ప్రతి పేద పాపకి ప్రతి ఉదయం గ్లాసెడు పాలు...
ములుగులో పిల్లకు పాలు గ్లాసు అందించి పాలపథకం పైలట్ స్కీం ప్రారంభించిన మంత్రి సీతక్క
By : Saleem Shaik
Update: 2025-11-18 02:18 GMT
చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ములుగు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పాలు అందించే కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుకు ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత రాష్ట్రమంతా అమలు జరగనుంది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతీ రోజూ 100 మిల్లీలీటర్ల పాలను పంపిణీ చేస్తారు.
పిల్లలకు పాల గ్లాసులు అందించి వారితో తాగించి తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈ పైలట్ ప్రాజక్టుని ప్రారంభించారు.
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం
కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామని, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.అంగన్ వాడీ సిబ్బంది బాల్యవివాహాల నివారణ, బాలల రక్షణ కోసం పనిచేయాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమ వారం, బాలల హక్కుల వారంపై పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.ములుగు జిల్లాలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన పిల్లలకు పాలు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. 3 నుంచి 6 సంవత్సరాల వయసున్న పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రతీరోజూ గ్లాసు పాలను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. పేద పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి వివరించారు.
చిన్నారుల పోషకాహార భద్రత కోసం ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద అడుగు వేస్తుందని చెప్పవచ్చు.అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు చేరడం, చిన్నారుల చేతిలో పాల గ్లాసు మాత్రమే కాదు...ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు నాంది. తెలంగాణ చిన్నారులు ఆరోగ్యంగా, బలంగా ఎదగాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ పథకం సార్థకతను తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.