సౌదీ రోడ్డుప్రమాదంలో చనిపోయిన వారిలో కొందరి వివరాలు
సౌదీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో 16 మంది పేర్లు లభ్యమయ్యాయి
సోమవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన వారిలో కొందరి వివరాలు లభ్యమయ్యాయి. (Macca)మక్కాలో దర్శనంచేసుకుని తిరిగి మదీనాకు వెళుతున్న ఒక ట్రావెల్స్ బస్సును ఎదురుగా వచ్చిన డీజల్ ట్యాంకర్ ఢీకొన్నపుడు(Saudi Arabia road accident) ప్రమాదంజరిగింది. రెండు వాహనాలు వేగంతో బలంగా ఢీకొనటంతో డీజల్ ట్యాంకర్ నుండి ఒక్కసారిగా మంటలు లేచాయి. అలాగే ట్యాంకర్ లోని డీజల్ బస్సుమీద కూడా పడటంతో బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. అదేసమయంలో బస్సు ట్యాంకర్లోని ఆయిల్ కూడా బయటకు రావటంతో మంటలు బస్సును చుట్టుముట్టాయి. ప్రమాదం జరిగింది భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు కావటంతో ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉన్నారు.
రెండు వాహనాలు ఢీకొన్నపుడు ప్రయాణీకులకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. అయితే అప్పటికే బస్సును మంటలు పెద్దఎత్తున చుట్టుముట్టడంతో ప్రయాణీకులు బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా బస్సులోని 44మందిలో 42 మంది సజీవదహనయ్యారు. బస్సు డ్రైవర్ తో పాటు మరో ప్రయాణీకుడు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అందుబాటులోని సమాచారంప్రకారం 20మంది మహిళలు, 11మంది చిన్నపిల్లలుండగా మిగిలిన వారు మగవాళ్ళు. వీళ్ళంతా హైదరాబాదుకు చెందిన మక్కా ట్రావెల్స్, ఫ్లైజోన్ ట్రావెల్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. మక్కా ట్రావెల్స్ లో 20 మంది, ఫ్లైజోన్ ట్రావెల్స్ నుండి 23 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
మృతులను గుర్తించేందుకు సౌదీలోని రాయబార కార్యాలయం ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. లోకల్ పోలీసులు, రాయబార కార్యాలయం అధికారులు హైదరాబాద్ లోని ట్రావెల్స్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మృతుల్లో రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీనా బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సొహైల్, జకిన్ బేగం, జహియాబేగం ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన 16 మంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతు రియాద్ లోని భారత రాయబార కార్యాలయంలోని డిప్యుటి చీఫ్ ఆఫ్ మిషన్ అబూ మాథెన్ జార్జ్ తో మాట్లాడినట్లు చెప్పారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు జార్జ్ తనతో చెప్పినట్లు అసద్ తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీలను కూడా తాను సంప్రదిస్తున్నట్లు ఎంపీ వివరించారు. ప్రయాణీకుల వివరాలను తాను రియాద్ ఎంబసీతో పాటు విదేశాంగ కార్యదర్శికి పంపినట్లు చెప్పారు.