ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం మార్పు ప్రకటనతో తొక్కిసలాట
రెండు సార్లు రెండు రకాలుగా ఇచ్చిన అనౌన్స్‌మెంట్ల కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా..మరికొంతమందికి గాయాలయ్యాయి.;
ఢిల్లీ(Delhi) రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట(Stampede)కు సంబంధించి రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) తన నివేదికను బయటపెట్టింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా..అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. ప్రయాగరాజ్ వెళ్లే ‘‘కుంభ్ స్పెషల్ ట్రైన్’’ వేర్వేరు ప్లాట్‌ఫాంలపైకి రాబోతుందని మూడునిమిషాల వ్యవధిలో రెండు సార్లు చెప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
అయితే తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపిన సమయం, రైల్వే అధికారులు చెప్పిన సమయం, ఆర్పీఎఫ్ నివేదికలో పేర్కొన్న సమయం ఒకదానికొకటి భిన్నంగా ఉండడం గమనార్హం. ఢిల్లీ అగ్నిమాపక శాఖకు తొలిసారి ఢిల్లీ పోలీసుల నుంచి 9.55 గంటలకు సమాచారం అందిందని నివేదికలో పేర్కొన్నారు. రైల్వే అధికారులు 9.15 గంటలకు ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే ఆర్పీఎఫ్ నివేదిక ప్రకారం తొక్కిసలాట 8.48 గంటలకు జరిగినట్లు ఉంది.
ఇదిలా ఉండగా కేంద్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఫిబ్రవరి 17) ఈ ఘటనలో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. అలాగే స్టేషన్‌లో అసాధారణ రద్దీ కూడా లేదని వెల్లడించారు. ఘటన తర్వాత స్టేషన్‌లో భద్రతను పెంచేందుకు అదనపు సిబ్బందిని నియమించడం, ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయడం, సీసీటీవీ నిఘాను మరింత పెంచడం వంటి చర్యలు చేపట్టామని చెప్పారు.
రెండు ప్రకటనలతో తొక్కిసలాట: ఆర్పీఎఫ్
హిందుస్తాన్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీఎఫ్ న్యూఢిల్లీ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ ఇచ్చిన నివేదికలో.. ఫ్లాట్‌ఫాం నంబర్ 12 నుంచి బయలుదేరుతుందని మొదటగా చెప్పారు. రెండోసారి ఫ్లాట్‌ఫాం నంబర్ 16 నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. దీంతో తొక్కిసలాట ఏర్పడిందని వెల్లడించింది. అయితే ఫ్లాట్‌ఫాం నెంబర్ 16 నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
నివేదిక ప్రకారం.. కుంభ్ స్పెషల్ ట్రైన్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఫ్లాట్‌ఫాం నంబర్లు 12, 13, 14, 15 మీదున్న ప్రయాణికులు 2, 3 నడక వంతెనల వైపు మెట్ల ద్వారా పరుగులు తీశారు. అదే సమయంలో ఫ్లాట్‌ఫాం నెంబర్లు 14, 15లో ఉన్న మగధ్ ఎక్స్‌ప్రెస్, ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు మెట్లు దిగుతున్నారు. రెండు వైపులా ప్రయాణికుల రద్దీతో కొందరు కిందపడడంతో వారిపై నుంచి మిగత ప్రయాణికులు తొక్కుకుంటూ వెళ్లారు.
రాత్రి 8.15 గంటలకు ఫ్లాట్‌ఫాం నెంబర్ 12 నుంచి శివగంగా ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగిపోవడంతో నడక వంతెనలు 2, 3 పూర్తిగా కిక్కిరిశాయి. ఆర్పీఎఫ్ అధికారులు వంతెనలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. రాత్రి 8.45 గంటలకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే కుంభ్ స్పెషల్ వేదిక 12 నుంచి బయలుదేరుతుందని ప్రకటన వచ్చింది. అనంతరం ఈ ప్రత్యేక రైలు వేదిక 16 నుంచి బయలుదేరుతుందని మరో ప్రకటన వచ్చింది. దీని వల్ల ప్రయాణికుల్లో మరింత గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
హిందుస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం..మగధ్ ఎక్స్‌ప్రెస్, ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు వేదికలు 14, 15 వద్ద గుమికూడటంతో ప్రయాణికుల కదలిక ఆగిపోయింది. మెట్ల వెనుక భాగంలో ఎస్కలేటర్లు ఉన్న ప్రదేశంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లు నివేదిక వెల్లడించింది.
రద్దీ నియంత్రణలో లోపాలు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీ నియంత్రణకు మొత్తం 270 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. అయితే వీరిలో కేవలం 80 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన సిబ్బందిని ప్రయాగ్‌రాజ్‌లో విధులు నిర్వహించేందుకు పంపించారని నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా.. తొక్కిసలాటలో గాయపడిన ఐదుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి 8 కంపెనీల పారామిలిటరీ దళాలను స్టేషన్ లోపల, బయట విధుల్లో పెట్టినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్రయాగ్‌రాజ్(Prayagraj) వెళ్తున్న రైళ్లను ప్రత్యేకంగా నిఘా ఉంచారు. జాయింట్ సీపీ (ట్రాన్స్‌పోర్ట్) విజయ్ సింగ్, డీసీపీ (రైల్వే) కెపీఎస్ మల్హోత్రా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు. "మేము బారికేడ్లు ఏర్పాటు చేసి, గస్తీ పెంచి, క్విక్ రియాక్షన్ టీమ్‌లను విధుల్లో పెట్టాం. అదనపు సీసీటీవీ పర్యవేక్షణను ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్‌లో రియల్-టైమ్ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం," అని ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా.. ప్రయాణికుల కోసం స్టేషన్ వెలుపల ఒక ప్రత్యేక టెంట్ (పండాల్) ఏర్పాటు చేశారు. కుంభ మేళా ముగిసే (ఫిబ్రవరి 26) వరకు దీన్ని ఇలాగే ఉంచుతామని చెప్పారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. స్టేషన్‌లోని ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మైక్ ద్వారా ప్రయాణికులకు ఈ కొత్త ఏర్పాట్ల గురించి ప్రకటనలు చేస్తున్నాడు.
ఎలాంటి కుట్ర లేదు..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. అత్యధిక రద్దీ ఉన్న 60 స్టేషన్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ప్రయాణికులు మెట్ల మీద కూర్చోకూడదని అవగాహన పెంచుతామని తెలిపారు. తొక్కిసలాట ఘటనలో
ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో స్టేషన్‌లో అసాధారణ రద్దీ ఏమీ లేదని అన్నారు. ప్లాట్‌ఫారమ్ మార్పు ప్రకటన వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. "ఇంక్వైరీ కమిటీ దీనిని లోతుగా పరిశీలిస్తోంది," అని పేర్కొన్నారు.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఉన్న 16 ప్లాట్‌ఫారమ్‌ల సామర్థ్యం 48,000 మంది ప్రయాణికులు. ప్రతి ప్లాట్‌ఫారమ్ కెపాసిటీ 3,000 మంది.
తొక్కిసలాట జరిగిన ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య 12,208 అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు అమ్ముడైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయానికి సుమారు 9,600 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవుతాయి. అలాగే రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య సాధారణ రోజుల్లో 8,900 టిక్కెట్లు అమ్ముడవుతుండగా, ఆ రోజు 7,600 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మరొక ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు రాత్రి 7:15లకు ఫ్లాట్‌ఫాం నెంబర్ 12 నుంచి బయలుదేరింది. టిక్కెట్ల విక్రయాల్లో పెరుగుదల కారణంగా అదే ఫ్లాట్‌ఫాం నుంచి రాత్రి 8:50కి మరో ప్రత్యేక రైలును సిద్ధంగా ఉంచారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్ 12లోని ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్ గురించి అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే కొంత మంది ప్రయాణికులు ఈ అనౌన్స్‌మెంట్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కోసం ఇచ్చినట్లు పొరపడ్డారని అధికారిక సమాచారం వెల్లడించింది.
"వారు ప్లాట్‌ఫారమ్ 14లో ఉన్నారు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రకటన వినిపించిన తర్వాత అయోమయానికి గురై ప్లాట్‌ఫారమ్ 12వైపు కదిలారు," అని ఒక రైల్వే అధికారి తెలిపారు.
"అయోమయ పరిస్థితిలో మెట్లు ఎక్కుతుండగా..చాలామంది ప్రయాణికులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారిలో తలపై భారీ బరువు మోస్తున్న వ్యక్తి అదుపు కోల్పోయి వెనుక ఉన్నవారిపై పడిపోయాడు. ఇది తొక్కిసలాటకు దారితీసింది," అని అధికారి వివరించారు.
రైల్వే మంత్రి స్పందన..
రైల్వే భవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ద్వారా వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. "ఈ స్టేషన్లలో ఎక్కడా అధిక రద్దీ కనిపించలేదు. మేము గతంలో జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. అందువల్ల ఈసారి భారీగా ప్రయాణికుల గుంపును సమర్థంగా నిర్వహించగలిగాం," అని వైష్ణవ్ పేర్కొన్నారు.
"గత కుంభమేళాలో కేవలం 4వేల ప్రత్యేక రైళ్లు నడిపాం. ఈసారి మేం 13వేల రైళ్ల ప్రణాళిక రూపొందించగా..ఇప్పటివరకు 12,583 రైళ్లు నడపగలిగాం," అని వివరించారు. "ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణికుల కదలిక ఉండదు. రైల్వే అధికారులు రాత్రింబవళ్ళు పని చేశారు. ఇంతటి భారీ గుంపును నిర్వహించడం చాలా క్లిష్టమైన పని," అని మంత్రి పేర్కొన్నారు.
ప్రయాణికుల భయానక అనుభవాలు..
తొక్కిసలాటలో చిక్కుకున్న వారు తమ భయానక అనుభవాలను వెల్లడించారు. పూనమ్ దేవి (50) బీహార్ నుంచి ఢిల్లీకి తన కుమార్తె, అల్లుడిని చూడటానికి వచ్చారు. కానీ, ఇది వారి చివరి కలయికగా మారింది. ఆమె బంధువైన ఆషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్ దేవి, ఆమె భర్త మేఘనాథ్ కుశ్వాహా ముందుగా మహా కుంభ్ మేళాకు వెళ్లి వచ్చిన తర్వాత ఢిల్లీ వచ్చారు. "ఆమె శనివారం తన గ్రామం గంగాజల్‌కు తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగి ప్రాణాలొదిలారు," అని ఆషా సింగ్ తెలిపారు.
తన కుమార్తె మృతితో ప్రభు షా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. "నా కుమార్తె ఢిల్లీ బిజ్వాసన్ ప్రాంతానికి వచ్చి ఆరు నెలలే అయ్యింది. ఉద్యోగం దొరికిన ఆనందంలో ఉంది. శనివారం ఆమె తన అత్తగారు, కజిన్‌తో కుంభ్ మేళాకు బయలుదేరింది," అని షా కన్నీటి మధ్య వివరించారు.
కూలీ కార్మికుడయిన మనోజ్ తన కుటుంబానికి ఏకైక ఆధారం. తొక్కిసలాటలో మృతి చెందడంతో అతడి భార్య, ఇద్దరు పిల్లలు జీవితం దుర్భరంగా మారింది.