జస్టిస్ రమణ, జగన్ మధ్య గొడవేంటీ? ఇప్పుడెందుకు ఆయన అంత మాట అన్నారు?
వ్యవస్థల పోరాటమా? వ్యక్తుల మధ్య ప్రతీకారమా?
By : A.Amaraiah
Update: 2025-11-02 05:52 GMT
ఇప్పుడు ఆ ఇద్దరికీ పదవులు లేవు. ఇద్దరూ మాజీలే. అయినా పాత జ్ఞాపకాలు వెంటాడుతున్నట్టున్నాయి. ఎవరి లాజిక్ వాళ్లకున్నా... మానిపోయాయని అనుకుంటున్న గాయాల్ని రేపుతున్నారు. వాళ్లిద్దేరే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
ఐదేళ్ల కిందట వీరిద్దరి మధ్య ప్రారంభమైన ప్రచ్ఛన్న యుద్ధ కారణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నవంబర్ 1న ఓ ప్రైవేటు యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ తన కుటుంబాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటాడిందని ఆరోపించారు. ‘నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి తీసుకురావడానికే అలా చేశారని మీ అందరికీ తెలుసు. నన్నే కాదు.. రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యాయి. వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారు. అలాంటి క్లిష్ట సందర్భాల్లోనూ న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేశారు. బాధ్యతగా పనిచేయడమూ కొన్నిసార్లు వ్యక్తిగతమైన బాధగా మిగిలిపోతుంది’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గతాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే స్థాయిలో జస్టిస్ రమణ ఆరోపణలను కొట్టివేసేందుకు వైసీపీ నేతలు, జగన్ విధేయులైన న్యాయ కోవిదులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు చోటామోటా వైసీపీ నాయకులు- జస్టిస్ రమణ గతమెంటో తమకూ తెలుసులే అని వెటకారం ఆడనే ఆడారు.
ఇదీ నేపథ్యం...
2019 తర్వాత- రాజధాని అమరావతి పథకం, మూడు రాజధానులు, హైకోర్టు బెంచ్‌ల రొటేషన్, జగన్ పై అప్పటికే ఉన్న సీబీఐ కేసులు వంటివి ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. 2020 నాటికివి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ముఖ్యాంశాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా జస్టిస్ ఎన్.వి. రమణ, వైఎస్ జగన్ మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం న్యాయ-రాజకీయ పరివర్తనలకు ద్వారాలు తెరిచినట్టయింది. అప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఓ కృష్ణా జిల్లా ప్రముఖుడు, ఎన్వీరమణ సమకాలికుడు- జగన్ వైపు చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే అసలు వివాదం ప్రారంభమైనట్టు రాజకీయవర్గాలు చెబుతుంటాయి.
అసలు ఏమైందంటే?
2020 అక్టోబర్ 6న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన జస్టిస్ రమణపై కొన్ని భూముల ఆక్రమణ, చట్టవిరుద్ధంగా కొనుగోళ్లు (Amaravati స్కామ్), హైకోర్టు బెంచ్‌ల మార్పులు, ఇతరత్రా రాజకీయ ప్రభావాలు వంటి ఆరోపణలు చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ, ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖ కలకలం రేపింది. ఈ లేఖ రాయడం ఓ ఎత్తయితే దాన్ని బయటపెట్టిన తీరుమరో ఎత్తుగా మారింది. దీంతో జగన్‌ను ఈ రెండు వ్యవహారాల్లో దోషిగా నిర్దారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
జస్టిస్ రమణపై విచారణ..
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ఏఎన్నార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది.
సుప్రీంకోర్టులోని మూడు నంబర్ కోర్టులో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించి జస్టిస్ రమణకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ తీర్పు జగన్ కి పెద్ద షాక్. ఇక, అప్పటి నుంచి ఈ ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ప్రత్యక్ష యుద్ధంగా మారిందంటారు విశ్లేషకులు.
రాజకీయ పరిణామాలు ఇలా..
జస్టిస్ రమణ ఈ లేఖను “న్యాయస్థానంపై ప్రతికూల ప్రభావం కలిగించే చర్య”గా అభివర్ణిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు: “నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారు… రాజ్యాంగ విలువలను కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యాయి” అని ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పి ఉండవచ్చు.
వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పై “ప్రాతినిధ్యం లేకుండా న్యాయవ్యవస్థను రాజకీయంగా వాడుతుంటుంద” అన్న వ్యాఖ్యలు కాస్తంత కఠినంగానే వినిపించాయి.
ఈ వివాదం న్యాయవ్యవస్థ స్వతంత్రత, ముఖ్యమంత్రి అధికార హద్దులు, రిపోర్టింగ్ వేదికల స్వేచ్ఛ వంటి మౌలిక ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చింది. న్యాయ వ్యవస్థను రాజకీయ ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలపై పౌర సంస్థలు, న్యాయవాదులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఈ గొడవ వ్యక్తిగత విభేధమా లేక వ్యవస్థల మధ్య ఏర్పడిన ప్రజాస్వామ్య విలువలపై పోరాటమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. జస్టిస్ రమణ-జగన్ సంబంధాల నేపథ్యంలో ఏర్పడిన ఈ పరిణామం, ఆంధ్రప్రదేశ్ న్యాయ, రాజకీయ భవిష్యత్తుకు కీలక సూచికగా నిలవచ్చు.
ఇవన్నీ ఎలా ఉన్నా, ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఆ పని ఎవరు చేసినా సంతోషించాల్సిందేనని పౌరహక్కుల నాయకుడు ఎం. శేషగిరి రావు అన్నారు.
నిప్పు లేకుండానే పొగవచ్చిందా..
జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు ఒక సాధారణ ప్రసంగంలో భాగమో, లేక తన అంతరంగంలో మిగిలిన బాధో ఆయనకే తెలుసు. కానీ ఈ వ్యాఖ్యలతో ఒక గతం పునరావృతమవుతోంది. అది రాజకీయ ప్రతీకారం, న్యాయవ్యవస్థపై ప్రభావం, వ్యవస్థల మధ్య ఉన్న అంతర్గత ఘర్షణ.
జగన్ కాలంలో న్యాయమూర్తులపై ఒత్తిళ్లు ఉన్నాయన్న వాదన ఎంత నిజమో, జస్టిస్ రమణ కుటుంబం టార్గెట్ అయిందన్న అభిప్రాయమూ అంతే నిజం.. అయితే ఇవి నిర్ధారించలేని సత్యాలు.
కానీ ఒకటి మాత్రం స్పష్టం.
రాజకీయాలు న్యాయవ్యవస్థను దెబ్బతీసినప్పుడు, న్యాయవ్యవస్థ కూడా రాజకీయాల వేదికగా మారుతుంది. ఈ రెండు రంగాలు ఒకదాన్ని మరొకటి ఉపయోగించుకున్న ప్రతీసారి ప్రజాస్వామ్యమే బలహీనమవుతోంది.
రమణ వ్యాఖ్యలతో, “న్యాయవ్యవస్థపై దాడి” అనే పాత చర్చ తిరిగి మొదలవుతుంది. కానీ ఈసారి ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే.. 'రాజకీయ నేతలు, న్యాయమూర్తులు ఎవరూ తప్పు చేయలేదు అనుకుంటే, ఈ పరస్పర ఆరోపణలు ఎక్కడి నుండి వస్తున్నాయి?'.
ఇదే ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అధికారాలు మారినా, వ్యవస్థలపై నమ్మకం సడలకుండా ఉండడమే రాజ్యాంగానికి గౌరవం.
జస్టిస్ రమణ, జగన్ ఇద్దరూ వారివారి రంగాలలో పరిణితి చెందిన వారే. ఉచితానుచితాలేమిటో వారికి తెలియదని అనుకోలేం. గతం నుంచి ఇద్దరూ పాఠాలు నేర్చుకుంటే మంచిది.