మదనపల్లె:ఖననం చేసిన శవం చోరీకి యత్నం?

చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఘటన.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-03 06:59 GMT

సాధారణంగా ఇళ్లలో చోరీలు జరుగుతుంటాయి. రోడ్డుపై వెళ్లే మహిళల మెడ నుంచి బంగారు గొలుసులు లాక్కుని వెళ్లడం వంటి చోరీ ఘటనలు విని ఉంటాం. మదనపల్లెలో ఓ వ్యక్తి స్మశాన వాటికలో కరణం చేసిన మృతదేహాన్ని చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఖననం చేసిన శవాన్ని ఎందుకు బయటకు తీశాడు? క్షుద్ర పూజలు చేయడానికా? మరేదైనా కారణం ఉందా అనేది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ మాట్లాడుతూ,
"నిందితుడిని విచారణ చేస్తున్నాం. అతని మానసిక స్థితి సరిగా ఉన్నట్లు కనిపించడం లేదు" అని సీఐ కళా వెంకటరమణ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన వివరాలు లోకి వెళితే..
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన పాలూరి శంకరయ్య కొడుకు పాలూరు దిలీప్ అనారోగ్యంతో మరణించాడు. దిలీప్ మృతదేహాన్ని అంకిశెట్టిపల్లెకు సమీపంలో ఉన్నశ్మశానవాటికలో శనివారం సాయంత్రం ఖననం చేశారు. కొడుకు చనిపోవడంతో తీవ్ర వేదనలో ఉన్న శంకరయ్య కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఆ బాధ నుంచి ఇంకా బయటపడని ఆ కుటుంబాన్ని ఓ యువకుడు మరింత క్షోభకు గురి చేశాడు.
అంకిశెట్టిపల్లె వాటిక వద్ద శ్మశానవాటికలో ఖననం చేసిన పాలూరి దిలీప్ సమాధి వద్దకు యువకుడు వెళ్ళాడు. చేతులతోనే మట్టిని తోడేయడంతో దిలీప్ మృతదేహం బయటపడింది. ఆ శవాన్ని వెలుపలికి తీసే ప్రయత్నంలో ఉండగా శ్మశానవాటిక సమీపం నుంచి వెళుతున్న కొందరు గమనించారు. వెంటనే పోలీసులతో పాటు మృతుడు దిలీప్ తండ్రి శంకరయ్య కుటుంబాన్ని కూడా సమాచారం ఇచ్చారు.

కొడుకును కోల్పోయిన శంకరయ్య తోపాటు గ్రామస్తులు, పోలీసులు కూడా శ్మశానవాటిక వద్దకు చేరుకుని, ఖననం చేసిన శవాన్ని వెలికితీస్తున్న యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సంఘటనతో కొడుకును కోల్పోయిన శంకరయ్య ఆయన కుటుంబం తీవ్ర వేదనకు గురయ్యారు. శంకరయ్య ఏమి చెప్పారంటే..
"నా కొడుకు దిలీప్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శుక్రవారం శస్త్ర చికిత్స చేయించాం. అదే రోజు రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తెచ్చాం. బంధువులందరూ వచ్చిన తర్వాత శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నా కొడుకు దిలీప్ మృతదేహాన్ని ఖననం చేశాం" అని శంకరయ్య వివరించారు.
శ్మశానవాటికలో పూడ్చిన శవాన్ని గుర్తు తెలియని యువకుడు ఎందుకు బయటకు తీశారు అనేది పోలీసులు తేల్చాలని ఆయన కోరారు. శవాన్ని బయటకు తీస్తుండగా పట్టుబడిన యువకుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ కళా వెంకటరమణ ఏమి చెప్పారంటే..
"నిందితుడి పేరు గోవర్ధన్ అని చెబుతున్నాడు. తనది ఉత్తరప్రదేశ్ అని ఒకసారి. జైపూర్ అని ఇంకోసారి చెప్పాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు కానీ సెల్ఫోన్ కూడా లేదు. కుటుంబ సభ్యుల వివరాలు కూడా చెప్పడం లేదు. అతని తీరు చూస్తుంటే మానసిక రుగ్మతతో ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం" అని సీఐ కళా వెంకటరమణ స్పష్టం చేశారు.
మదనపల్లె ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో తీవ్ర కలకలం చెలరేగింది. పోలీసులు సేకరించే వివరాల ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది.
Tags:    

Similar News