ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలపై కీలక నిర్ణయం ?

సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొదలుపెట్టిన విచారణకు ఇద్దరు ఎంఎల్ఏలు సహకరించటంలేదు.

Update: 2025-11-16 08:19 GMT
BRS MLAs Kadiyam Srihari and Danam Nagendar

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు పదిమందిలో ఇద్దరి వ్యవహారం అంతుపట్టడంలేదు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొదలుపెట్టిన విచారణకు కూడా ఇద్దరు ఎంఎల్ఏలు సహకరించటంలేదు. ఇంతకీ ఆ ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరంటే (Kadiyam Srihari)కడియం శ్రీహరి, (Danam Nagendar)దానం నాగేందర్. వీళ్ళిద్దరు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)అభ్యర్ధులుగా స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్ లో పోటీచేసి గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే మిగిలిన ఎనిమిది మంది ఎంఎల్ఏల్లాగే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. సుప్రింకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ పదిమంది ఎంఎల్ఏల విచారణ మొదలుపెట్టారు. పదిమంది ఎంఎల్ఏలకూ స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీచేసింది. వీరిలో ఎనిమిది మంది ఎంఎల్ఏలు నోటీసులకు సమాధానాలిచ్చారు. తర్వాత జరిగిన విచారణలో తమ లాయర్లను పెట్టుకుని హాజరయ్యారు. తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని పదేపదే విచారణలో వాదించారు.

వీళ్ళసంగతి ఇలాగుంటే మిగిలిన ఇద్దరు కడియం, దానం మాత్రం స్పీకర్ నోటీసులకు సమాదానాలు ఇవ్వలేదు, లాయర్లను పెట్టుకుని విచారణకు హాజరవ్వలేదు. మొదటిసారి నోటీసులు అందినపుడు సమాధానం చెప్పటానికి కాస్త సమయం కావాలని కడియం స్పీకర్ కు లేఖ రాశారు అంతే. ఆతర్వాత నోటీసులకు, విచారణకు ఇద్దరూ స్పందించలేదు. విచారణకు సుప్రింకోర్టు విధించిన మూడునెలల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగిసింది. అందుకనే విచారణకు మరో రెండునెలలు సమయం పొడిగించమని సుప్రింకోర్టుకు స్పీకర్ విజ్ఞప్తిచేస్తు ఒక లేఖ రాశారు. ఆ విజ్ఞప్తి విషయంలో సుప్రింకోర్టు స్పందన ఏమిటన్నది ఇప్పటికీ తెలీలేదు.

స్పీకర్ లేఖకు సుప్రింకోర్టు స్పందిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కడియం, దానం ఎందుకని స్పీకర్ కు సహకరిచంటంలేదు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. స్పీకర్ విచారణపై వీళ్ళిద్దరి మనసులో ఏముంది ? వీళ్ళ వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. దానం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఎలాగూ తనపైన అనర్హత వేటుపడటం ఖాయమని అర్ధమైన దానం అంతవరకు ఆగకుండా తనంతట తానే రాజీనామా చేసేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీనామా ద్వారా వచ్చే ఉపఎన్నికలో మళ్ళీ తానే కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలవచ్చనే ఆలోచన దానంలో ఉందనేది కాంగ్రెస్ వర్గాల సమాచారం. రాజీనామా ద్వారా ఉపఎన్నిక వస్తే దానంకు అసలు టికెట్ ఇస్తారా ? ఇచ్చినా గెలుస్తాడా అన్నది వేరేచర్చ.

దానం విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని పక్కనపెట్టేస్తే మరి కడియం ఆలోచన ఏమిటన్నది తెలీటంలేదు. రాజీనామాయోచనలో కడియం ఉన్నారనే ప్రచారం అయితే ఎక్కడా జరగటంలేదు. రాజీనామా చేసే ఆలోచనలో లేనపుడు స్పీకర్ విచారణకు అయినా హాజరుకావాలి కదా ? ఇక్కడే కడియం వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. వీళ్ళిద్దరు మినహా మిగిలిన 8మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు తెల్లం వెకంటరావు, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. అలాగే లాయర్లను పెట్టుకుని స్పీకర్ సమక్షంలో విచారణకు కూడా హాజరయ్యారు. పై ఎనిమిది మంది ఎంఎల్ఏల విషయం ఓకేనే అయితే మిగిలిన ఇద్దరు కడియం, దానం విషయమే నాట్ ఓకే.

ఒకవేళ సుప్రింకోర్టు గడువు ఇవ్వకపోతే స్పీకర్ ఏమిచేస్తారు ? ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రక్రియను రిపోర్టు రూపంలో సుప్రింకోర్టుకు అందించటం మినహా స్పీకర్ చేయగలిగేది ఏమీలేదు. అందులో 8 మంది ఎంఎల్ఏలు విచారణకు హాజరైనట్లుగాను మిగిలిన ఇద్దరు హాజరుకాలేదనే రిపోర్టులో చెబుతారు. స్పీకర్ విచారణకు కడియం, దానం గైర్హాజరయ్యారంటే సుప్రింకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయనట్లే అని అర్ధంవస్తుంది. ఈ విషయం ఇటు స్పీకర్ కు అటు ఇద్దరు ఎంఎల్ఏలకు బాగాతెలుసు. ఈనేపధ్యంలోనే వీళ్ళిద్దరి వ్యవహారాన్ని స్పీకర్ ఎలా డీల్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News