ఐబొమ్మ లాంటి సైట్‌లు వాడితో బొమ్మ పడేది మనకే: సజ్జనార్
సోషల్ మీడియా మీమర్స్‌కు సజ్జనార్ వార్నింగ్
ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్‌పై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. మీమర్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఐబొమ్మ లాంటి సైట్‌లను, వాటిని నిర్వహించే వారికి మద్దతు పలుకుతున్నట్లు మీమ్స్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి వెబ్‌సైట్‌లు వినియోగిస్తే మనకే బొమ్మ పడుతుందని చురకలంటించారు. ఫ్రీగా వస్తుంది కదా అని.. అలాంటి సైట్స్‌లో సినిమాలు చేస్తే.. మన సమాచారంతో వాళ్లు వ్యాపారం చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌పై పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగానే మీమర్స్ కూడా కాస్తంత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ఏ అంశంపై ఎలాంటి మీమ్స్ చేస్తున్నాం అనే దానిని గుర్తెరిగి ప్రవర్తించాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి విస్తుబోయే వియాలు పంచుకున్నారు.
ఛాలెంజ్ చేశాడు.. ఏమయ్యాడు..
దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులను ఛాలెంజ్ చేసిన రవి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటూ చురకలంటించారు. ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే భారీగా బెట్టింగ్ యాప్ లింకులు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసేవాడని, సినిమాలు చూస్తున్న సమయంలో కూడా ఆ యాప్‌ల ప్రకటనలు కనబడేవని సజ్జనార్ చెప్పారు. ఈ ప్రక్రియతో ఇమ్మడి రవి కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిపారు. One Win, One X Bet వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ, Apk ఫైళ్లు డౌన్‌లోడ్ చేయించేవాడని, ఆ ప్రక్రియలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకున్నాడని చెప్పారు.
ఇలాంటి అక్రమ వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. “దమ్ముంటే పట్టుకోండి” అంటూ ఛాలెంజ్ చేసిన ఇమ్మడి రవి ఎక్కడున్నాడనేది ఇప్పుడు ప్రశ్నేనని, హైదరాబాద్ పోలీసులను తక్కువగా అంచనా వేయకూడదని సజ్జనార్ హెచ్చరించారు. నెలల తరబడి కృషి చేసి ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
మాకు సమాచారం ఇచ్చింది వాళ్లే..
రవి అరెస్ట్ నేపథ్యంలో అసలు పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే రవి గురించి అతడి భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చారని ప్రచారం జరిగింది. కాగా వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. తమకు ఎవరో సమాచారం ఇవ్వలేదని, తెలంగాణ పోలీసులు దశాబ్దాలు రాష్ట్రంలో మంచి నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని, దాని ద్వారానే రవిని అరెస్ట్ చేశామని చెప్పారు.
హార్డ్‌డిస్క్‌లో 21వేల సినిమాలు
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో 21 వేల సినిమాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయని చెప్పారు. ‘‘ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూ.20 కోట్లు సంపాదించాడు.. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది’’ అని సీపీ సజ్జనార్ తెలిపారు.