'జెడి' లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు, అయితే ఈ 10 ముచ్చట్లు తెలుసా?

లక్ష్మీనారాయణ వంటి నిజాయితీ పరులు పాత పార్టీల్లోకి వెళ్ల లేరు, కొత్త పార్టీపెట్టి బతికించుకోలేరు. ఇలా ఒక మాజీ అధికారి కొత్త పార్టీ పెట్టడం తెలుగు నాట ఇది మూడో సారి.

Update: 2023-12-24 04:31 GMT
మాజీ సిబిఐ అధికారి వివి లక్ష్మీనారాయణ (ఫేస్ బుక్ నుంచి)


1. మొన్న శుక్రవారం నాడు విజయవాడు వివి (జెడి) లక్ష్మినారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ  స్థాపించారు. వెంటనే  కాపులకు సంబంధించి అని పేరు పడింది. కాపుల ఓట్లు చీలుతాయని, అది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి హానిచేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆయన వివి లక్ష్మీనారాయణ ను తెలుగు ప్రజలు ఇంకా జెడి (జాయింట్ డైరక్టర్ ) లక్ష్మీనారాయణ అనే పిలుస్తున్నారు.  పార్టీ జండాలో ఆయన బొమ్మ కొద్దిగా విపరీతం అనిపిస్తుంది. ఇంత వ్యక్తి పూజ అవసరమా. 

2. ఐపిఎస్ అధికారులు స్థాపించిన రెండో పార్టీ. ఆల్ ఇండియా అధికారులు స్థాపించిన వాటిలో రెండో పార్టీ. 1997లో కాపు ఐపిఎస్ ఆఫీసర్ ఎం వి భాస్కరరావు అప్పుడు చంద్రబాబు నాయుడి పద్థతి నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఆంధ్రనాడు’ అనే పార్టీ స్థాపించారు. తర్వాత 2006లో మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ ‘లోక్ సత్తా’ ఏర్పాటు చేశారు. తెలుగు వాళ్లు మనిషిలో చూసే మొదటి లక్షణం కులం కాబట్టి, జయప్రకాశ్ నారాయణ్ కమ్మ కులం అని చెప్పుకుందాం.

3. 1982లో పుట్టి, 1983లో ఉప్పెనలా దూసుకొచ్చిన అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అన్ని కులాల్లో చైతన్యం తీసుకువచ్చింది. ఇందులో కాపుకులం ఒక్కటి. కాపులు పెద్ద కులం, ఆగ్రకులం, అన్ని రంగాల్లో దర్శనమిచ్చే విస్తృతం కాలం. సోషియాలజిస్టులు ఈ కులాన్ని రెడ్డి, కమ్మ, రాజు, వెలమల తో జతకట్టి భూయాజమాన్య కులంగా పిలుస్తారు. ఈ పంచకులాల క్యాటగరిలో ఉండటానికి కాపు కులస్తులు ఒక విధంగా ఇష్టపడతారు. గర్వపడతారు. (అయితే, ఈ మధ్య ఎందుకో బిసిల పంక్తిలో కూర్చోవాలనుకుంటున్నారు.). ఎపుడో ఒక సారి తాము కూడా రెడ్లు, వెలమ, కమ్మల్లాగా రాజ్యాధికారంలోకి వస్తారని ఆశ. ఈ రాజకీయ ఆకాంక్ష రకరకాల రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. కాపులెవరితో మాట్లాడినా ఈ ఆకాంక్ష ఉప్పొంగడం కనబడుతుంది.

4. ఈ కాపు కులసామూహిక రాజకీయ ఆకాంక్ష రాజకీయ రూపం తీసుకున్నపుడల్లా రగడలు జరిగాయి. చివరకు 2008 లో మెగాస్టార్ చిరంజీవి ‘ ప్రజారాజ్యం’అనే పేరుతో రాజకీయపార్టీ పెట్టడం కాపుల ఆకాంక్ష స్పష్టమయిన రాజకీయ రూపం తీసుకుంది. ఇది ఈ లెక్కన కాపులు పెట్టిన రెండో పార్టీ. ఇక మన వాడు ముఖ్యమంత్రి అని కలలుకన్నారు కాపులు. ఫూలే, పెరియార్, అంబేడ్కర్,మదర్ ధెరీసా బొమ్మలతో వచ్చిన హైపు చూసి అంతా జడుసుకున్నమాటా నిజమే. చిరంజీవి 2009 ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారు. 18 సీట్లు గెల్చుకున్నారు. కొన్నాళ్లు ఓపికపడితే, ఎలా ఉండేదో. ఆయన ఓపిక పట్టలేక, పార్టీ నడపలేక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రం లో మంత్రి అయ్యారు.

5. అయితే, ఆయన సోదరుడు, పవర్ స్టార్ గా ప్రసిద్ధుడయిన పవన్ కల్యాణ్ మాత్రం తన రాజకీయ యాత్ర ని ‘జనసేన’ పార్టీ పేరుతో కొనసాగిస్తున్నారు. ఇది కాపుల మూడో పార్టీ. పవర్ స్టార్ పవర్ అసాధారణమయింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఐడియాలజీలు మార్చినా, ఎవ్వరెన్ని విధాలుగా దాడి చేసినా యూత్ లో ఆయన ప్రాబల్యం తగ్గదు. ఒక విధంగా తెలుగు రాజకీయాల్లో మొబిలైజేషన్ లేకుండా జనం వచ్చేది ఆయనకు ఒక్కరికే అనే పేరుంది. మొన్న తెలంగాణ ప్రచారంలో విపరీతంగా జనం ఎగబడ్డారు. అయితే, ఈ జనం ఓట్లుగా మారడం లేదు. 2019 ఎన్నికల్లో ఒక సారి విఫలమయ్యారు. ఈ సారి 2024లో మరొక పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఈ సారి ఆయన తెలుగుదేశం తో  కలసి ముందుకు సాగుతున్నారు. ఏమవుతుందో చూద్దాం.

6. ఇలాంటపుడు జెడి లక్ష్మినారాయణ ‘జైభారత్ నేషనల్ పార్టీ’ పెట్టారు. చాలా మంది కాపులు ఆయనని కాపులాగా చూస్తారు. మావాడేననిన గర్వపడతారు. ఐడియాలజీలో ఆయన బిజెపికి దగ్గరగా ఉంటారు. ఆయన పార్టీ పేరులో కొద్దిగా బిజెపి భావజాలం వాసన ఉంది. నిజాయితీపరుడు, ప్రజాజీవితంలో విలువలుండాలని కోరేవాడు ఆయన. ఆయన ఆంధ్రాలో సిబిఐ జాయింట్ డైరక్టర్ గా ఉన్నపుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, బళ్లారిలో మైనింగ్ లార్డు గాలి జనార్దన్ రెడ్డి ని అరెస్టు చేసి డేర్ డెవిల్ యాక్షన్ హీరో అయ్యారు. చాలా మంది కుర్రవాళ్లు ఐపిఎస్ చదవాలని ఆశపడ్డారు.  డబ్బు, మందు, కులం పెనవేసుకొన్న తెలుగు రాజకీయాల్లో గెల్చేందుకు అవసరమయిన లక్షణాలు ఆయనలో కనిపించవు. అందుకే ఆయన పార్టీ గురించి ఉండవల్లి నిన్న చక్కగా చెప్పారు. “ఓడిపోయే లక్ష్మీనారాయణకు ఓటెందుకు వేస్తారు, తన ద్వేషించే పార్టీని ఎవరు ఓడించగలరో వాడికే ఓటరు ఓటేస్తాడు. జగన్, చంద్రబాబు మంచిరాజకీయాలు నడపలేకకాదు, నడవవు అని తెలుసుకుని అలా రాజకీయాలు నడిపిస్తున్నారు. కాబట్టి లక్ష్మీనారాయణ చోటేమిటో వేరే చెప్పాల్సిన పనిలేదు,’ అన్నారు. ఉండవల్లి తప్పని లక్మీనారాయణ నిరూపిస్తే బాగుంటుంది.

7. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి సంకటాలే ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బాగుంది. తన ప్లానేమిటో ఎపుడూ స్పష్టంగా చెప్పలేదు.యూత్ కు కోచింగ్ సెంటర్ తెరుస్తామ్నారు. రైతులకోసం పనిచేస్తానన్నారు. చివరకు జనసేన పార్టీలో చేరారు. విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. జనసేన నుంచి బయటకు వచ్చారు. తర్వాత కూడా కన్ ఫ్యూజనే

8. ఏదో ఒక పార్టీలో చేరాలనుకున్నారు. ఎక్కడో చోటు లేదు. వైసిపిలోకి ఆహ్వానం లేదు. ఎందుకంటే, ఈయన వల్లనే తాను జైలుకు పోయినట్లు జగన్ తొలినుంచి చెబుతువస్తున్నారు. నిజమో కాదో తెలియదు గాని, తన కేసుల వెనక, అరెస్టు వెనక చంద్రబాబు ఉన్నాడని, దానికి జెడి లక్మీనారాయణ సహకరించినట్లు జగన్ ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇక టిడిపిలోకి తీసుకుంటే, జగన్ చెప్పింది నిజమవుతుంది. పోనీ బిజెపిలోకి వెళ్లొచ్చుకదా అనొచ్చు. ఆయన్ని బిజెపిలోకి తీసుకుంటే జగన్ ఆగ్రహం రావచ్చు. అలా ఉన్న పార్టీలలో ఎక్కడా లక్ష్మీనారాయణకు చోటు దొరకలేదు. అందుకే కొత్త పార్టీ పెట్టాల్సివచ్చిందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది.

9. భారతదేశంలో కులాల మీద బహిరంగంగా పార్టీలు పెట్టిన వాళ్లు విజయవంతమయ్యారు. అలా కాకుండా ఐఎఎస్ అధికారులు రాజకీయ ప్రక్షాళన పేరుతో పెట్టిన పార్టీలు విజయవంతమయినట్లు దాఖలాలేదు. చాలా మంది అధికారులు గాలి వాటం చూసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలోనో, రాబోతున్న పార్టీలోనో చేరుతుంటారు. ఉదాహరణకు తమిళనాడుకు చెందిన అణ్ణామళై చక్కగా బిజెపిలో చేరిపోయి డిఎంకెని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రూట్లో జెడి వెళ్లలేకపోయారు. ఆంధ్ర నాడు , లోక్ సత్తాలా అడ్రసులేకుండా అవుతుందా లేక కనీసం ఆయన్ని లోక్ సభ దాకా పంపే స్థాయికయినా ఎదుగుతుందా చూడాలి.

10. అయితే, విశేషమేమిటంటే లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు.



Tags:    

Similar News