ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు ఎంపీలు

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అధ్యక్ష, కార్యదర్శులు అధికార పార్టీకి చెందిన ఎంపీలు.;

Update: 2024-12-15 07:30 GMT

ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా అసోసియేషన్ లో ఈ సన్నివేశం చోటు చేసుకోలేదు. అధికార పార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక కాలేదు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో అధ్యక్ష కార్యదర్శులే కాకుండా పాలక మండలి సభ్యలు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ప్రస్తుతం అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న వారు క్రికెట్ క్రీడతో ఎటువంటి సంబంధం లేని వారు. అయితే క్రికెట్ క్రీడతో సంబంధం ఉన్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వీరిని ఏరి కోరి అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపిక చేశారు. అసోసియేషన్ కు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ లు తీసుకున్నారు. వీరికి పోటీ ఉండేందుకు ఎవ్వరూ ముందుకు కాకపోవడంతో వీరిరువురితో పాటు పాలక మండలి సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. చిన్ని అధ్యక్షుడు కాగా సతీష్ బాబు కార్యదర్శిగా గెలుపొందారు. ఏసీఏకు ఎన్నికలు జరిగే నాటికి విజయవాడ ఎంపీగా చిన్ని ఎన్నికయ్యారు. సతీష్ బాబు మాత్రం శనివారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో పోటీలో ఉన్న వారు ఉప సంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యారు. దీంతో సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనట్లైంది. అధ్యక్ష కార్యదర్శులు ఇరువురూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కావడంతో క్రికెట్ రంగంలో జోరుగా ప్రచారం సాగుతోంది. క్రికెట్ కు సంబంధం లేని వారు అయినా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం వల్ల వారి నిర్ణయాల మేరకు ఏసీఏ కార్యకలాపాలు జరగనున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో వారి పార్టీకి సంబంధించిన వారిని పోటీ చేయించి వైఎస్సార్ సీపీ గెలిపించింది. దీంతో క్రికెట్ అసోసియేషన్ లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉండాలనే పట్టుదలతో నారా లోకేష్ పట్టుబట్టి తన అనుచరులైన ఇరువురిని ఏసీఏలోకి తీసుకు పోగలిగారు. ఏసీఏలో భారీగానే నిధులు ఉంటాయి. క్రికెట్ రంగానికి సబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఏపీలో నిర్వహించాలన్నా ఏసీఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని కోట్ల విలువ చేసే క్రికెట్ స్టేడియంలు వీరి ఆధీనంలో ఉంటాయి. దేశ విదేశాలకు చెందిన క్రీడా కారులు ఏపీలో క్రికెట్ ఆడాలంటే ఏసీఏ అనుమతి తప్పని సరి. బీసీసీఐ (Board of Control for Cricket in India) కూడా ముందుగా ఏసీఏకు సమాచారం ఇచ్చి మ్యాచ్ లు నిర్వహిస్తుంది. ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు రాజకీయాలకు అతీతంగా క్రికెట్ క్రీడను రాణింప జేస్తారో లేక రాజకీయ రంగు పులుముతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News