మనిషికి 55 లీటర్లు తాగు నీరు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో బుధవారం ప్రారంభించారు.
By : The Federal
Update: 2024-12-18 07:43 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మనిషికి 55 లీటర్ల తాగు నీరు అందంచడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ రాష్ట్ర స్థాయి వర్క్ షాపును విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగు నీరు అందిస్తామన్నారు. కుళాయి ద్వారా సురక్షితమైన మంచి నీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. 2019 ఆగష్టు లో ఈ పథకం ప్రారంభమైనా బోర్ వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితం అయ్యిందన్నారు. ఒక మనిషికి 55 లీటర్లు నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్‌ను అమృత ధార పేరుతో అమలు చేస్తున్నామన్నారు. పని చేసే సమయంలోను, ఆచరణలోను ఎన్నో సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుందన్నారు. తాను పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిశాయన్నారు. ఈ పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా రూ. లక్ష కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల వరకు అడిగారని తెలిపారు.
2019లో చిన్న రాష్ట్రం కేరళ రూ. 46 వేల కోట్లు అడిగితే, గత ప్రభుత్వం ఏపిలో మాత్రం రూ. 26 వేల కోట్లే అడిగిందన్నారు. మన రాష్ట్రం వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వక పోవడం వల్ల జల్ జీవన్ మిషన్ అమలు కాలేదన్నారు. తాను కేంద్ర పెద్దలతో, కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేశారని మండిపడ్డారు. రిజర్వాయర్‌ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా, వాటిపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నీటి సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. మన రాష్ట్రానికి రూ. 70 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరామన్నారు. ఆ ప్రాజెక్టు వివరాలతో నివేదికను సిద్ధం చేస్తే కేంద్రానికి అందచేస్తామన్నారు.
పని చేయాలనే తపన ఉన్న అధికారులు మన రాష్ట్రం లో ఉన్నారు. నేను ఎక్కడకి వెళ్లినా పైపులు వేశారు, అయితే నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు చేశారు. నా నియోజవర్గం పిఠాపురంలో కూడా పైపుల ద్వారా సన్నగా సన్నగా నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు, వనరులు తెలుసుకునేందుకు ఈ వర్కు షాపు ఏర్పాటు చేశామన్నారు. పైపు లైన్లు, డిజైన్‌లు కూడా గందరగోళం గా ఉన్నాయన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకపోతే బాధ కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. జనవరి, 2025కి పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టును పొడిగించి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు చెప్పారు. లక్ష్యాలను సాధించేలా సహకరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి, ఈఎన్సీ వేంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.