తిరుమల:పాపవినాశనంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నారా?

తిరుమల పాపవినాశనం డ్యాంలో మంగళవారం నిర్వహించిందే ట్రైల్ రన్ అంటుంటే, అదేం కాదని అటవీశాఖ చెబుతోం;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-25 12:53 GMT

పాపవినాశనం డ్యాంలో అటవీశాఖ బోటింగ్ నిర్వహించింది ట్రయల్ మాత్రమేనా? లేక స్మగ్లింగ్ నివారణకు చేపట్టిన ఆపరేషనా?

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంగానే ఇప్పటివరకు ఉంది. ఇకపై విహార కేంద్రంగా మార్చడానికి అడుగుల పడ్డాయి. తిరుమలగిరుల్లోని ఉన్న ఐదు ప్రధాన డ్యాముల్లో (dam's) అత్యంత పవిత్రమైనదిగా భావించే వాటిలో పాపవినాశనం డ్యామ్ ప్రధానమైనది. ఈ డ్యాంలో పర్యాటక అభివృద్ధికి అటవీ శాఖ బోటింగ్ట్రై ల్ రన్ నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం సుమారు ఐదు బోట్లతో విహరించారు.

తిరుమలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తే, అంశాలు అనుకూలంగా ఉంటే ఇక్కడ బోటింగ్ కొనసాగించాలని అటవీశాఖ సంకల్పించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ద్వారా శ్రీకారం చుట్టించాలని భావిస్తోంది.
ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు తిరుపతి డీఎఫ్ఓ పీ. వివేక్ ఫోన్ కాల్ స్వీకరించలేదు. వివరాలు తెలుసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది.
ప్రభుత్వ లక్ష్యం ఏమిటి
రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాన లక్ష్యంగా టిడిపి కూటమి తన విధానాన్ని ప్రకటించింది. సనాతన ధర్మం పేరిట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆధ్యాత్మిక ఒరవడిలో సాగుతూ ఉండడం, అనుకూలించే అంశం గాని రాష్ట్ర ప్రభుత్వానికి మారింది. పాపవినాశనం డ్యాములో బోటింగ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఆ తర్వాత తిరుమలకు సమీపంలోనే ఉన్న గోగర్భం డ్యాంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆధ్యాత్మిక లోగిళ్ళలో పర్యాటకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రదేశాలలో తాము అనుకున్న కార్యక్రమాలను అమలు చేయడానికి టిడిపి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఆ కోవలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలగిరిలో ఉన్న డ్యామ్లలో బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
పవిత్ర ప్రదేశంలో ఇదేంటి?

తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత పాపా వినాశనం డ్యాంకు ఓ ప్రత్యేకత ఉంది. గంగదేవత కొలువైన పాపవినాశనం డ్యాం ప్రాంతం చారిత్రక ప్రదేశం. అలాంటి తీర్థయాత్ర స్థలంలో బోటింగ్ వల్ల విహారయాత్రగా మారి ప్రమాదం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. బోటింగ్ సదుపాయం వల్ల అటవీ శాఖకు ఆదాయం లభిస్తుందనే అంశాన్ని పక్కన పెడితే, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసి పర్యాటకం పై ఆసక్తి ఏర్పడుతుందని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
డిప్యూటీ సీఎం అంగీకరిస్తారా?
సనాతన ధర్మం కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తున్న ఆయన, ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమలలో చారిత్రక నేపథ్యం కలిగిన పాపవినాశనం డ్యాంలో బోటింగ్ అంగీకరిస్తారా అనేది కూడా తెరమీదకి వచ్చింది.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొరపాటు లేకున్నప్పటికీ, ఆయనకు సంబంధం లేకున్నా, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనం తర్వాత వారాహి డెకరేషన్ను ప్రకటించిన ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన అసలు అజెండాను ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరుమల పాప వినాశనం డ్యామ్ లో బోటింగ్ సదుపాయాన్ని కల్పించాలని విషయం వివాదంగా మారే అవకాశం లేకపోలేదు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (Tirupati Forest Range Officer) బీ. సుదర్శన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.

"తిరుమల సహా సమీప ప్రదేశాలు వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో ఉన్నాయి" అని గుర్తు చేశారు. "పాపవినాశనం ప్రాంతంలో విలువైన వృక్ష సంపద ఉంది. అందుకే బోట్లలో గస్తీ నిర్వహించాం" అని తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ వివరించారు. "స్మగ్లింగ్ పై ముందస్తు సమాచారం ఉండడం వల్ల ఈ ఆపరేషన్ జరిగింది. దీనిపై టీటీడీ ఈఓకు ముందస్తు సమాచారం ఇచ్చాం" అని కూడా ఎఫ్ఆర్ఓ సుదర్శన్ స్పష్టం చేశారు.

Similar News