త్వరలో విజయవాడకు ఏసీఏ
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్వరలో విజయవాడకు మారనుంది. ఐదేళ్లుగా విశాఖపట్నంలో ఉన్న హెడ్ ఆఫీస్ టీడీపీ రాకతో విజయవాడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు అక్టోబరు నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన క్రికెట్ అసోసియేషన్ ఇకపై టీడీపీకి అనుకూలంగా వ్యవహరించనుంది. ఐదేళ్ల క్రితం వరకు ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా వ్యవహరించిన క్రికెట్ అసోసియేషన్ ఒక్కసారిగా రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షులుగా నూతన పాలకవర్గం వచ్చేనెల 8 తరువాత కొలువు తీరనుంది. ఇప్పటికే కొత్త పాలకవర్గంలో ఎవరు ఉండాలనే అంశంపై మంత్రి లోకేషన్ ఒక నిర్ణయానికి వచ్చారు. పోటీకి రెడీగా ఉండాలని పోటీ దారులకు ఇప్పటికే హింట్ అందించారు. గత పాలకవర్గంలో ఆరుగురు రాజీనామా చేయడంతో కొత్త కమిటీ ఎన్నికలకు అవకాశం ఏర్పడింది. వచ్చే నెల 8న ఏసీఏ పాలకవర్గానికి గుంటూరు కేంద్రంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్, స్థానిక సంస్థల మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియమితులయ్యారు.