నెల్లూరు పెద్దా రెడ్లపై పోటీకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారి
నెల్లూరు పార్లమెంట్ ఒకప్పుడు ఎస్సీ రిజర్వుడు. 2009 నుంచి జనరల్‌గా మారింది. రెండు ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం గెలిచింది. ఈ సారి దళిత అధికారి పోటీకి దిగారు.
By : The Federal
Update: 2024-04-10 14:07 GMT
జి విజయ కుమార్
నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు బరిలోకి దగడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో తెరవెనుక చక్రం తిప్పిన కొప్పుల రాజు కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఉద్దండులైన నాయకులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల నుంచి పోటీ చేస్తుండగా దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల వీరితో తలపడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. రాజు 1981వ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి.
పేదల కలెక్టర్‌గా కొప్పుల రాజు
నెల్లూరు జిల్లాతో కొప్పుల రాజుకు మంచి అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాకు కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో పేదల కలెక్టర్‌గా కొప్పుల రాజు పేరుగడించారు. 1988 నుంచి 1992 వరకు కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. దాదాపు నాలుగేళ్లు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కే రాజు బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసి అందరి మనన్నలు పొందారు. తాగు నీటి సమస్యలను తీర్చడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి కూడా ఆయన కృషి చేశారు. ప్రత్యేకించి విద్య, వైద్యంపై దృష్టి పెట్టారు. జిల్లాలో అక్ష రాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్ష రాస్యత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చదువు, దాని ప్రాముఖ్యతను జిల్లా నలుమూల గ్రామాలకు కూడా వ్యాపింప చేశారు. దీని కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలకు నాంది పలికారు. జిల్లాలోని కళాకారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదువు, దాని ప్రాముఖ్యత మీద లఘు నాటకాలు, పాటలు రూపొందిండం, వాటికి నృత్య రూపకాలను జోడించి ప్రతి పల్లెకు చేరవేశారు. ఆసక్తికరమైన, శాస్త్రీయ దృక్ఫథ ఆలోచనలు పెంపొందించే ఇతివృత్తాలతో కూడిన పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించారు. ఒక ఉద్యమంలా చేపట్టిన నెల్లూరు జిల్లా అక్షరాస్యత కార్యక్రమం నాటి ఉమ్మడి రాష్ట్రానికే ఆదర్శంగా నిలచింది.
సారా వ్యతిరేక ఉద్యమానికి ఆద్యుడు
ఆ తర్వాత కాలంలో సారా వ్యతిరేక ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. 1992లో నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభించింది. నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట దూబగుంటలో మొదలైన ఈ సారా వ్యతిరేక ఉద్యమం లావాలా జిల్లా అంతా వ్యాపించింది. ఆ గ్రామంలో సారా సమస్య తీవ్రంగా ఉండేది. అక్షరాస్యత కార్యక్రమంలో రూపొందించిన ‘సిరిపురం సీతమ్మ కథ’ ఆ ఊరి మహిళలను ఎంతగానో ఆలోచింప చేసింది. ఈ కథలో సీతమ్మ అనే క్యారెక్టర్ ఆ ఊరి స్త్రీలను కూడగట్టి వారి ఊర్లోకి సారా రాకుండా అడ్డుకోగలగుతుంది. ఆ పాఠంతో దూబగుంట గ్రామం మహిళలు స్పూర్తిని పొందారు. దూబగుంటలో కూడా సారా లేకుండా చేసేందుకు నడుం బిగించారు. దానికి రోశమ్మ నాయకత్వం వహించింది. సారాను ఆ ఊరి నుంచి తరిమివేయడంలో కీరోల్ పోషించిన దూబగుంట రోశమ్మకు రాష్ట్ర వ్యాప్తంగా జేజేలు పలికారు. నాటి ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ కూడా ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. తర్వాత కాలంలో వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించే స్థాయికి సారా ఉద్యమం ప్రభావం చూపింది. అలా ఈ రెండు ఉద్యమాలకు ప్రధాన కారకుడైన నాటి నెల్లూరు జిల్లా కలెక్టర్ కొప్పుల రాజు ఒక్క సారిగా హీరోగా మారారు. అలా నెల్లూరు జిల్లాతో ఆయనకు విశేష అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.
స్వచ్ఛంద పదవీ విమరణ చేసి కాంగ్రెస్‌లోకి..
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కొప్పుల రాజు 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అంతకు ముందు సోనియా గాంధీ అధ్యక్షతన గల జాతీయ సలహామండలి సంయుక్త కార్యదర్శిగా ఢిల్లీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ కార్యదర్శిగా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీఎం రోశయ్య హయాంలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. అయితే జాతీయ సలహా మండలిలో పని చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీతో రాజుకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజు పనితీరు నచ్చడంతో విఆర్‌ఎస్ తీసుకొని పార్టీలోకి రావలసిందిగా రాహుల్ కోరడంతో రాజు విఆర్‌ఎస్ తీసుకొన్నారు. తర్వాత కొప్పుల రాజు ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల విభాగానికి జాతీయ సమన్వయ కర్తగా ఉన్నారు. సీడబ్ల్యూసీ శాశత్వ ఆహ్వానితుడుగా ఉన్నారు. నాటి యుపిఏ ప్రభుత్వంలో తెరపైకి వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్‌టీఇ), రైట్ టు ఇన్‌ఫర్మేషన్(ఆర్‌టిఐ) చట్టాలతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్), ఆహార భద్రత పథకాల రూపకల్పనలో క్రియా శీలక పాత్ర పోషించారు.
2009లో జనరల్‌గా మారిన నెల్లూరు పార్లమెంట్
నెల్లూరు పార్లమెంట్ స్థానం 1952లో జనరల్‌గా, 1957లో ద్విసభ్య నియోజక వర్గంగాను, 1962 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉండేది. 2009 నుంచి జనరల్‌గా మారింది. నెల్లూరు పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. 13 సార్లు కాంగ్రెస్ గెలవగా కేవలం ఒక్క సారి మాత్రమే టీడీపీ గెలిచింది. రెండు సార్లు వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. 2009, 2012, 2014, ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలవగా, 2019లో ఆదే పార్టీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఉద్దండులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఇద్దరూ రాజ్యసభ మాజీ సభ్యులు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వి విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి బరిలోకి దిగారు. వీరిద్దరితో కాంగ్రెస్ అభ్యర్థిగా కొప్పుల రాజు పోటీ పడుతున్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలు ఇద్దరూ ఆర్థికంగాను, సామాజిక పరంగాను బలవంతులే. వీరితో పోలిస్తే పేరుకు మాజీ ఐఏఎస్ అధికారి కావచ్చు కానీ ఆర్థికంగా అంత స్థోమత కానీ బలమైన సామాజిక వర్గ నేపథ్యం కానీ కొప్పుల రాజుకు లేదు. ఓటములు గెలుపులు పక్కన పడితే దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల రాజు జనరల్ సీటుకు పోటీపడటం శుభపరిణామమని చెప్పొచ్చు.