మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం
మిర్యాలగూడ కాల్వపల్లి వద్ద రింగ్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి
మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రింగురోడ్డు పనులకు సహచర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోమటిరెడ్డి ప్రసంగిస్తూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపికి డిపాజిట్ గల్లంతైందని.. బిఆర్ఎస్ పార్టీ కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. అన్ని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారి ద్వారా అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి సాధించడం సాధ్యమన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యకర్తల కృషి ప్రధాన కారణమన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని రెండేళ్లలో కాంగ్రెస్ చేసి చూపించిందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామి ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర చెల్లించడంతోపాటు 48 నుంచి 72 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.