పాత బస్తీ నుంచి సీమాంచల్ దాకా : మజ్లిస్ హవా
సీమాంచల్ ఓటర్ల మద్దతుతో మజ్లిస్ కొత్త రాజకీయ సమీకరణాలు...గల్లీ పార్టీ నుంచి జాతీయ వేదిక దాకా...
By : Saleem Shaik
Update: 2025-11-16 00:30 GMT
పాతబస్తీ గల్లీల్లో పుట్టిన మజ్లిస్ (AIMIM) పతంగ్ ఇప్పుడు బీహార్ ఆకాశంలోనూ ఎగురుతోంది. సీమాంచల్‌లో వరుస విజయాలతో ఏఐఎంఐఎం స్థానిక పార్టీ నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా మారుతున్న సంకేతాలను మరోసారి బలంగా వెల్లడించింది.
- హైదరాబాద్ పాతబస్తీ నుంచి ఆరంభమైన పతంగ్ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు దాటి దేశ వ్యాప్తంగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)గా ఎదిగి బీహార్ సీమాంచల్ వరకు దూసుకెళ్లి అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి.
- ఒకానొక చిన్న గల్లీ పార్టీగా భావించిన మజ్లిస్, ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో శాసనసభల్లో ప్రాతినిథ్యం వహిస్తూ తన సత్తాను చాటుతోంది. బీహార్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లను కైవసం చేసుకోవడం మజ్లిస్ పతంగ్ మళ్లీ ఎత్తుకు ఎగరడానికి నిదర్శనం.
పాత బస్తీలో పురుడు పోసుకొని...
హైదరాబాద్ పాత బస్తీలో పురుడు పోసుకున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ పతంగ్ తాజాగా బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగిరింది. వెనుకబడిన సీమాంచల్ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి, అభివృద్ధి చేస్తామని మజ్లిస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలతో ఆ పార్టీ అయిదు అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో సమానంగా హైదరాబాద్ గల్లీ పార్టీ అయిన మజ్లిస్ అయిదు స్థానాలను కైవసం చేసుకొని తన సత్తాను చూపించింది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ అమోర్, కొచాధామన్, బహదుర్గంజ్,జొకిహత్, బైసీ సీట్లను దక్కించుకుంది.అయిదు స్థానాల్లో విజయం సాధించిన తమ పార్టీ సీమాంచల్ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
బీహార్ లో చెక్కుచెదరని మజ్లిస్ బలం
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ హవా చూపించినా , తమ మజ్లిస్ పార్టీ గతంలో గెలిచిన అయిదు స్థానాలను నిలబెట్టుకుందని ఏఐఎంఐఎం మాజీ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ జాఫ్రీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏ ఎన్నికల్లో అయినా ఏ పార్టీ గాలి వీచినా తమ పార్టీకి ఉన్న ప్రజాబలం చెక్కుచెదరదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఏడు అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రలో రెండు, బీహార్ అసెంబ్లీలో 5 అసెంబ్లీ సీట్లలో తమ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆయన వివరించారు. నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఆయా స్థానాల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారని జాఫ్రీ వివరించారు.
సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ విజేతలు...
మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అఖ్తరుల్ ఇమాన్ (అమోర్), మోహమ్మద్ ముర్షిద్ ఆలం(జొకిహత్),ఎండీ సర్వర్ ఆలం (కొచాధామన్),మోహమ్మద్ తౌసీఫ్ ఆలం (బహదుర్గంజ్), గులాం సర్వర్ (బైసీ) లు ఘన విజయం సాధించి తమ పార్టీ పతంగ్ ను సీమాంచల్ లో ఎగురవేశారు.
సీమాంచల్ ప్రాంతంలో ఎగిరిన పతంగ్
బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పతంగ్ ఎగిరింది. కిషన్ గంజ్, అరారియా, పూర్ణెయా జిల్లాల్లో మజ్లిస్ హవా చూపించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు అయిదు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే 2022వ సంవత్సరంలో నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు పతంగ్ పార్టీకి గుడ్ బై చెప్పి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. అమోర్ ఎమ్మెల్యే అయిన మజ్లిస్ బీహార్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మాత్రం మజ్లిస్ పార్టీలోనే కొనసాగారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బలరాంపూర్ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి కేవలం 389 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
రెండు సెగ్మెంట్లలో రెండో స్థానంలో నిలిచిన మజ్లిస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్టీ అయిన మజ్లిస్ అయిదు స్థానాలను కైవసం చేసుకోవడంతోపాటు పలు ఇతర నియోజకవర్గాల్లోనూ అధిక ఓట్లు సాధించి సత్తా చూపింది. బలరాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి ఆదిల్ హసన్ ఆజాద్ కేవలం 389 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి అయిన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి సంగీతాదేవి చేతిలో ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఆదిల్ హసన్ కు 80,070 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి మహబూబ్ ఆలం 79,141 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఠాకూర్ గంజర్ నియోజకవర్గంలో జేడీ(యూ) అభ్యర్థి గోపాల్ కుమార్ అగర్వాల్ 85,243 ఓట్లతో విజయం సాధించగా, మజ్లిస్ పార్టీ అభ్యర్థి 76,421 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆర్జేడీ అభ్యర్థి 60,036 ఓట్లతో మజ్లిస్ కంటే వెనుకబడి మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
పాతబస్తీ నుంచి బీహార్ దాకా...మజ్లిస్ ప్రాభవం
పాతబస్తీ కేంద్రంగా వెలసిన మజ్లిస్ పార్టీ 1960 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి 24 డివిజన్లలో పతంగ్ ను ఎగరేసింది.మల్లేపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ అయిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ బల్దియాలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. 1962వ సంవత్సరంలో అసెంబ్లీ బరిలోకి దిగిన మజ్లిస్ పార్టీ పక్షాన సలావుద్దీన్ ఒవైసీ పత్తర్ ఘట్టి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటినుంచి మజ్లిస్ ఎమ్మెల్యేలు పాత బస్తీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1967 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మజ్లిస్ పక్షాన గెలిచారు. 1984వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సాలార్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారి పార్లమెంటులోకి అడుగు పెట్టారు. 2001వ సంవత్సరంలో రాజకీయపార్టీగా రిజిస్టర్ అయిన మజ్లిస్ 2002లో ఎంసీహెచ్ ఎన్నికల్లో 36 డివిజన్లను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బారిస్టర్ అసదుద్దీన్ 2007లో ఎమ్మెల్యే అయ్యారు.
మహారాష్ట్రలోనూ మజ్లిస్ హవా
మజ్లిస్ మహారాష్ట్రలోనూ అడుగుపెట్టింది. 2012వ సంవత్సరంలో నాందేడ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ 11 డివిజన్లను గెలిచింది.ముంబయి, ఔరంగాబాద్ మున్సిపాలిటీల్లోనూ మజ్లిస్ ప్రభావం చూపింది. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ ప్రభావం చూపించింది. రెండు ఎమ్మెల్యే స్థానాలను ఏఐఎంఐఎం అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2013లో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బసవకల్యాణ్ మున్సిపాలిటీల్లో ఆరు, మూడు స్థానాల్లో విజయం సాధించింది.తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో తమ మజ్లిస్ పార్టీకి ఓటర్ల నుంచి ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
చట్టసభల్లో ప్రాతినిథ్యం మజ్లిస్ తోనే సాధ్యం
గతంలో ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంది కానీ, చట్టసభల్లో ముస్లిములకు ప్రాతినిథ్యం కల్పించలేదని హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఇస్లామిక్ రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల వెనుకబాటు తనంపై సచార్ కమిటీని నియమించిన నివేదిక తెప్పించిందని, కానీ ఆ నివేదికను అమలు చేయలేదన్నారు. మజ్లిస్ పార్టీ వల్లనే తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 14 మంది ఎమ్మెల్యేలు మూడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిథ్యం పెరిగితేనే తమ వర్గ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను మజ్లిస్ ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని ముజాహిద్ డిమాండ్ చేశారు.
తెలంగాణలోనూ ఎగురుతున్న పతంగ్
తెలంగాణ రాష్ట్రంలో ఏఐఎంఐఎం ప్రభావం చూపిస్తూనే ఉంది.హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వరుస విజయాలతో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.మజ్లిస్ ఎమ్మెల్యేలుగా ముహమ్మద్ మాజిద్ హుసేన్ (నాంపల్లి),కౌసర్ మొహియుద్దీన్ (కార్వాన్), మీర్ జుల్ఫికర్ ఆలీ (చార్మినార్), అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), జాఫర్ హుసేన్ (యాకుత్ పురా), ముహ్మద్ ముబీన్ (బహదూర్ పురా), అహ్మద్ బిన్ బలాలా (మలక్ పేట) కొనసాగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలోనే కాకుండా శాసనమండలిలోనూ మజ్లిస్ సభ్యులున్నారు.మజ్లిస్ పార్టీకి చెందిన మీర్జా రహమత్ బేగ్, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండిలు ఎమ్మెల్సీలుగా పనిచేస్తన్నారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో చట్టసభల్లో మజ్లిస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రభావం చూపిస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. ముస్లిం, దళితులు, యాదవులు, మైనారిటీల ఓట్లతో తాము యూపీ ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చూపిస్తామని అసద్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మజ్లిస్ పతంగ్ హవా
పాతబస్తీ నుంచి మొదలైన మజ్లిస్ ప్రయాణం ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ దాటి కొత్త రాజకీయ అంచులకు చేరుకుంటోంది. సీమాంచల్‌లో సాధించిన తాజా విజయాలు ఏఐఎంఐఎంకు కేవలం సీట్లు మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లో పెరుగుతున్న తన విలువును చూపించే సంకేతాలు. మైనారిటీల ప్రాతినిధ్యం, స్థానిక సమస్యల పరిష్కారం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి...ఈ మూడు స్తంభాలపై నిలబడి మజ్లిస్ తన పతంగ్‌ను ఇంకా ఎత్తుకు ఎగరే ప్రయత్నాల్లో ఉంది. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్న మజ్లిస్, దేశ రాజకీయ పటంలో తన ప్రభావాన్ని ఎంతవరకు విస్తరించగలదో చూడాలి. కానీ ఇప్పటికైతే పాతబస్తీ నుంచి సీమాంచల్ వరకు పతంగ్ హవా స్పష్టంగానే కనిపిస్తోంది.