పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు విజయవాడ, అమరావతి, సచివాలయాల్లో ఘన స్వాగతం లభించింది. రేపు పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.

Byline :  The Federal
Update: 2024-06-18 13:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వంలో వపన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రేయారిటీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ను తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రితో సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్‌ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయించారు. గతంలో ఎప్పుడు జరగని కొత్త ఒరవడి ఇది. పవన్‌ కల్యాణ్‌కు ప్రభుత్వం బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారును పవన్‌ కల్యాణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ కారును ఉన్నతాధికారులు కేటాయించారు. జగన్‌ ప్రయాణించిన కారులో తాను ప్రయాణించనని చంద్రబాబు నాయుడు దానిని తిరస్కరించారు. దీంతో ఈ కారును పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు.

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంలో మొదటి సారిగా ఎక్కిన పవన్‌ కల్యాణ్‌ తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ వెనుక వైపు ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ను పవన్‌ కల్యాణ్‌కు క్యాంపు కార్యాలయంగా ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిలో ఉన్నారు. క్యాంపు కార్యాలయం వద్ద అప్పటికే రెడీగా ఉన్న పోలీసులు సాంప్రదాయం ప్రకారం గౌరవ వందనం చేశారు. క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్లి అక్కడ రూమ్‌లను పవన్‌ పరిశీలించారు. కొన్ని సౌకర్యాల మార్పులు, చేర్పుల విషయంలో అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అక్కడ నుంచి సచివాలయానికి కూడా అదే కారులో వెళ్లి తన చాంబర్‌ను పరిశీలించారు. చాంబర్‌లో మార్పులు చేర్పులు చేయాలనే దానిపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 19న ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
పెంచిన సెక్యురిటీ
గతంలో ఉన్న సెక్యురిటీ స్థానంలో పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్‌ సెక్యురిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నందు వల్ల భద్రత పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైప్లస్‌ సెక్యురిటీతో పాటు ఎస్‌కార్ట్‌ వాహనం, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారును ప్రభుత్వం ప్రత్యేకింగా కేటాయించడం విశేషం. సచివాలయంలో సైతం పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అందరికి నమస్కారం చేసుకుంటూ పవన్‌ ముందుకు సాగారు. రాజధాని ప్రాంతంలో కూడా పవన్‌కు ఘన స్వాగతం లభించింది. రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు పూలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Tags:    

Similar News