చంద్రబాబు భయపడ్డాడా?.. .బోడె ప్రసాద్‌కు సీటు
సీటిస్తే టీడీపీ జెండాతో పోటీ చేస్తా.. లేకుంటే చంద్రబాబు ఫొటో పెట్టుకొని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..;
By : The Federal
Update: 2024-03-23 09:59 GMT
జి. విజయ్ కుమార్
పెనుమలూరు అసెంబ్లీ నియోజక వర్గం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బోడె ప్రసాద్‌కు సీటు కేటాయింపులో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకం సృష్టించాయి. చంద్రబాబు గతంలో విడుదల చేసిన రెండు జాబితాల్లో బోడె ప్రసాద్ పేరును ప్రకటించక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన లిటరల్‌గా కన్నీరు పెట్టుకున్నారు. ఈ సారి సీటు లేదు, ప్రత్యామ్యాయంగా చంద్రబాబు ఏదో ఒకటి చూస్తారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బోడె ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన రగిలి పోయారు. బోడె ప్రసాద్ వర్గీయులు, కార్యకర్తలు, నేతలు రోడ్లపైకొచ్చి ఆయనకు సీటు ఇవ్వాల్సిందేనని నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీటు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ జండాతో పోటీ చేస్తానని లేకుంటే చంద్రబాబు ఫొటో పెట్టుకొని ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని చంద్రబాబుకు అల్టిమేట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు భయపడ్డారు. బోడె ప్రసాద్ తీరు చూస్తోంటే నిజంగానే పోటీలో దిగేట్టు ఉన్నారు, అలా జరిగితే పార్టీకే నష్టంగా చేకూరుతుంది, సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని భావించిన చంద్రబాబు దిగొచ్చి బోడె ప్రసాద్‌కు సీటు కేటాయించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
అసలు ఏమి జరిగింది?
ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు. అటు ఎంపీ స్థానాలతో పాటు, ఇటు అసెంబ్లీ స్థానాలు అధిక శాతం తెలుగేదేశం పార్టీనే కైవసం చేసుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ఆ సీన్ రివర్స్ అయింది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, కేవలం రెండు సీట్లల్లోనే టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ సారి ఎలాగైనా అన్ని స్థానాల్లో టీడీపీని గెలిపించి తిరిగి పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ పెద్దలతో పాటు స్థానిక నేతలు ఉన్నారు. దీనికి తోడు జనసేన, బిజెపితో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు సవాల్‌గా మారింది. మరి ముఖ్యంగా మైలవరం, పెనమలూరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చంద్రబాబుకు కత్తిమీద సాములాగా మారింది. మైలవరం సీటును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఇదే స్థానం కోసం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించి దేవినేని ఉమాను కృష్ణా జిల్లా పెనమలూరుకు పంపుదామని ఆలోచనలు చేశారు. అనుకున్నట్టుగానే మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌కు ఖరారు చేశారు. ఇక పెనమలూరు సీటును దేవినేని ఉమాకు ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అయితే ఈ విషయాన్ని పెనమలూరు స్థానాన్ని అంటిపెట్టుకొని ఉన్న బోడె ప్రసాద్‌కు తెలియచేయాలని నిర్ణయించారు. నేరుగా చంద్రబాబు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ చేయించి చెప్పాలని భావించారు. వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సత్యనారాయణ రాజు ఫోన్ చేసి ఈ సారి మీకు టికెట్ లేదని, అకామిడేట్ చేయలేకపోతున్నామని బోడె ప్రసాద్‌కు చెప్పారు. దీంతో కథ కాస్తా అడ్డం తిరిగినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రచార సన్నాహాలు
2024 ఎన్నికల్లో కూడా తనకే పెనమలూరు సీటు దక్కుతుందని భావించిన బోడె ప్రసాద్ తన పేరు ఖరారు కాక ముందు నుంచే ప్రచార సన్నాహాలు ప్రారంభించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఆయన ఎన్నికల రంగానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో పెనమలూరు స్థానాన్ని తనకు కాకుండా దేవినేని ఉమాకు కేటాయించే చాన్స్ ఉందని తెలిసిన తర్వాత బోడే ప్రసాద్ రంగంలోకి దిగారు. సీటు దక్కించుకోవడం కోసం తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తన కార్యకర్తలు, స్థానిక నేతలు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ శ్రేణులు బోడె ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోలనలు చేపట్టారు. బోడె ప్రసాద్‌కు టికెట్ ఇవ్వకుంటే ఒప్పుకునేది లేదని, దేవినేని ఉమాకు సీటిస్తే తప్పకుండా ఓడించి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కోసం కష్ట పడి పని చేశానని, కోట్ల రూపాయలు వెచ్చించానని, కానీ ఈ సారి టికెట్ లేదని చెబుతున్నారని బోడె ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే కొంత మంది నేతలు తనపై కుట్రలు పన్నారని పరోక్షంగా దేవినేని ఉమాను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తనపై లేనిపోనివి అధిష్టానానికి చెబుతున్నారని, కొడాలి నానితో కానీ, వంశీతో కానీ ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పి తనను అడ్డుకోవాలని కుట్రలు పన్నినట్టు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. చివరకు దేవినేని ఉమాకు కాకుండా బోడే ప్రసాద్‌కే టికెట్ ఖరారు చేయడంతో కథ సుఖాంతమైనట్లు స్థానిక నేతలు చెబుతున్నారు.
స్థానికంగా పట్టున్న నేత
బోడె ప్రసాద్ పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో మంచి పట్టున్న నేత. కార్లూ, జీప్‌లు వంటి హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా ప్రజల్లోకి వెళ్లడం ఆయన నైజం. సైకిల్ మీద, బుల్లెట్ మీద ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలను కలవడం పలకరించడం వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం, సమస్యల పరిష్కారనికి పని చేయడం అతని ప్రత్యేకతని, దీంతో అక్కడ ప్రజలతో ఆయనకు బాగానే సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. 2008లో పెనమలూరు అసెంబ్లీ స్థానం ఏర్పడింది. ఇప్పటి వరకు మూరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కొలుసు పార్థసారధి గెలువగా ఒక సారి బోడే ప్రసాద్ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి పార్థసారధి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బోడే ప్రసాద్ విజయం సాధించారు.