కాంగ్రెస్ లో చేరిన పప్పు యాదవ్.. పార్టీని కూడా..
లోక్ సభ ఎన్నికల వేళ పప్పు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ జన్ అధికార్ ను కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
By : The Federal
Update: 2024-03-20 12:10 GMT
జన్ అధికార్ పార్టీ నాయకుడు, పప్పు యాదవ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన యాదవ్, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్ భర్త. బిహార్ తూర్పు ప్రాంతమైన సీమాంచల్ లో మంచి ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. విలీనం విషయం ప్రకటించే సమయంలో ఆయనతో పాటు కుమారుడు సార్థక్ రంజన్ తో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో విలీన ప్రకటన వెలువడింది.
కాంగ్రెస్ నాయకత్వం తనకు గౌరవం ఇచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో "నియంతృత్వానికి" వ్యతిరేకంగా పార్టీ చేస్తున్న పోరాటంలో తాను చేరుతున్నానని యాదవ్ చెప్పారు.
“కాంగ్రెస్ కుటుంబం మాకు ఇచ్చిన గౌరవం అమూల్యమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇద్దరూ మాకు చాలా ప్రేమను పంచి నన్ను అప్యాయంగా చూసుకున్నారు. అనేక సందర్భాల్లో మాకు అండగా నిలబడ్డారు.
దేశ ప్రజల హృదయాలను ఏ నాయకుడైనా గెలుచుకున్నారంటే, అది రాహుల్ గాంధీ మాత్రమే. కుల గణనను నిర్వహించాలనే అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఆయన ఓబీసీల ఆందోళనలను కూడా అర్థం చేసుకున్నారు. ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నియంతలపై ఆయన నిరంతర పోరాటం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఆయన కూడా ఏకీభవించారు" అని ఆయన అన్నారు. పప్పు యాదవ్ తో పాటు బిహార్ కాంగ్రెస్ అఫైర్స్ ఇంచార్జ్ మోహాన్ ప్రకాశ్ కూడా ఈ విలీనం సందర్భంగా ఉన్నారు.
2024 లోక్‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బిహార్ లో విజయం సాధిస్తుందని పప్పు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేర్చుకున్నందుకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు ధన్యవాదాలు తెలిపారు.
"కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి అహర్నిషలు కష్టపడతాను ఈ విషయంలో నా శక్తిని పూర్తిగా వినియోగిస్తాను" అని యాదవ్ చెప్పారు.