మన్యం పిల్లల కన్నా సోమాలియా పిల్లలే నయమేమో, చంద్రబాబూ!!
గిరిజన బాలికల పరిస్థితి దయనీయమని వైఎస్ షర్మిల ఆవేదన
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-10-07 12:55 GMT
(బొల్లం కోటేశ్వరరావు, విశాఖపట్నం)
మన్యం జిల్లా కురుపాం తదితర గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులు అస్వస్థత పాలై కొద్దిరోజుల నుంచి విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్లపై ఉన్న బాలికలను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. హాస్టళ్లలో ఫుడ్ ఎలా ఉంటుంది? అని వారిని అడగ్గా.. సరిగా ఉండదని, తినబుద్ధి కావడం లేదని చెప్పారు. శుభ్రత ఉండదని, మంచినీళ్లు కూడా సరిగా ఉండవని, బాత్ రూమ్ ల్లో నీళ్లుండవని షర్మిలకు వివరించారు. దీంతో ఆ చిన్నారులకు ఆమె ధైర్యం చెప్పారు.
అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే?
గిరిజన బాలికల పరిస్థితి దయనీయం..
‘మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ హాస్టళ్లలో ఉంటున్న పిల్లలకు రక్త హీనతతో క్షీణించిపోయి, పోషకాహార లోపంతో చాలా బలహీనంగా ఉన్నారు. సోమాలియాలో ఉన్న పిల్లలా వారి చేతులున్నాయి. కారణమేమిటని అడిగితే తిండి బాగా లేదని, ఉడకక ముందే దించేస్తారని చెప్పారు. కనీసం నీళ్లు కూడా సరిగా ఉండవు. స్నానం చేయాలంటే ఉదయం ఐదు గంటలకే లేవాలి. బాత్రూమ్లకు వెళ్లాలన్నా నీళ్లుండవని చెప్పారు. నీళ్లు కలుషితం అయి ఇంతమంది పచ్చకామెర్ల బారినపడ్డారు.
కొందరు ఐసీయూలోనూ ఉన్నారు. కేజీహెచ్లో 50 మంది చేరారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మరొకరు కూడా చనిపోయారని అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడే కాదు.. ఎక్కడా కూడా ఆర్వో సిస్టం పని చేయడం లేదు. ఈ పిల్లలకు నోట్లో నాలుక లేదన్నట్టు మాట్లాడలేకపోతున్నారు. వీరికి ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకుంటారు? వీరి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. దక్కుతారా ? దక్కుతారా? అన్న ఆందోళనతో ఉన్నామని చెబుతున్నారు.
అన్యాయం అనిపించడం లేదా?
హాస్టళ్లలో మంచినీళ్లు కూడా ఇవ్వరని ఎవరైనా కలగంటారా? ఎంత నమ్మకం పెట్టుకుని పిల్లల్ని హాస్టళ్లలో చేర్పిస్తారు? కానీ ఈ హాస్టళ్లలో బాత్రూమ్లు, నీళ్లు. ఫుడ్ సరిగా ఉండదు. తాగే మంచినీరే కలుషితం అయితే? ఇది అన్యాయం అని ప్రభుత్వానికి అనిపించడం లేదా? రాష్ట్ర హైకోర్టు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు పరిస్థితి బాగులేదు.. మెరుగు పరచాలని జులైలో మొట్టికాయలు వేసింది. 228 మంది ఆడపిల్లలండే హాస్టల్లో ఒకే ఒక బాత్ రూమ్ ఉందట. 228 మంది పిల్లలకు ఒక బాత్రూమ్ ఉందంటే ఎవరైనా చలించాలి. ఒకరూమ్లో 17 మంది అమ్మాయిలను పెడుతున్నారట. వారికి పరుపులు కూడా లేక కింద పడుకుంటున్నారట. ఇవన్నీ హైకోర్టు చెప్పింది. అయినా ప్రభుత్వానికి పట్టదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు బాగులేవని చెప్పాం. అందుకే కదా ఇది జరిగింది? వాస్తవానికి మన్యం హాస్టళ్ల బాలికలు పచ్చకామెర్ల బారిన పడడం నమూనా మాత్రమే..
సీఎంకి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు..
సీఎం చంద్రబాబుకి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు. వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని, కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది. ప్రభుత్వ పెద్దలు ఒక మతానికి పెద్ద పీట వేయడం భావ్యం కాదు. పాలకులు గుడులతో పాటు చర్చిలు, మసీదులు కట్టాలి. పురోహితులతో పాటు ఇమామ్లు, పాస్టర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాలి. లేదంటే ఇతర మతస్తులు అభద్రతకు గురవుతారు. మేం రాజకీయాలు మాట్లాడం లేదు. మేం హిందువులకు వ్యతిరేకం అన్నట్టు సోషల్ మీడియాలో దూషించారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా గురించే కాదు.. మా నాన్న, అమ్మ, భర్త, కొడుకు గురించీ మాట్లాడారు.
హాస్టళ్ల పరిస్థితిపై సంతకాల సేకరణ..
చంద్రబాబు చాలా పెద్ద మాటలు చెబుతున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తామని చెబుతున్నారు. 2047లో ఎలా ఉంటుందో చెప్పుకుంటున్నారే? కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి? 22 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు ఏం ఆలోచిస్తారు? మేం జైల్లో ఉన్నాం.. కనీసం తాగడానికి నీళ్లే లేవని అనుకునే పరిస్థితి వస్తుంది.
చంద్రబాబు ఫోకస్ పెట్టాల్సింది ఇప్పడు ఈ బిడ్డల బాగు గురించి. 2027 కల్లా రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను మెరుగు పరచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు వెళ్లి అక్కడ పరిస్థితిని ఆరా తీసి సంతకాల సేకరణ చేపడతాం. ఆ తర్వాత సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. హాస్టళ్లను సరిగా నిర్వహిస్తున్నారా? లేదా అన్నది పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలి' అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.