బీహార్: మాటమార్చిన ప్రశాంత్ కిషోర్..
ఎన్నికల్లో ఓటమికి ప్రాయశ్చితంగా ఒక రోజు మౌనం..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలలో ఈ సారి JD(U) 25 సీట్లు కూడా గెలవదని, అంతకంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందిందే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) గతంతో ఛాలెంజ్ విసిరారు. కాని ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది. 243 నియోజకవర్గాల్లో 238 స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎక్కడా కూడా ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. ఎన్డీఏ కూటమి మొత్తం 202 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89, జేడీ(యూ) 85, చిరాగ్ పాస్వాన్ ఎల్జెపీ (రామ్ విలాస్) 19 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పీకే తొలిసారి మాట్లాడారు. తన వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగా ఒక రోజు మౌన ప్రతిజ్ఞ చేశారు.
"మేం మా వంతు ప్రయత్నం చేశాం. నిజాయతీగా ప్రయత్నించాము. ప్రభుత్వాన్ని మార్చలేకపోయాం. ఓటమిని అంగీకరిస్తున్నా. ఎక్కడ తప్పు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకుంటాం, " అని అన్నారు.
‘రాజకీయాల నుంచి వైదొలగను..’
తాను రాజకీయాల నుంచి వైదొలగనని కిషోర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన చేసిన ప్రకటనకు ఇది విరుద్ధంగా ఉంది. జేడీ(యూ) 25 సీట్లు దాటితే తాను రాజీనామా చేస్తానని గతంలో చెప్పారు. అయితే ఈసారి మరో కొత్త అల్టిమేటం జారీ చేశారు. పాలక కూటమి 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రతిజ్ఞ చేశారు.