తిరుమల లడ్డూ కేసులో నలుగురి అరెస్ట్
3 రాష్ట్రాలు, 3 డెయిరీలు, నలుగురు వ్యక్తులు.. ఎట్టకేలకు తొలి అరెస్టులు జరిగాయి. మున్ముందు మరెంతోమంది అరెస్ట్ అవుతారో చూడాలి.;
By : The Federal
Update: 2025-02-10 00:32 GMT
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారమై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొరఢా ఝుళిపించింది. కల్తీ నెయ్యి ఫిర్యాదులపై నలుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇవే తొలి అరెస్టులు. మూడు రాష్ట్రాలకు చెందిన ఈ నలుగురు కీలకంగా సిట్ భావిస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్ ఉన్నారు.
ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం వీరిని తిరుపతిలో అరెస్టు చేశారు. రాత్రి 10.30కు రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
అసలేమిటీ కేసు...
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి గొడ్డు కొవ్వు నుంచి తీసిన నూనెను నెయ్యిలో కల్తీ చేసి వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ పదార్థాలు ఉన్నట్లు గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) కాఫ్ ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ నివేదికల ఆధారంగా, టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై కేసు నమోదు చేశారు. 2024 సెప్టెంబరు 25న తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో కేసు (క్రై నెంబర్ 470/24) నమోదైంది.
కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం నిలిపివేసినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. ప్రస్తుతం, సిట్ బృందం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోంది. దోషులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడుతోంది.
ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారమై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు నాయకత్వంలోని బృందం మూడు రోజులుగా వైష్ణవి డెయిరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావడా, రాజు రాజశేఖరన్‌లను ఫిబ్రవరి 9 ఆదివారం విచారణకు పిలిపించి ప్రశ్నించారు.
కాంట్రాక్టులు వీళ్లకి ఎలా దక్కాయంటే...
ఏఆర్ డెయిరీ పేరుతో శ్రీవైష్ణవి డెయిరీ ప్రతినిధులే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ గుర్తించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సిట్ గుర్తించిన విషయాలేమిటంటే..
1. ఏఆర్ డెయిరీ పేరును ముందుపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నారు.
2. అసలు భోలేబాబా డెయిరీ (ఉత్తరాఖండ్)కి భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసింది.
3. భోలేబాబా నుంచి కిలో నెయ్యి రూ.355కు కొనుగోలు చేసి శ్రీవైష్ణవి డెయిరీ ఏఆర్ డెయిరీకి రూ.319.80కి సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా? అని విచారణలో ప్రశ్నించింది. డెయిరీ ప్రతినిధులు స్పందించలేదు.
4. ఆయా డెయిరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత? వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు? తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు.
5. టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకుంటే శ్రీవైష్ణవి డెయిరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్‌లో కిలో నెయ్యి ధర కనిష్ఠంగా రూ.500కు పైగా ఉంటే రూ.320కే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు? వంటి అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు.
వైసీపీ హయాంలోనే అవకతవకలు జరిగాయా?
రూ.319.80కి కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డెయిరీకి వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో నియమించిన టీటీడీ పాలకమండలి టెండర్లు ఖరారు చేసింది. 2024 జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జులై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించింది. వాటిని పరీక్షించేందుకు గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ కాఫ్ ల్యాబ్‌కు పంపించింది. ఆ శాంపిళ్లలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబరులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరితో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి నలుగురిని అరెస్టు చేసింది.
ఉత్తరాఖండ్ నుంచి ఏపీకి సరఫరా...
‘రూ.319.80కి కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2,300 కి.మీ. దూరంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి, ఏఆర్ డెయిరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. ఈ భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యికి మారుపేరు. రూర్కీ నుంచి వచ్చిన ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ వేరే ఇన్‌వాయిస్ నంబర్లతో తిరుమలకు పంపించింది’ అని సిట్ దర్యాప్తు బృందం గుర్తించింది.
ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను ప్రశ్నించారు. వాళ్లు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. దీంతో వారిని సిట్ అరెస్టు చేసింది.