KAPILA TIRTHAM |కామాక్షి అమ్మవారికి కానుకగా వెండి చీర
కపిలతీర్థంలో అమ్మవారి 9 కిలోల వెండి ఆభరణాలు కానుకగా అందించారు. రూ.9.28 లక్షల విలువైన భారీ కానుకలు సమర్పించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-12 11:28 GMT
తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించే దాతలకు కొదవ ఉండదు. టీటీడీ అనుబంధ ఆలయాల్లోని దేవతామూర్తులకు కూడా దాతలు విలువైన కానుకలు సమర్పించడానికి ఆసక్తి చూపుతారు.
తిరుపతిలోని కపిలతీర్థం వద్ద కొలువైన కపిలేశ్వర సమేత కామాక్షి అమ్మవారికి దాతలు బుధవారం వెండిచీర తోపాటు ఆభరణాలు కూడా సమర్పించారు. 9.115 గ్రాముల బరువున్న కానుకలు సమర్పించారు. ఆ కానుకలను టీటీడీ తిరుపతి జేఈఓ వి. వీరబ్రంహ్మంకు కపిలతీర్థం ఆలయంలోని ఊంజల్ మండపం వద్ద దాతలు అందించారు.
తిరుమలకు చెందిన ఎస్వీ నరహరి దంపతులు బుధవారం ఈ భారీ విరాళాన్ని కానుకగా అందించారు. సుమారు రూ. 9.28 లక్షలు విలువైన 12 రకాల ఆభరణాలను తిరుపతి జేఈవో వి. వీరబ్రహ్మంకు దాత అందజేశారు.
దాత అందించిన ఆభరణాలు
కపిలతీర్థంలోని కామాక్షి అమ్మవారికి అలంకరించడానికి దాతలు నరహరి దంపతులు అందించాన కానుకల్లో 12 రకాల వెండి ఆభరణాలు ఉన్నాయి. అందులో అమ్మవారికి విగ్రహానికి అలంకరించడానికి ఒక కిరీటం, రెండు చెవులు, చేతులు 4, పాదాలు 2, పీఠం 2, అమ్మవారికి ఓ చీర ఉన్నాయి. అనంతరం ఆభరణాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దాత ఎస్వీ నరహరి దంపతులను టిటిడి జేఈవో వీరబ్రహ్మం శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబసభ్యులు, డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈవో కె. సుబ్బరాజు, సూపరింటెండెంట్ కెపి.చంద్రశేఖర్, డిఈ మల్లయ్య, టెంపుల్ ఇస్పెక్టర్ ఎ. రవికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.