కోరుతున్న మిగిలిన డిమాండ్ల పై, కొత్త ప్రభుత్వం కొలువయ్యాక చర్చలు కొనసాగించాలని అన్నారు. వాటిపై నిర్థిష్టమైన ప్రణాళికతో పాటు లోతుగా చర్చించాల్సిన అంశాలు దాగి ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కనీస మద్ధతు ధరకు చట్టబద్దమైన హమీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, రైతులు, రైతుకూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, విద్యుత్ చార్జీల పెంపుదల, పోలీస్ కేసులు ఉపసంహరణ వాటితో పాటు మిగిలిన కొన్ని అంశాలు ఎన్నికలయ్యాక మాత్రమే ఓ కొలిక్కి వస్తాయని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాకే అనేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అంతకుముందు పదేళ్ల కాలంలో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ కేవలం 5.50 లక్షల కోట్ల రూపాయల విలువైన పంటలను మాత్రమే కొనుగోలు చేసిందని, కానీ 2014-24 మధ్య మాత్రం 18 లక్షల కోట్ల విలువైన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని చెప్పారు.

త్వరలో మా నిర్ణయం తెలుపుతాం

రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ " ఫిబ్రవరి 19-20 తేదీలలో మా ఫోరమ్ లలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రుణమాఫీ సహ ఇతర డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై వచ్చే రెండు మూడు రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అనుకుంటున్నా " అని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పప్పు ధాన్యాల అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. కొలంబియా, మొజాంబిక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న పప్పు ధాన్యాల విలువ 2 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయని వాటిని పంజాబ్ రైతులకు సబ్సిడి కింద అందిస్తే దేశంలో రెండో హరిత విప్లవం వస్తుందని అన్నారు. రైతుల తరఫున కేవలం న్యాయవాదీగా మాత్రమే ఇందులో పాల్గొన్నానని ఆయన అన్నారు.

ఒప్పందం కుదిరాకే ఇంటికి తిరిగి వెళ్లేది



 


సంయుక్త కిసాన్ మోర్చా C-2+50 ఫార్మూలాకు తప్పా దేనికి అంగీకరించేది లేదని ఆ సంస్థ నాయకులు తేల్చి చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రావడాని కంటే ముందే వీటిని పరిష్కారించాలని ఆ సంస్థ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఆగదని వారు స్పష్టం చేశారు. పంజాబ్ రైతులకు మద్ధతుగా హర్యానా ఖాప్ పంచాయతీలు కూడా మద్ధతు ప్రకటించాయి.

రైతుల ఆందోళనల నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులోని పాటియాలా, సాంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్ ప్రాంతాల్లో ఫిబ్రవరి 24 వరకూ ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ పై నిషేధం పొడిగించారు. హర్యానాలో ఈ రోజు వరకు నిషేధం ఉంది. మరోవైపు కొన్ని రైతు సంఘాలు నేషనల్ హైవే పై టోల్ కట్టకుండా నిరసనలు చేపట్టారు. 

Tags:    

Similar News