ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో పండగ

పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం కళకళలాడుతూ కనిపించింది. సర్పంచ్ ల ముఖాల్లో కాస్త తేజస్సు కొట్టొచ్చినట్లు కనిపించింది.

Update: 2024-08-23 10:01 GMT

పల్లెలు గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మలని నాడు మహాత్మా గాంధీ అన్నారు. ఆయన ఎందుకు ఈ మాట అన్నారంటే పల్లెల్లోనే ఆహార పంటలు ఉంటాయి. స్వరాజ్యమంటే వారిని వారు పాలించుకుంటూ సంతోషంగా గడుపుతారు. పల్లెలు బాగుంటే పట్టణాలు కూడా అభివ్రుద్ధి చెందుతాయి. రాజ్యానికి పల్లెలే పట్టుగొమ్మలనే మాట ఈ ఐదేళ్లలో పాలకులు మరిచిపోయారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా పాలన పంచాయతీ వాకిటి వద్దకు వెళ్లిందనుకున్నారే కాని పంచాయతీ సర్పంచ్ ప్రజల చేత ఎన్నుకోబడిన వాడని, ఆయన ఆ పంచాయతీకి పాలకుడనే విషయం నాటి సీఎం వైఎస్ జగన్ మరిచిపోయారు. దీంతో ఆ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీల మద్దతుదారులైన సర్పంచ్ లు జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా జగన్ తాను అనుకున్న పథకాలకు ఇచ్చారు. పంచాయతీల్లో కనీస మౌలిక వసతులు లేకుండా పోయాయి. సర్పంచ్ లు చేతులెత్తేశారు. పాలకవర్గ సమావేశాలకు తిలోదకాలిచ్చారు. రోడ్లపై దుమ్ము పేరుకుపోయింది. చెత్తకూడా ఎత్తి బయట వేసేందుకు ట్రాక్టర్ కొనుగోలు చేయలేని స్థితికి పంచాయతీలు జారిపోయాయి. సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి పెత్తనం చేసే స్థాయికి పాలన పోయింది. వార్డు వాలంటీర్, సచివాలయంలో ఒకరిద్దరు ఉద్యోగులు పంచాయతీ పాలన చూసే వారుగా మారారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది.

పవన్ రాకతో ఊపిరి..

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు, చేతలు గ్రామ పంచాయతీలను గ్రామ ఆర్థిక వనరుగా మార్చేకార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉంది. శుక్రవారం అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని మైసూరువారి పల్లె గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. పల్లెల్లో ప్రజలు సంతోషంగా ఉండాలంటే పంచాయతీ కార్యాలయంలోని పాలకులు, ఉద్యోగులు సంతోషంగా ఉండాలి. అప్పుడే అక్కడి ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పడం విశేషం. పంచాయతీలకు వచ్చే నిధులు పైసా కూడా ప్రభుత్వం వాడుకోదు. పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక వసతులు కోసం ఖర్చుచేసి అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతుండగా స్థానికంగా ఉన్న ఒక రైతు నేరుగా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి పంచాయతీ భవనం నిర్మించేందుకు తాను తనకు ఉన్న పది సెంట్ల స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థలాలే కాదు పంచాయతీలకు భూములు తప్పకుండా వుండాలన్నారు. భవిష్యత్ లో పంచాయతీలు ఆర్థిక పుష్టిని అందుకుంటాయన్నారు.

Delete Edit

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సభలు

పంచాయతీలకు విడుదలైన రూ. 4,500 కోట్లను ప్రభుత్వం నిర్ణయించిన 87 రకాల పనుల్లో దేనికైనా ఖర్చుపెట్టుకోవచ్చు. ఈ పనుల వల్ల 54 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశం ఏర్పడింది. మొత్తం 13,326 పంచాయతీల్లో నేడు గ్రామ సభలు జరుగుతున్నాయి. సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు కూడా ఈ సభల్లో పాల్గొంటున్నారు. అందరూ కలిసి ఏ పనులైతే చేయాలని అనుకుంటారో వాటిని ఆమోదించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి పనులు మొదలు పెట్టాలని చెప్పడం జరగలేదని, ఇది ఒక స్వర్ణయుగమని చెప్పొచ్చని సర్పంచ్ లు పలువురు చెప్పడం విశేషం. ఎన్ఆర్ఈజీఎస్ సభలు ఎలాగైతే జరిగాయో ప్రతి మూడు నెలలకు ఒకసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం కూడా జరుగుతుందనే అభిప్రాయాన్ని సర్పంచ్ లు వ్యక్తం చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో కూడా పాలకవర్గ సమావేశాలు ప్రస్తుతం జరగటం లేదు. రికార్డుల్లో వార్డు సభ్యుల నుంచి సంతకాలు తీసుకుని సమావేశం అయిపోయిందనిపిస్తున్నారు. ఇకపై అలా ఉండకపోవచ్చనేది సర్పంచ్ ల మాట.

ఇకపై పండగలు భలే బాగుంటాయి...

ఇప్పటి వరకు జాతీయ పండగ దినాల్లో గ్రామ పంచాయతీలకు టీఖర్చులకు కూడా నిధులు ఇచ్చేవారు కాదు. మైనర్ పంచాయతీలకు రూ. 100లు, మేజర్ పంచాయతీలకు రూ. 250లు ఖర్చు పెట్టుకునేందుకు అవకాశం ఉండేది. దీనిని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పెంచారు. మైనర్ పంచాయతీలకు రూ. 10వేలు, మేజర్ పంచాయతీలకు రూ. 25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్ల కాలంలో పంచాయతీల ఆదాయం కూడా తగ్గింది. ఉపాధిహామీ నిధులు రూ. 40,579 కోట్లు ఖర్చుపెట్టినట్లు లెక్కలు చూపిస్తున్నారు. పంచాయతీల్లో ఎక్కడా కనీస సౌకర్యాలు కనిపించడం లేదని పవన్ అన్నారు.

ఒక్కో పంచాయతీ ఒక్కో దానికి ప్రసిద్ధి..

రాష్ట్రంలోని చాలా వరకు పంచాయతీలు ఏదో ఒకదానికి ప్రసిద్ధి కాంచినవి ఉన్నాయి. ఈ ప్రసిద్ధి గాంచిన పంచాయతీల్లో అందుకు సంబంధించి ఎలా పనిచేసి ఆదాయం సంపాదించాలో పంచాయతీరాజ్ శాఖ ఆలోచిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. అంటే ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా ఆనందపురం పూలకు ప్రసిద్ధి, అరకు కాఫీ పంటకు ప్రసిద్ధి, మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి వస్తువులు, బాపట్ల జిల్లా వేటపాలెం, క్రిష్ణా జిల్లా చిలకలపూడి, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి హస్తకళలకు ప్రసిద్ధి అక్కడి వారిని ప్రోత్సహించడం ద్వారా కళ బతుకుతుంది. తద్వారా పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

డెన్మార్క్ చిన్నదేశం, అక్కడి నుంచి మన దేశానికి ఏటా రూ. 6వేల కోట్ల విలువైన కలపను దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం కలప కోసం పెద్దమెత్తంలో విదేశీ మారక ద్రవ్యం వెళుతోంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి వ్రుధాగా ఉన్న స్థలాల్లో సామాజిక వనాలు పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టకుకోవచ్చని పవన్ కళ్యాన్ చెప్పటం పలువురిని ఆకట్టుకుంది. ప్రత్యేకతలు ఉన్న గ్రామాల్లోకి పర్యాటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే పంచాయతీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందనేది పవన్ మాట.

Tags:    

Similar News