అధికారంలో ఉంటేనే బీఆర్ఎస్ పులా, లేకపోతే...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నది వాస్తవం
ఇపుడీ విషయంమీదే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచినందుకే కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గెలిచింది కాబట్టే కాంగ్రెస్ రెచ్చిపోతోంది. అదే బీఆర్ఎస్ గెలిచుంటే కేటీఆర్ అండ్ కో ఏమిచేసుండేవారు, హుందాగా, మౌనంగా ఉండేవారేనా ? భూమ్యాకాశాలు కలిసిపోయేలాగ రచ్చ రచ్చ చేసుండేవారు అనటంలో సందేహంలేదు. సరే, ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నది వాస్తవం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిదెబ్బ నుండి పార్టీ ఇంకా కోలుకోలేదని చెప్పవచ్చు.
ఎలాగంటే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన కొద్దినెలలకే అంటే 2024, మే 13వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక జరిగింది. అప్పుడే పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి. 2023 ఎన్నికలో ఈ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన ఆమె సోదరి లాస్య నివేదిత ఓడిపోయింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కసీటులో కూడా గెలవలేదు. తర్వాత 2024 జూన్ నెలలో జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఉపఎన్నికలో ఓడిపోయింది. ఈ ఉపఎన్నిక ఎందుకు జరిగిందంటే 2023లో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పల్లా రాజేశ్వరరెడ్డి ఎంఎల్ఏగా గెలిచారు. ఎంఎల్ఏగా గెలిచారు కాబట్టి ఎంఎల్సీగా రాజీనామా చేశారు. పల్లా రాజీనామా చేశారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనుగు రాకేష్ రెడ్డి ఓడిపోయారు.
ఆతర్వాత 2025, ఫిబ్రవరిలో రెండు ఉపాధ్యాయ కోటా, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ నియోజకవర్గాలకు పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోటా ఎంఎల్సీ ఎన్నిక జరిగింది. అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ కోటా ఎంఎల్సీ ఎన్నిక జరిగింది. మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు ఒకేరోజు జరిగాయి. ఈ స్ధానాల్లో రెండింటిని బీజేపీ, ఒకటి పీఆర్టీయు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ అసలు పోటీనే చేయలేదు. గెలుపు అవకాశాలు లేవన్న ఉద్దేశ్యంతో పోటీచేయటానికే భయపడి దూరంగా ఉండిపోయింది. మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్ పై చాలా ఒత్తిగితెచ్చారు. బీజేపీని గెలిపించటం కోసమే పోటీకి దూరంగా ఉండిపోయారని, ఓటమిభయంతోనే పోటీచేయలేదని ఎన్నిప్రచారాలు జరిగినా కేసీఆర్ పట్టించుకోకుండా, పార్టీ నేతలు ఒత్తిడిచేసినా పోటీకి దూరంగా ఉండిపోయారు.
తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. అంటే దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీలకు, ఒక ఎంఎల్సీకి ఉపఎన్నిక జరిగితే మూడింటిలోను కారుపార్టీ ఓడిపోయింది. అలాగే మరో మూడు ఎంఎల్సీ సీట్లకు జరిగిన ఎన్నికలో అసలు పోటీకే దూరంగా ఉండిపోయింది. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే మాత్రమే పులిలాగ వ్యవహరిస్తుంది. అదే ప్రతిపక్షంలో ఉంటే...