మావోయిస్ట్ నేత హిడ్మా మృతి,
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన కాల్పుల్లో హతమైన మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక నేత మాడ్వి హిడ్మా.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కీలకనేత హిడ్మా మరణించాడు. అల్లూరిసీతారామ రాజు జిల్లాలో మావోయిస్ట్‌లు, భద్రతా సిబ్బందికి జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మరణించాడు. ఆయనతో పాటుమరో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. గెరిల్లా దాడులు చేయడంలో హిడ్మా అలియాస్ సంతోష్‌ది అందెవేసిన చెయ్యి. ఆయన తలపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. దశాబ్దాలుగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మావోయిస్ట్‌లు చేసిన పలు కీలక దాడుల్లో హిడ్మా కీలక సూత్రధారిగా ఉన్నారు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులు అతని నేతృత్వంలో జరిగాయి.
భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు హిడ్మా నాయకత్వం వహించాడు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మరేడుమిల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్ల కోసం భద్రతా సిబ్బంది గాలింపులు చేస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా చేపట్టిన ఈ గాలింపులు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో హిడ్మా తలదాచుకున్నాడని సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తమ గాలింపులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తిరుగుబాటు దళాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కనీసం ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ కాల్పులకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య జరిగిందని తెలిపారు. “కాల్పుల వ్యవహారంలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు, అందులో ఒక టాప్ మావోయిస్టు నాయకుడు కూడా ఉన్నాడు. భారీగా గాలింపులు చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
హిడ్మా నేపథ్యం ఏమిటి ? ఎవరీ హిడ్మా ?
ఛత్తీస్ ఘడ్, దక్షిణ సుక్మా(Sukma District) జిల్లాలోని పూవర్తి (Puvarti village) గ్రామంలో 1981లో మాడ్వి హిడ్మా పుట్టాడు. 10వ తరగతి వరకు చదివిని ఈ మావోయిస్టు హిడ్మా అలియాస్ హిడ్మాలు అలియాస్ సంతోష్ వెంటనే మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా దండకారణ్యంలోని బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీలో కీలకనేతగా ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టుల్లో గెరిల్లా యుద్ధరీతులను ప్రవేశపెట్టి అనేక దాడులకు కారణమయ్యాడు. అందుకనే మావోయిస్టు అగ్రనేతలు హిడ్మాను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)కి ఇన్చార్జిగా నియమించారు. 2016లో మరికొందరు మావోయిస్టులతో కలిసి హిడ్మా అరెస్టయినప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తొందరలోనే విడుదలైన హిడ్మా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటికి కమాండర్ గా అపాయింట్ అయ్యాడు.
సుక్మా, దంతెవాడ, బస్తర్ అటవీప్రాంతాలు కేంద్రంగా హిడ్మా నిర్వహించిన అనేక దాడుల కారణంగా మావోయిస్టు కేంద్రకమిటికి సభ్యుడిగా ప్రమోషన్ అందుకున్నాడు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్రకమిటిలో సభ్యుడైన హిడ్మా అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని వందలమంది యువకులను దళంలోకి ఆకర్షించటమే కాకుండా మావోయిస్టులతో ప్రత్యేకంగా గొరిల్లా దళాన్ని తయారుచేయటంలో హిడ్మా కీలకవ్యక్తి. దంతెవాడ(Dantewada)లో 2010, సుక్మా జిల్లాలో 2017లో పోలీసులపైన దాడులు చేయటంలో హిడ్మా వ్యూహాలే కీలకం. ఇప్పటివరకు హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు 27 గెరిల్లా తరహ దాడులకు పాల్పడి సుమారు వందమందికి పైగా పోలీసుల మరణానికి కారణమయ్యాడు.
ఇంటికిరమ్మ తల్లి.. ఇంతలోనే..
కొన్ని రోజుల క్రితమే ఆయుధం వీడి జనాల్లోకి రావాలని హిడ్మాను అతని తల్లి పుంజా మాడ్వి కోరారు. హిడ్మా తల్లి పుంజి మాడ్వితో రాష్ట్ర డిప్యుటి సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ(Home Minister Vijay Sarma) బుధవారం భేటీ అయ్యారు. ఆమె కూడా కొడుకును మావోయిస్టు(Maoist Party) పార్టీని వదిలేసి జనజీవనశ్రవంతిలో కలిసిపోవాల్సిందిగా కొడుకును కోరిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇంతలోనే మంగళవారం జరిగిన కాల్పుల్లో హిడ్మా మరణించాడన్న వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.