వెళ్లినపుడల్లా కొత్తగా కనిపించే ‘తాటికోన’ కు ట్రెక్

తిరుపతి నుంచి బైపాస్ మీదుగా చంద్రగిరి వెళ్తుంటే మొండి కాల్వ వస్తుంది. అక్కడి నుంచి 2 కి.మీ దూరాన కొండల నడుమ ఆహ్లాదకరమయిన వాతావరణంలో తాటికోన ఉంటుంది.

Update: 2024-10-03 02:00 GMT

ఆదివారమని లేదు, ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడు, ఎవరూ గుంపుగా రాకపోయినా, నా శిష్యుడు శీనును తోడు తీసుకుని ఎక్కడికో ఒక్క చోటికి ట్రెకింగ్ కు పోవటం అలవాటయింది. దాదాపు చాలా ప్రాంతాలు పదులమార్లు చూసి వచ్చినాము కదా అందుకుని అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాలను తరచూ పోయి రావడానికి ఎంపిక చేసుకున్నాను.

ఒక ప్రదేశానికి ఎన్ని మార్లు పోయివచ్చినా ప్రతిసారి కొత్తదనమేదో అనుభవిస్తున్నాను. కన్యాశుల్కం ఎన్ని మార్లు చదివినా ఆయా కాలం, సందర్భాన్ని బట్టి కొత్తగా ఏమో తెలుస్తున్నది కదా! ఇప్పటికే పదులమార్లు చదివినా ‘మైదానం’లో ఏవో కొత్త కోణాలు కనిపించడం లేదూ! మహాప్రస్థానం పదే పదే చదివినా, వోల్గా సే గంగా మళ్లీ మళ్లీ చదివినా ప్రతి సారీ ఏదో ఒక కొత్త సంగతి తెలుస్తూనే ఉంటుంది.

అట్లానే నేను పోయే ప్రతి ట్రెక్కింగ్ ప్రదేశం నూతన ఆవిష్కరణలు చేయిస్తూనే ఉంటుంది. ప్రకృతి అత్యంత చమత్కారమయినది. ప్రతి ఋతువు గొప్ప ఆకర్షణీయంగా, రమణీయంగా హత్తుకుంటుంది. ప్రకృతి, జంతుజాలం, ,సూర్యాస్తమయాలు, పొద్దు పొడుపులు, చంద్రోదయాలు, అమావాస్యలు అనుభవించి పరవశించవలసిందే గానీ అక్షరాల్లో నిబిడీకృతం చేయలేం. చేసినా ఆ ఒరిజినాలిటి అందదు.

ఈ సోమవారం తాటికోన అనుకుని మేమిద్దరమే బయలు దేరినాము.



తిరుపతి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా చంద్రగిరి వెళ్తుంటే మొండి కాల్వ వస్తుంది. అక్కడి నుంచి తాటికోన దారి పట్టాలి. 2 కి.మీ దూరంలో కొండల నడుమ ఆహ్లాదకరమయిన వాతావరణంలో తాటికోన ఉంటుంది.


మెగాలిత్ నీడలో ట్రెకర్, ఈ వ్యాస రచయిత భూమన్

సోమవారాలు మా ఈతకు శెలవు. అందుకని కాంపెన్సేటివ్ గా ఆ రోజు ట్రెకింగ్ లు అలవాటు. మన దగ్గర్లో మామండూరు, మల్లయ్య కొండ, కాలభైరవ గుట్ట, బామ్మర్దిబండలు, ఉరికొయ్య, ఉప్పసట్టి పప్పుసట్టి, సుద్ద కుంట, తాటికోన ఉండనే ఉండాయి. ఇంకొంచెం దూరం అనుకుంటే గుర్రప్ప కోన, జర్రికోన, దొనకొండ, సింగరికోన, నగిరి ముక్కు ఉన్నాయి, కొదవలేదు.



పోయిరావాలనే సంకల్పం ఉండాలంటే, ప్రతి ప్రదేశానికి ఏదో ఒక చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఉంటుంది. 


తాటికోనలో ఉన్న ఈ మెగాలిత్ అంత్యంత పురాతనమయినది. ప్రాచీన మనిషి కాలం నాటిది. మెగాలిత్ ని ఆదిమ మానవుని సమాధి అంటారు. అడుగున చిత్రలిపి కూడా ఉంది. ఇట్లాంటిది మాచుట్టుపక్కల కొన్ని వేలు వుండేవి. పోయినవి పోగా, మేకల మేపుకునే వారి పుణ్యమాని కొన్ని మిగిల్నాయి. లండన్ లో ఇట్లాంటి దాన్ని పరిరక్షించి ప్రపంచ పర్యాటకుల్ని రప్పించేలా చేశారు. మనకేదీ ఆ చిత్తశుద్ధి. చారిత్రక స్పృహ.




 అంతేకాదు, ఈ తాటికోనలోనే ప్రస్తుతం ఉన్న చంద్రగిరి రాతి కోటకు మునుపు ఒక మట్టికోట ఉండేదని మా ఎనుగుల రమణ అంటుంటాడు. అటువంటి వారిని పట్టుకుని మరింత చరిత్రను పిడికిట పట్టితే కదా!




కొంచెం పక్కగా అద్భుతమయిన కోనేరు, గుడి ఆనవాళ్లు ఉన్నాయి. దీన్ని గురించి ఇంతకు మునుపే రాసినాను. విజయనగర రాజుల కాలంలో ఇక్కడ అద్భుతమయిన దేవాలయం, దాని చుట్టూ పెద్ద మార్కెట్టు ఉండినట్లుగా తెలుస్తున్నది. 




ఆ గుండు మీద ఆ గోపురం ఎంత ముచ్చటగా ఉందో గమనించండి. తాటికోన పై కొండనుంచి చూస్తే దూరంగా చంద్రగిరి కోట అత్యద్భుతంగా కనువిందు చేస్తున్నది.





చమటలు కక్కుకుంటూ దాదాపు రెండు గంటలు అంగళం అంగుళం తిరిగి కొత్త కొత్త అనుభూతులు ఆస్వాదించుకుని తిరిగొస్తూ తిమ్మమ్మ శిథిల కట్టడాల ధీనవాస్థను చూసి దు:ఖిస్తూ వెనుదిరిగినాము.



మనం చేసే సాహితి, సామాజిక, సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రకృతి చుట్టూత తిరగటం ఒక అలవాటుగా మార్చుకుంటే మనిషికి ఆ తీరే వేరు. ప్రతిఒక్కరూ ప్రకృతిలో మమేకమైతేనే ఈ సమాజపు అంతు తెలుసుకోగలరు.

Tags:    

Similar News