ఫిరాయింపు నేతల అంశంలో స్పీకర్‌కు నాలుగు వారాల గడువు
బీఆర్ఎస్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.
ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు అంశం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో స్పీకర్‌కు మరో నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు కాగా వాటిని సోమవారం.. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు ఫిరాయింపు నేతలపై ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే దాదాపు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్.. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయపోరాటం స్టార్ట్ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే మూడు నెలల్లో ఫిరాయింపు నేతలపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తెలిపింది.
ఫిరాయింపు నేతలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం జూలై 31న ఆదేశించింది. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ధర్మాసనం ఇచ్చిన గడువులోగా తీర్పు ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరో రెండు నెలల సమయం కావాలని కోరుతూ స్పీకర్ తరఫున శాసనసభ కార్యదర్శి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కార్యదర్శి మిసిలేనియస్ దాఖలు చేసిన అప్లికేషన్ 14వ నంబరులో లిస్ట్ అయింది.
అదే సమయంలో, మూడు నెలల్లోపు కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేశారు. అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కోర్టే నేరుగా పిటిషన్లపై విచారణ చేసి తీర్పు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఇవి కూడా న్యాయస్థానం ముందుకు రాగా.. వీటిని సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. స్పీకర్‌కు మరో నాలుగు వారాల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి చర్యలను ఆ తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.