‘దెప్సాంగ్’ లో పెట్రోలింగ్ నిర్వహించిన భారత సైన్యం
భారత సైన్యం నాలుగు సంవత్సరాల తరువాత దెప్సాంగ్ ప్లెయిన్ లోని ఓ పాయింట్ లో పెట్రోలింగ్ నిర్వహించింది.
By : The Federal
Update: 2024-11-05 11:48 GMT
తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్ లోని ఒక పాయింట్‌లో భారత సైన్యం విజయవంతంగా పెట్రోలింగ్ నిర్వహించింది. చైనా దళాలతో ఈ ప్రాంతంలోని రెండు పాయింట్ల వద్ద ఇంతకుముందు ఘర్షణాత్మక వైఖరి ఏర్పడింది. డెప్సాంగ్, డెమ్ చోక్ వద్ధ రెండు సైన్యాలు గత నాలుగు సంవత్సరాలు పెట్రోలింగ్ చేయట్లేదు. డిస్ ఎంగేజ్ మెంట్ పూర్తయిన ఒక రోజు తర్వాత డెమ్‌చోక్‌లో పెట్రోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది.
“ డెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో పెట్రోలింగ్‌ను పునఃప్రారంభించడం కోసం భారత్- చైనా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నిబంధనలను అనుసరించి పెట్రోలింగ్ పాయింట్లలో ఒకదానిలో ఈ రోజు గస్తీ నిర్వహించాం. LACలో శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు ఇది మరో సానుకూల అడుగు" అని లేహ్ ఆధారిత ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే దళాలు ఏ పాయింట్‌లో పహారా కాశాయో మాత్రం తెలియరాలేదు.
Depsang వద్ద పెట్రోలింగ్..
భారత సైన్యం తూర్పు లడఖ్‌లోని రెండవ ఘర్షణ ప్రదేశమైన డెప్సాంగ్ వద్ద ధృవీకరణ పెట్రోలింగ్ ప్రారంభించిందని ప్రభుత్వం శనివారం తెలిపింది. వారానికొకసారి విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, చైనాతో డిస్ ఎంగేజ్ మెంట్ ఒప్పందం తరువాత, డెమ్‌చోక్, దేప్‌సాంగ్ రెండింటిలోనూ పరస్పరం పెట్రోలింగ్ ప్రారంభించారని తెలిపారు.
గత వారం, దీపావళి సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి అనేక సరిహద్దు పాయింట్ల వద్ద భారత - చైనా సైనికులు కూడా స్వీట్లు పంచుకున్నారు. ఈ ప్రాంతాలు రెండు కూడా 2020 కంటే ముందున్న స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
స్తంభింపచేసిన సంబంధాలు..
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అక్టోబర్ 21న ఢిల్లీలో మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా చర్చల అనంతరం భారత్-చైనాల మధ్య ఒప్పందం కుదిరిందని, 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఇది దారి తీస్తుందని చెప్పారు. తూర్పు లడఖ్‌లోని LAC వెంబడి పెట్రోలింగ్ డిస్ ఎంగేజ్ మెంట్ కోసం ఒప్పందం కుదిరింది.
ఇది నాలుగు సంవత్సరాల ప్రతిష్టంభన ముగించడానికి దారి తీస్తుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తరువాత తూర్పు లడఖ్‌లోని LAC వెంట ఉద్రిక్తతను తగ్గించేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. 1962 తరువాత రెండు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణ ఇదే.ఈ ఘర్షణ తర్వాత రెండు ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.