‘నా కొడుకు గూర్చి తెలిసి కలత చెందాను’
ఐ బొమ్మ రవి అరెస్ట్ పై స్పందించిన తండ్రి అప్పారావు
పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవి తండ్రి ఇమ్మడి అప్పారావు సోమవారం మీడియా ఎదుట బోరున విలపించారు. ‘‘ఈ రోజు ఉదయం టీవీల్లో నా కొడుకు గూర్చి వార్తలు ప్రసారం కావడం చూసి కలత చెందాను’’ అని అన్నారు. ‘‘మాది పరువు గల కుటుంబం. నా కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేదు. పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మేము చూసిన అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడలేదు. తాను మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డకు తండ్రయ్యాడు. ప్రస్తుతం భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి దూరంగా ఉండటం బాధగా ఉంది’’ అని అప్పారావు అన్నారు. ‘‘తన మనవరాలు బొద్దుగా ఉండేది. ముద్దు-ముద్దుగా మాట్లాడేది. ఏడెనిమిది సంవత్సరాల మనవరాలిని చూసి కూడా చాలా రోజులయ్యింది’’ అని ఆయన అన్నారు. ‘‘రవి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి, ఒకటి రెండు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు’’ అని చెప్పారు. ‘‘నా సంపాదన వాడికి అవసరం లేదు. వాడి సంపాదన నాకు అవసరం లేదు. రిటైర్ అయ్యాక వస్తున్న పెన్షన్ డబ్బుల మీద తిండి, వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఉన్నదాంట్లో సర్దుకుని బతకాలి, లేని వాటి కోసం ఆరాటపడటం తప్పు. విలాసవంత జీవితానికి అలవాటు పడ్డ నా కొడుకు పైరసీ చేస్తున్నాడని సమర్దించుకోవడం తప్పు’’ అని అప్పారావు అన్నారు .
ఐబొమ్మ రవి తల్లి కిలాడి: అప్పారావు
కొడుకు రవి ప్రవర్తనను తప్పు పడుతూనే తన భార్య పెంపకం వల్లే ఇలా జరిగిందని ఈ సందర్బంగా అప్పారావు చెప్పారు. పైరసీ చేసి కోట్లు సంపాదించిన కొడుకు ప్రవర్తన సరిగ్గాలేదని, తల్లి కిలాడి కావడంతో తాము కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయామని అప్పారావు చెప్పారు. ఆమె ఆలోచనలు నెగెటివ్ గా ఉండేవని, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అనేక బాధలు పడ్డానని చెప్పారు. తాను బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కావడంతో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేదని, ఉద్యోగ సమయంలో తన భార్య తనకు సహకరించేది కాదని అప్పారావు అన్నారు.
పైరసీ చేయడం తప్పు
‘‘పైరసీ చేయడం చట్టవిరుద్దం. అయినా నా కొడుకు పైరసీ చేస్తూ కోట్లు గడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేనయితే పాత ఎన్టీఆర్ సినిమాలు చూసి పెరిగిన వాడిని’’ అని అప్పారావు అన్నారు. పైరసీ చేయడం వల్ల సినీ పరిశ్రమ నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సినిమాలు చూడనని పాత ఎన్టీఆర్ అంటే తనకు వల్లమాలిన అభిమానమని అప్పారావు అన్నారు.