Home Minister on Constable vacancies | పది వేల పోలీస్ ఖాళీలు భర్తీ
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హోంశాఖ మంత్రి అనిత ప్రకటించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-21 09:23 GMT
రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హెంశాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. అంతేకాకుండా, పోలీసులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసకుంటున్నట్లు ఆమె చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు హోంశాఖ మంత్రి అనిత ప్రకటించారు. గత ఐదేళ్ల పరిపాలనకు భిన్నంగా ప్రజలకు రక్షణ కల్పించడం తోపాటు, వారికి మెరుగైన భద్రత కోసం ఆలోచనలు చేశామని ఆమె తెలిపారు.
పనిభారం తగ్గిస్తాం..
రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. దీనికోసం ప్రస్తుతం 16,862 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 6,100 మందిని నియమించడానికి శరీరదారుఢ్య పరీక్షలు పూర్తి చేశామని చెప్పారు. ఇందులో రానున్న రోజుల్లో 10, 762 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి ప్రభుత్వానికి సిఫారసు చేశామని శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె సమాధానం చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆగిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి పునరుద్ధరించామని ఆమె గుర్తు చేశారు. 2022 నవంబర్ 28వ తేదీ 6,100 మంది కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుళ్ల ప్రక్రియ రాతపరీక్షతో ఆగింది. ఆ తరువాత తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారంఐదు నెలల్లో చక్కదిద్దుతామని, చెప్పడమే కాదు. పూర్తి చేశామని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 16,862 పోస్టుల్లో 6,100 మందిని నియమించడానికి జిల్లాల వారీగా దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశామని ఆమె గుర్తు చేశారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీకి కూడా అవసరమైన పరిపాలనా లాంఛనాలు పూర్తి చేసి, నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆమె వివరించారు.
బాబు వస్తేనే జాబ్
టీడీపీ ప్రభుత్వ కాలంలోనే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ కాలంలోనే పోలీస్ నియామకాలు జరిగాయని హోంశాఖ మంత్రి అనిత గుర్తు చేశారు. 2014 -19 కాలంలో సీఎం ఎన్. చంద్రబాబు చొరవ వల్లే రాష్ట్రంలో 7,623 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియమించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. త్వరలో మళ్లీ 10, 762 పోస్టులు భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.