కర్రెగుట్ట నుంచి పారిపోయి ఆంధ్రాలో షెల్టర్ కోసం వచ్చిన హిడ్మా..!
నక్సల్స్ ఏరివేతలో భారత ప్రభుత్వానికి హిడ్మా ఎన్‌కౌంటర్ భారీ విజయమే.
నక్సల్ కేంద్రకమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా మంగళవారం భద్రతా బలగాల చేతితో హతమయ్యాడు. అతడి ఎన్‌కౌంటర్ నక్సల్స్ ఏరివేతలో ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. మావోయిస్ట్ పార్టీకి మూలస్తంభంగా ఉన్న హిడ్మా నేలకూలడంతో మావోయిస్ట్ పార్టీ కూడా రేపో మాపో కనుమరుగవ్వొచ్చన్న చర్చ మొదలైంది. నక్సల్స్ రహిత భారత్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించింది. మావోయిస్ట్‌లు లొంగిపోవాలని, లేకపోతే వారికి మరణం తథ్యమని హెచ్చరించారు. అంతేకాకుండా లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వందల మంది మావోయిస్ట్ నేతలు లొంగిపోగా.. మరికొందరు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బండి ప్రకాష్ ఇలా చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే హిడ్మాను కూడా లొంగిపోవాలంటూ అతని తల్లిచేత ఓ వీడియో చేయించారు అధికారులు. కానీ హిడ్మా లొంగిపోలేదు. ఆంధ్రప్రదేశ్ అల్లూరిసీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అధికారులు చేపట్టిన కూంబింగ్‌లో మంగళవారం మరణించాడు.
కర్రెగుట్టలో గాలింపులు.. ఏపీలో మకాం..
అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కోసం ప్రభుత్వ భద్రతా బలగాలు చాలా కాలంగా వెతుకుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. పలువురు మావోయిస్ట్ నేతలు వారి చేతుల్లో హతమయ్యారు. మరికొందరు పోలీసులు ముందు ఆయుధం వీడారు. కానీ హిడ్మా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కు ప్రాంతం వరకూ భారీ ఆపరేషన్లు జరిగాయి. ఆ సమయంలో హిడ్మా తాజా ఫోటో బయటకు రావడం అతడి ప్రాంతాన్ని గుర్తించడంలో కీలకంగా మారింది. అయితే హిడ్మా కోసం భద్రతా బలగాలు కర్రెగుట్ట దండకారణ్యంలో ముమ్మరంగా గాలింపులు చేస్తున్నాయి. దీంతో అతడు ఏపీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో కూంబింగ్ జరిగి, మావోయిస్ట్‌లప దాడులు జరిగి చాలా కాలం అయింది. ఆపరేషన్ కగార్ ప్రభావం కూడా ఏపీ అడవుల్లో లేదు. అందుకే హిడ్మా.. ఒడిశా మీదుగా ఏపీ మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చి ఉండొచ్చని వాదన వినిపిస్తోంది. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడం కోసమే హిడ్మా.. ఏపీకి చేరుకొని ఉండొచ్చని, ఏపీలో కూబింగ్ కూడా జరుగకపోవడం వల్లే ఏపీ బెస్ట్ చాయిస్ అని హిడ్మా అనుకుని ఉండొచ్చని సమాచారం.
హిడ్మా గురించి ఉప్పందించింది ఎవరు ?
ఎవరికీ తెలియకుండా హిడ్మా ఏపీకి చేరుకుంటే.. అసలు అతడు అక్కడ ఉన్నాడని పోలీసులకు ఉప్పందించింది ఎవరూ. చాలా అడవుల్లో కూంబింగ్ చేయని ఏపీ పోలీసులు.. అనూహ్యంగా మంగళవారం అకస్వాత్తుగా ఎందుకు కూంబింగ్ చేశారు. హిడ్మా అక్కడ ఉన్నాడని సమాచారం రావడంతోనే పోలీసులు కదిలారా? అదే నిజమయితే హిడ్మా సమాచారాన్ని ఎవరు అందించి ఉంటారు? అన్న ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయి ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశన్న లాంటి నాయకుడు.. ఎవరైనా లొంగిపోదలుచుకుంటే తనను కాంటాక్ట్ చేయాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే లొంగిపోవాలని అనుకుంటున్న నేతలు.. లొంగిపోయిన నాయకులకు హిడ్మా సమాచారం ఇచ్చారని, వారి నుంచే అధికారులకు చేరిందని వాదన వినిపిస్తోంది. అత్యంత కీలక నేత అయిన హిడ్మా ఉన్నాడని సమాచారం రావడంతో ఏపీ పోలీసులు, భద్రతా బలగాలు హుటాహుటిన మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్ చేపట్టాయని, హిడ్మాను హతం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ మైండ్ గేమ్ ఫలించిందా..?
కొన్ని రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ.. పూవర్తి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లి మాడ్వి పూంజితో మాట్లాడారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగానే హిడ్మాను ఆయుధం వీడి జనజీవ స్రవంతిలో కలవాలని ఆమె కోరారు. కాగా అదంతా కూడా హిడ్మాను ఎలిమినేట్ చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న మైండ్ గేమ్ అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించడంతో.. ప్రభుత్వ మౌండ్ గేమ్ ఫలిచిందన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ గేమ్ సక్సెస్ అయిందా? లేదంటే హిడ్మా ఏదైనా పొరపాటు చేశాడా? అని కూడా కొందరు చర్చిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తన టార్గెట్‌ను రీచ్ అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
హిడ్మా అంత కీలకం ఎందుకు..?
మావోయిస్ట్‌లు చేసిన అత్యంత కీలక మిషన్‌లలో హిడ్మా అత్యంత ప్రధాన పాత్ర పోషించాడు. జవాన్లు, కీలక నేతలపై చేసిన దాడులకు వ్యూహాలు రచించడం, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడంలో హిడ్మా కీలకంగా వ్యవహరించారు. గెరిల్లా స్టైల్‌లో హిడ్మాది అందెవేసిన చెయ్యి. అందుకే పలు కీలక మిషన్‌లకు అతడు నాయకత్వం వహించాడు. హిడ్మా ప్రణాళికలు భద్రతా బలగాలకు భారీ నష్టం కలిగించినప్పటికీ, మావోయిస్టుల వైపు మాత్రం తక్కువ ప్రాణనష్టం ఉండేదని నిఘా వర్గాలు చెబుతాయి. అతడే తన బెటాలియన్‌కు యుద్ధ వ్యూహాలు, గెరిల్లా పద్ధతులు నేర్పే బాధ్యత తీసుకున్నాడు. సీఆర్పీఎఫ్ శిబిరాలు, పోలీసు కూంబింగ్ బృందాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడంలో అతడి ప్రణాళికలు కీలకంగా మారాయి. పరిశోధన–అభివృద్ధి విభాగం కూడా అతడి పర్యవేక్షణలో పనిచేసేది.
2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు
2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు
2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర
2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చాడు
2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు
మావోయిస్ట్ పార్టీ పని అయిపోయినట్లేనా..!
హిడ్మా మరణంతో మావోయిస్ట్ పార్టీ పని అయిపోయిందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరుగా కేంద్ర కమిటీ సభ్యులు పార్టీని వీడి అధికారుల ముందు లొంగిపోతున్నారు. మల్లోజుల, ఆశన్న, బండి ప్రకాష్ ఇలా చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీని వీడారు. జనజీవన స్రవంతిలో కలవడానికి ఆసక్తి చూపారు. కాగా ఆవన్న.. తాము లొంగిపోలేదని.. తమ పోరాటం సమాజం నుంచి చేస్తామని అన్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీలో హిడ్మానే అత్యంత పెద్ద నాయకుడిగా ఉన్నాడు. కేంద్ర కమిటీ సభ్యులు డేంజరస్‌గా ఉన్న నేత కూడా అతనే.. అతనిపైనే పార్టీ బాధ్యతలు అన్నీ నిలిచాయి. అలాంటిది ఇప్పుడు అతడు కూడా ఎదురుకాల్పుల్లో మరణించడంతో.. మావోయిస్ట్ పార్టీని ముందు నడిపంచే నేత మరొకరు లేరన్న వాదన బలోపేతం అవుతోంది. దీంతో హిడ్మా మరణంతో మావోయిస్ట్ రహిత భారత్ వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత ముందడుగు వేసిందన్న చర్చ మొదలైంది.
కేంద్రానికి గొప్ప విజయం..
పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు దశాబ్దాలుగా తలనొప్పిగా మారిన మావోయిస్ట్ నేత హిడ్మా అనడంలో సందేహం లేదు. అతడు అంత పెద్ద సమస్యగా మారడం వల్లే పలు రాష్ట్రాలు కలిపి మొత్తం రూ.6కోట్ల వరకు అతడి తలపై రివార్డ్ పెట్టాయి. ఎక్కడ వెతికినా? ఎంత వెతికినా ఇన్నాళ్లూ అతడి ఆచూకి తెలియలేదు. అలాంటిది ఇప్పుడు అతడిని హతం చేయంతో నక్సల్స్‌పై చేస్తున్న ఆపరేషన్‌లో ఇది అత్యంత కీలక అంశంగా, ప్రభుత్వానికి అతిపెద్ద విజయంగా మారింది.
17 ఏళ్లకే అరణ్యంలో అడుగు
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు విలాస్, హిడ్మాల్, సంతోష్ వంటి కోడుపేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన అతడు చిన్న వయసులోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై 17 సంవత్సరాలకే పార్టీలో చేరాడు. ఇంగ్లీష్, హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో మాట్లాడగలడు. దండకారణ్యంలో పార్టీ కేడర్‌ను ముందుండి నడిపించడంలో నిష్ణాతుడిగా ఎదిగి, పెద్ద దాడులకు వ్యూహాలు రచించడానికి ప్రత్యేక గుర్తింపు పొందాడు. కేంద్ర బలగాల శిబిరాలపై ఆకస్మిక దాడులు చేయడంలో అతడికి మంచి పట్టుంది. పీఎల్‌జీఏ తొలి బెటాలియన్‌కు కమాండర్‌గా వ్యవహరించుతూ ప్రతి ఆపరేషన్‌లో స్వయంగా పాల్గొనడం వల్ల అతడు భద్రతా సంస్థల 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో చేరాడు. కొద్ది సంవత్సరాల కిందట కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకున్నాడు — సుక్మా నుంచి ఆ స్థాయికి చేరిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందాడు.
బలమైన నెట్‌వర్క్..
అంతేకాకుండా హిడ్మా.. స్థానిక ఆదివాసీ తెగకు చెందినవాడు కావడంతో అతడికి అక్కడ అంతా సహాయం చేసేవారు. అందువల్ల అతడు కదిలే ప్రాంతం చుట్టుపక్కల భద్రతా బలగాల కదలికల సమాచారం ముందుగానే తెలిసిపోయేవి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతంలో కార్యకలాపాలు జరపటం అతనికి భద్రతా కోణంలో అనుకూలంగా మారేది. ఏడో తరగతి విద్య మాత్రమే ఉన్నప్పటికీ ఇంగ్లీష్‌ను చక్కగా మాట్లాడగలడని 2015లో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఒక జర్నలిస్ట్ వెల్లడించారు.