‘‘భారత్ బలపడుతున్న కొద్ది పన్ను భారం తగ్గుతుంది’’
జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయన్నా ప్రధాని మోదీ
By : The Federal
Update: 2025-09-25 11:14 GMT
భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్న కొలదీ ప్రజలపై పన్నుభారం తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు అనేవి ఎప్పటికి కొనసాగుతాయని చెప్పారు.
గ్రేటర్ నోయిడాలో ‘యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ ని ప్రధాని ప్రారంభించిన ఈ సందర్భంగా మాట్లాడారు. జీఎస్టీలో ఈ మధ్య తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు.
పన్ను సంస్కరణల వల్ల భారత అభివృద్ది వేగం ఫుంజుకోవడంతో పాటు ప్రజల చేతిలో డబ్బు మిగులుతుందని చెప్పారు. తన ప్రభుత్వం పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీని 2017 లో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసిందని, ఇప్పుడు మరోసారి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు.
సంస్కరణలు కొనసాగుతాయి..
‘‘మేము దీనిని ఇక్కడితో ఆపేయాలని అనుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంటే.. పన్ను భారం తగ్గుతూ ఉంటుంది. దేశ ప్రజల ఆశీస్సులతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రూ. 12 లక్షల వరకూ సంపాదించే వ్యక్తులపై ఆదాయపు పన్ను లేకపోవడం జీఎస్టీ 2.0 సంస్కరణలు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన హైలైట్ చేశారు. ఈ చొరవ వల్ల ప్రజల చేతులలో మరింత పొదుపు జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితిని యూపీఏ ప్రభుత్వ హయాంలోని పన్నులతో పోల్చి చూడాలని అన్నారు. ‘‘2014 కి ముందు వ్యాపారాలు లేదా కుటుంబాలు తమ బడ్జెట్ లను సమతుల్యం చేసుకోలేని విధంగా చాలా పన్నులు ఉండేవి.
2014 లో రూ. 1000 చొక్కాపై రూ. 117 పన్ను ఉండేది. 2017 లో జీఎస్టీ అమలు తరువాత ఆ పన్ను రూ. 50 తగ్గింది. ఇప్పుడు తదుపరి జీఎస్టీ సంస్కరణ తరువాత రూ. 1000 చొక్కాపై రూ. 35 మాత్రమే పన్ను వసూలు అవుతోంది’’ అన్నారు.
రక్షణ రంగం..
దేశం ఒక శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ది చేస్తోందని ప్రతిభాగం దేశంలో తయారు చేస్తుందని అన్నారు. దేశం ఇలాంటి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోందని మోదీ అన్నారు. రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
భారత్ స్వావలంబన సాధించాలని మోదీ గట్టిగా చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడులను పెంచాలని పిలుపునిచ్చారు. భారత్ లో తయారు చేయగల ప్రతి ఉత్పత్తిని భారత్ లో తయారుచేయాలని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆహ్వానిస్తూ భౌగోళిక రాజకీయ అంతరాయాలు, అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధి ఆకర్షణీయంగా ఉందని మోదీ చెప్పారు.