కోట వినూత వీడియోలు పంపితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డబ్బిస్తానన్నారా?
చనిపోయిన 4 నెలల తర్వాత రాయుడి పేరిట వీడియో
By : The Federal
Update: 2025-10-13 06:44 GMT
శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఆమె పడకగదికి సంబంధించిన రహస్యాలున్న వీడియోలు పంపితే తనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి భారీ నగదు ఇస్తానని చెప్పినట్టున్న వీడియో కావడంతో అది బాగా వైరల్ అవుతోంది. రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
2025 జులై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్యచేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వినూత దంపతులు అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన సుమారు 20 నిమిషాల వీడియో ఆదివారం బయటకు వచ్చింది. దీన్ని ఎవరు విడుదల చేశారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
వీడియోలో ఏముందంటే..
కోట వినూత, చంద్రబాబు దంపతులను హత్యచేయాలని సుధీర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సుజిత్‌రెడ్డితో తనకు చెప్పించారని రాయుడు ఈ వీడియోలో తెలిపారు. ఈ క్రమంలోనే రోడ్డుప్రమాదంలో వారిని చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం జరిగిందని, 2024 ఎన్నికలకు ముందునుంచే బొజ్జల సుధీర్‌రెడ్డికి జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ సహకరించారని అందులో రాయుడు వివరించాడు.
‘2019 నుంచి వినుత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నా. 2023 నవంబరులో పేట చంద్రశేఖర్ ద్వారా సుధీర్‌రెడ్డి అనుచరుడు సుజిత్‌రెడ్డి పరిచయమయ్యారు. వినుత విషయాలన్నీ ఎప్పటికప్పుడు సుజిత్‌కు చెబితే రూ.30లక్షలు ఇప్పిస్తానని నాకు హామీ ఇచ్చారు. తొలుత రూ.2లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతావి ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీకాళహస్తి సమీపంలోని కోకాకోలా పరిశ్రమ వద్ద ఉండగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వచ్చి నీ జీతం ఎంతని నన్ను అడిగారు. రూ.9వేలని చెప్పగా రూ.19వేలు ఇస్తా తన దగ్గరకు రావాలని కోరారు. పదవి వస్తే ఇల్లు, కారు కొనిస్తానని వినుత నాకు హామీ ఇచ్చారని, వారి దగ్గరే ఉండాలని నా కుటుంబసభ్యులు కూడా చెప్పారని సమాధానమిచ్చా. దీంతో వినుత ప్రైవేటుగా ఉన్న వీడియోలు ఇవ్వాలని కోరారు. నా పేరు బయటకు రాకుండా చూస్తానన్నారు’ అని రాయుడు వీడియోలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మనుషులు బెదిరించారు..
‘వీడియోలు తీయడం నా వల్ల కాదని సుజిత్‌రెడ్డి, చంద్రశేఖర్‌కు చెప్పాను. దాంతో ఎమ్మెల్యే అంటే భయం లేదా అని సుజిత్ బెదిరించారు. రూ.30 లక్షలు కాకుంటే రూ.60 లక్షలు ఇస్తానన్నారు. అప్పటికీ వినకపోవడంతో కొట్టే సాయిప్రసాద్ ఫోన్‌చేశారు. వినుత దంపతులను ఊరి (శ్రీకాళహస్తి) నుంచి తరిమేయాలన్నారు. నువ్వు మాతో మాట్లాడిన విషయాలన్నీ రికార్డు చేశానని, వాటిని వినుతకు పంపిస్తే వారే ఏం చేయాలో చేస్తారని సుజిత్‌రెడ్డి నన్ను హెచ్చరించారు.
ఏప్రిల్ 26న వినుత సోఫాలో ఉండగా ఫోన్‌లో వీడియో రికార్డు చేశాను. అప్పుడు శబ్దం రావడంతో ఆమె ఆ సెల్‌ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. నన్ను ఇంట్లోనే బంధించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాలు విరిగింది. వినుత దంపతులు పదేపదే ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పేట చంద్రశేఖర్, సుజిత్‌రెడ్డి ఉన్నాడని చెప్పాను’ అని రాయుడు వీడియోలో వెల్లడించారు.
ఇటీవల కొట్టే సాయిప్రసాద్‌కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా పదవి లభించింది. దీనిపై వినుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.