జూబ్లిహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగింది
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిజెపి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని ఆయన చెప్పారు. హిందువులంతా ఏకమయ్యారని అన్నారు. జూబ్లిహిల్స్ ఫలితాలు హిందువులకు గుణ పాఠమైందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా తిరిగి హిందుమతంలోకి రావాలని (ఘర్ వాపసీ) బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇతర మతాల్లో చేరిన వారు మళ్లీ హిందూ మతంలో చేరడానికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. హిందుమతస్థులు ఓటు బ్యాంకుకావల్సిందేనని ఆయన అన్నారు.
మతాలను మార్చుకోవడం అంటే దేవుళ్లను మోసం చేయడమేనన్నారు. అన్నీ కులాలు తమ సామాజిక వర్గాల సంక్షేమానికి పాటు పడుతూనే హిందూ ధర్మం కోసం పని చేయాలని ఆయన సూచించారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమన్నారు. ఎపి డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం చేయడం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువులందరికీ తిరిగి మన మతంలోకి వచ్చేయాలన్న పునరాలోచన కనబడుతోందని బండి సంజయ్ అన్నారు.