విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు !

మొదటగా కేవలం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం.

Update: 2025-11-17 17:00 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను విడతల వారీగా నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగే ప్రమాదం ఉన్న క్రమంలో ముందుగా కేవలం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లతో మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్ఘం నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు చేసింది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రిమండలి తీర్మానం చేయడం, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలను మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది.

ఈ పరిణామాలను చర్చిస్తూనే, ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15 వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యం, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో శతవిధాలా ప్రయత్నించిన విషయాలను గుర్తుచేస్తూ ఈ అంశంపై న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాలనివ మంత్రిమండలి నిర్ణయించింది.

ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రిమండలి భావించింది. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని, అలాగే, డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించింది.

మంత్రివర్గం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..

  • గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసినట్టు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టరూపం కల్పిస్తామన్నారు.
  • ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రిమండలి తీవ్ర సంతాపం తెలియజేసింది. రాష్ట్ర ప్రజలకు వారందించిన జయ జయహే తెలంగాణ.. రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని కేబినేట్ తీర్మానించింది.
  • అందెశ్రీ కుమారుడు దత్తసాయి కి డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం ఇవ్వాలని, అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని తీర్మానించింది.
  • ప్రజల అభ్యర్థన మేరకు ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెట్టాలని మంత్రిమండలి తీర్మానించింది.
Tags:    

Similar News