జూబ్లీలో బీజేపీ ఓటమికి కారణం చెప్పిన ఈటల
ఒక్క ఓటమితో కార్యకర్తలు కుంగిపోవద్దని కోరిన ఎంపీ ఈటల రాజేందర్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం ఒకటేనంటూ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ ఉపఎన్నిక ఫలితాలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని ఆయన చెప్పారు. కులం మతం పునాదిమీద రాజకీయాలు శాశ్వతంగా నడవవని హితవు పలికారు.
‘‘గెలిచిన ఓడినా.. అధికారం ఉన్న లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వేలాది మంది బీజేపీ కారకర్తలు, వందలమంది నాయకుల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్న.. సీఎం మంత్రులు కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్నా.. ఒకటి అర్ధం చేసుకోవాలి.. నారాయణఖేడ్, పాలేరు లో, హుజూర్నగర్ లో, నాగార్జున సాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అన్నిటిలో అధికార పార్టీ గెలిచింది. కేసీఆర్ అహంకారం అణచడానికి దుబ్బాకలో బీజేపీని గెలిపించారు. అన్యాయానికి న్యాయానికి.. ఆత్మగౌరవానికి అహంకారానికి.. ధర్మానికి అధర్మానికి జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆ ఎన్నిక కోసం ఎదురుచూశారు. స్వయంగా కేసీఆర్ వచ్చి దళిత బంధు ప్రకటించినా గెలవలేక పోయారు’’ అని అన్నారు.
‘‘తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిచింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో వచ్చిన ఓట్లు 3016, దుబ్బాకలో , మునుగోడు డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా ? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరు. బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం. ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధపడకండి. భవిష్యత్తు మనదే’’ అని వ్యాఖ్యానించారు.
‘‘జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. గెలిస్తే బీజేపీ వాళ్ళు EVM లను ఏదో చేశారని అంటున్నారు.. మరి జూబ్లీహిల్స్ లో ఇవిఎం మేనేజ్ చేశారా ? దొంగఓట్లు నమోదు చేయించారా? తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు’’ అని అన్నారు.
‘‘అధికార పార్టీ హంగుల వల్ల ఉపఎన్నికల్లో గెలుస్తుంది. BRS సమయంలో ధర్మం అధర్మం ఎన్నిక జరిగినప్పుడు నేను, అహంకారానికి మధ్య ఎన్నిక జరిగినప్పుడు రఘునందన్ గెలిచారు. పార్టీ అంటే నాయకులు అందరూ బాధ్యత తీసుకుంటారు. కిషన్ రెడ్డి గారినో ఇంకొకరిను బాధ్యులు చెయ్యలేం. జూబ్లీహిల్స్ లో mla చనిపోయిన వెంటనే బీజేపీ తిరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఒకాయన అధికారం పోతుంది అని ఇంకొకరు సానుభూతితో పోటీ పడ్డారు’’ అని తెలిపారు.
‘‘నా వ్యక్తిగత అభిప్రాయం.. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేము. బీహార్ లో మాకు ఇన్ని సీట్లు వచ్చాయి అంటే అందరి మద్దతు ఉంది.
ట్రిపుల్ తలాక్ లాంటివి పని చేసాయి. మా సర్ సంగ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పారు.. ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పారు. మోడీ ప్రధాని కాగానే ఒక మెసేజ్ ఇచ్చారు.
సబ్ కా సాత్
సబ్ కా విశ్వాస్
సబ్ కా వికాస్
సబ్ కా ప్రయాస్ అనే గొప్ప నినాదం ఇచ్చారు. ఇది మా బీజేపీ విధానం. ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేసావు, ఇక ముందు ఏం చేస్తావు అని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. కులం మతం పునాదిమీద రాజకీయాలు శాశ్వతంగా నడవవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని వివరించారు.
‘‘మాది ప్రజాస్వామిక పార్టీ అందుకే గుజరాత్ లో ఇన్నేళ్లుగా పాలన నడుస్తుంది. అభివృద్ధితో పాటు భారత ఆత్మగౌరవం నిలబెట్టడం వల్లనే బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. మోదీ నాయకత్వంలో దేశం అగ్రభాగాన నిలబడింది. యాభై శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గంలో 25 ఏళ్ల మైథిలీ ఠాగూర్ విజయం సాధించింది అంటే అర్థం చేసుకోండి. అభివృద్ధి సంక్షేమం అందరికీ అందుతుంది తప్ప ఒక వర్గానికి కాదు’’ అని వ్యాఖ్యానించారు.