'శత్రుదేశం జెట్లు ఎన్ని కూలాయని అడగరేం?'

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో ప్రభుత్వం ఎదురుదాడి;

Update: 2025-07-28 12:55 GMT
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ప్రతిపక్షం భారత వైమానిక దళం ఎన్ని జెట్ లు కోల్పోయిందో అడిగే బదులు మనం ఎన్ని జెట్లు కూల్చామో అడగాల్సి ఉందని ప్రతిపక్షానికి చురకలంటించారు.

‘‘పహల్గామ్ లో భర్తలను కోల్పోయిన మహిళల సిందూరానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీకారం తీర్చుకుందా అని ప్రతిపక్షం అడగాలి. దీనికి సమాధానం అవును. మనకు ఏవైన నష్టం జరిగిందా అని ప్రతిపక్షం అడిగితే సమాధానం.. లేదు’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ అన్నారు.
‘‘మనం ఎన్ని జెట్ లు కోల్పోయామని ప్రతిపక్షం అడుగుతోంది. కానీ మనం ఎన్ని శత్రు జెట్ విమానాలు కూల్చివేసామో అడగడం లేదు. ప్రతిపక్షం ఒక ప్రశ్న అడగాలనుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా అని అడగాలి. దానికి ఏకైక సమాధానం అవును’’ అని ఆయన అన్నారు.
లక్ష్యాలు నెరవేరడంతో ఆపరేషన్ ఆపాము..
భారత్- పాక్ సైనిక ఘర్షణను ఆపేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్న ప్రతిపక్షం విమర్శలు చేయడం పై కూడా ఆయన సభలో ప్రస్తావించారు.
‘‘ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి నాశనం చేసింది. ఉగ్రవాదంపై ఇక నుంచి జీరో టాలరెన్స్ అవలంబిస్తాం. మా లక్ష్యాలన్నీ నెరవేరాయి. కాబట్టి ఆపరేషన్ సిందూర్ నిలిపివేశాం. ఏదైన ప్రభావంతో ఆపరేషన్ నిలిపివేశామని చెప్పడం పూర్తిగా తప్పు’’ అని రక్షణ మంత్రి అన్నారు.
‘‘మే 10 న మేము వారి వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది. దాడులు ఆపమని మన దేశ డీజీఎంఓను కోరింది. దానికి మనం అంగీకరించాము. కానీ ఆపరేషన్ మాత్రం నిలిపివేయలేదు. భవిష్యత్ లో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహానికి దిగితే ఆపరేషన్ తిరిగి ప్రారంభం అవుతుంది’’ అని ఆయన అన్నారు.
భారత్ రెచ్చగొట్టలేదు
ఆపరేషన్ సిందూర్ విజయం గురించి రాజ్ నాథ్ మాట్లాడారు. రాత్రి చీకటిగా ఉన్నప్పటికీ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఆధారాలను సాయుధ దళాలు సేకరించాయని అన్నారు.
దాడి వెనక గల కారణాలను భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందనే వాస్తవాన్ని భారత డీజీఎంఓ మరుసటి రోజు ఉదయం తన పాకిస్తాన్ కౌంటర్ పార్ట్ కు తెలియజేశారని రక్షణమంత్రి అన్నారు.
‘‘ఇది ఉన్నప్పటికీ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించి మా సైనిక స్థావరాలపై దాడులు చేయడం ద్వారా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. అవన్నీ తటస్థీకరించబడ్డాయి. మా ప్రతిస్పందన వేగంగా, సమతుల్యంగా ఉంది. మా చర్య రెచ్చగొట్టేది కాదు, ఆత్మరక్షణలో ఉంది’’ అని ఆయన అన్నారు.
యుద్ధం ప్రారంభించే ఉద్దేశం లేదు
భారత వైమానిక రక్షణ వ్యవస్థలు కౌంటర్ - డ్రోన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పాకిస్తాన్ నుంచి వచ్చిన అన్ని దాడులను తిప్పికొట్టాయని రక్షణ మంత్రి అన్నారు.
‘‘మాకు ఎటువంటి నష్టాలు జరగలేదు’’ అని ఆయన అన్నారు. చక్లాలా, సర్గోధా, రహీంయార్ ఖాన్, సుక్కూర్ లలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై సాయుధ దళాలు దాడి చేసినప్పుడు భారత్ ధైర్యసాహసాలను ప్రపంచం మొత్తం చూసిందని రాజ్ నాథ్ అన్నారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడమే తప్ప యుద్ధం ప్రారంభించడం కాదని ఆయన అన్నారు.
‘‘భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ లక్ష్యం కాదు. మొత్తం రాజకీయ సైనిక లక్ష్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం యుద్ధం ప్రారంభించడం కాదు’’ అని రక్షణ మంత్రి అన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో భారత్ ఉగ్రవాదులకు ఎర్రగీత గీసిందని, దేశం ఎటువంటి అణు బ్లాక్ మెయిల్ కు తలవంచదని రాజ్ నాథ్ అన్నారు. ‘‘భారత్ ఎటువంటి అణు బ్లాక్ మెయిల్ కు లొంగదు. ఆపరేషన్ సిందూర్ లో, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మనం ఇచ్చిన ప్రతిస్పందన చాలాకాలం క్రితమే ఇవ్వాల్సింది, కానీ అవి జరగాల్సినప్పుడూ జరుగుతాయి’’ అని ఆయన అన్నారు.
Tags:    

Similar News