లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో బీఆర్ఎస్ నేతకు నోటీసులు
పుట్టా మధు విచారణకు నోటీసులు ఇవ్వటంతో కీలకపరిణామం చోటుచేసుకున్నది
పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే హత్యకేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పుట్టా మధుకు సీబీఐ నోటీసులు జారీచేసింది. హత్య కేసును విచారిస్తున్న సీబీఐ సోమవారం పుట్టా మధుకర్ ను విచారణకు రమ్మని నోటీసులో చెప్పింది. రామగుండంలోని స్దానిక సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులో స్పష్టంచేసింది. హత్యకేసు విచారణలో భాగంగానే రామగుండంలో సీబీఐ తాత్కాలికంగా ఆఫీసును ఏర్పాటుచేసుకున్నది. హత్య కేసు విచారణలో సాక్ష్యులు, అనుమానితులందరినీ రామగుండం ఆపీసులోనే సీబీఐ విచారిస్తోంది.
ఇప్పటికే రామనరావు తండ్రి కిషన్ రావుతో పాటు మృతుల కుటుంబ సభ్యులను, బంధువులతో పాటు పలువురు సాక్ష్యులను కూడా విచారించింది. ఇపుడు పుట్టా మధు విచారణకు నోటీసులు ఇవ్వటంతో కీలకపరిణామం చోటుచేసుకున్నది.
కేసు చరిత్ర
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర 2021, ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం రోడ్డుమీదే లాయర్ దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి హత్య జరిగింది. హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్ దంపతులు ఒక కేసు వ్యవహారంలో పెద్దపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు నుండి బయటకు వచ్చి రోడ్డుమీద కారులో వెళుతున్న లాయర్ దంపతుల కారును మరో కారులో కొందరు అడ్డగించారు. లాయర్ల కారుదగ్గరకు వచ్చి ముందు వామనరావును కత్తులతో నరికేశారు. అడ్డుకునే ప్రయత్నంచేసిన ఆయన భార్య నాగమణిని కూడా కత్తులతో నరికేశారు. కత్తిపోట్లతోనే తప్పించుకునేందుకు వామనరావు కారులో నుండి బయటకు వచ్చినా దుండగులు వదిలిపెట్టకుండా మళ్ళీ పొడిచారు. దాంతో రోడ్డుపైన వామనరావు, కారులో నాగమణి పడిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి వచ్చారు. పోలీసులతో వామనరావు మరణ వాగ్మూలం ఇస్తు పుట్టా మధుకర్ పేరును ప్రస్తావించినట్లుగా ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు కూడా కోర్టుకు చెప్పారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే సీబీఐ విచారణ జరగాల్సిందే అన్న కిషన్ రావు వాదనతో హైకోర్టు అంగీకరించలేదు. అయితే కిషన్ రావు సుప్రింకోర్టులో 2021, సెప్టెంబర్ 18వ తేదీన పిటీషన్ వేశారు. పిటీషనర్ వాదనను విన్న సుప్రింకోర్టు అన్నీవిషయాలను పరిశీలించి కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. సోమవారం సీబీఐ విచారణలో పుట్టామధుకర్ ఏమి చెబుతారో చూడాలి.