మహాగఠ్ బంధన్ను దెబ్బకొట్టిన ఏఐఎంఐఎం
బీహార్ అసెంబ్లీ తాజా ఫలితాల్లో మహాగఠ్ బంధన్ను దెబ్బతీసిన అనేక కారణాల్లో ఏఐఎంఐఎం పార్టీ కూడా ఒకటి.
బీహార్ అసెంబ్లీ తాజా ఫలితాల్లో మహాగఠ్ బంధన్ను దెబ్బతీసిన అనేక కారణాల్లో ఏఐఎంఐఎం పార్టీ కూడా ఒకటి. తెలంగాణ ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అద్యక్షుడు. జాతీయస్ధాయిలో పార్టీని విస్తరించే ఉద్దేశ్యంతో ఇప్పటికి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది. పై రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావంచూపని ఎంఐఎం బీహార్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపించింది. 2020 ఎన్నికల్లో 20 సీట్లలో పోటీచేసి ఐదింటిలో గెలిచిన పార్టీ తాజా ఎన్నికల్లో కూడా ఐదుసీట్లలో గెలిచి తన పట్టును నిలుపుకున్నది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే 2020 ఎన్నికల్లో గెలిచిన ఐదుసీట్లను ఎంఐఎం ఇప్పటి ఎన్నికల్లో కూడా నిలబెట్టుకోవటం. అంటే ఆ పార్టీ పనితీరు జనాలు ఆశించినట్లుగా ఉన్నదనే అనుకోవాలి. అందుకనే ఎన్డీఏ ప్రభంజనంలో కూడా ఎంఐఎం తన సీట్లను నిలబెట్టుకోగలిగింది. పుర్నియా జిల్లాలోని ఆమౌర్ సీటులో అఖతరుల్ ఇమాన్, కిషన్ గంజ్ జిల్లా కొచ్చాధామన్ నియోజకవర్గంలో మొహమ్మద్ సర్వర్ ఆలమ్, ఇదే జిల్లాలోని బహదూర్ గంజ్ నియోజకవర్గం నుండి మొహమ్మద్ తౌసీఫ్ ఆలం, ఆరరియా జిల్లాలోని జోకీహట్ నియోజకవర్గంలో మొహ్మద్ ముర్షీద్ ఆలం, పూర్నియా జిల్లాలోని బైసి నియోజకవర్గం నుండి గుల్షన్ సర్వర్ తమ నియోజకవర్గాల్లో గెలిచి పార్టీ పట్టును నిరూపించారు.
తాజాఎన్నికల్లో ఎంఐఎం 35 నియోజకవర్గాల్లో పోటీచేసి ఐదింటిలో గెలిచింది. నిజానికి ఎంఐఎం కూడా మహాగఠ్ బంధన్ లో కూటమిపార్టీగా ఉండాల్సింది. పార్టీ అధ్యక్షుడు ఓవైసీ అడిగిన 35 సీట్లను పొత్తులో ఇవ్వటానికి ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. పొత్తుచర్చలు విఫలమవటంతో ఎంఐఎం అధ్యక్షుడు చంద్రశేఖర ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన అప్నా జనతా పార్టీలతో పొత్తుపెట్టుకుని 35 సీట్లలో పోటీచేయించారు. పార్టీ పోటీచేసిన 35 సీట్లలో 27 నియోజకవర్గాలు సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. సీమాంచల్ ప్రాంతంపైనే ఎందుకు అసదుద్దీన్ దృష్టిపెట్టారు ? ఎందుకంటే ఈ ప్రాంతంలో 45 శాతం ముస్లిం జనాభా ఉందికాబట్టే. పోయిన ఎన్నికల్లో ఎంఐఎం తరపున ఎన్నికైన ఐదుగురు ఎంఎల్ఏల్లో నలుగురు ఆర్జేడీలోకి ఫిరాయించారు.
పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏల స్ధానంలో అధ్యక్షుడు కొత్తగా నలుగురు అభ్యర్ధులను నిలిపారు. ఫలితంగా ఏమైందంటే ఈ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ఐదుసీట్లను నిలబెట్టుకోవటమే కాకుండా మరో 22 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లను సాధించి మహాగఠ్ బంధన్ అభ్యర్ధుల విజయానికి ఎంఐఎం అభ్యర్ధులు గండికొట్టారు. ఆరోసీటు బలరామ్ పూర్లో కూడా అభ్యర్ధి గెలవాల్సిందే. 389 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండోస్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. నలుగురు ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించినా మళ్ళీ ఐదు నియోజకవర్గాలను ఎంఐఎం గెలుచుకున్నదంటే పార్టీకి పెరుగుతున్న పట్టే ఉదాహరణ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీహార్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలోనే ఎంఐఎం ఎక్కువగా దృష్టిపెట్టింది. సీమాంచల్ ప్రాంతంలో పట్టుందికాబట్టే ఎంఐఎం ఎక్కువ సీట్లను డిమాండ్ చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇవ్వకపోవటంతో చిన్నపార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లోకి దిగింది.
దీనివల్ల ఏమైందంటే 22 నియోజకవర్గాల్లో మహాగఠ్ బంధన్ అభ్యర్ధుల విజయానికి ఎంఐఎం అభ్యర్ధులు బలంగా గండికొట్టారు. ముస్లింల హక్కుల కోసం అసదుద్దీన్ బీహార్లో చేస్తున్న పోరాటం, చట్టసభలో ముస్లింలకు ప్రాతినిధ్యం ఉండాలన్న డిమాండు, ముస్లింల్లో ఎక్కువమంది ఆర్జేడీ, కాంగ్రెస్ పట్ల విముఖత వ్యక్తంచేయటం లాంటి అనేక స్ధానిక అంశాలు ఎంఐఎంకు బాగా కలిసొచ్చాయని చెప్పాలి.