పాక్ 'అతి'వల్లే దాడులు చేయాల్సి వచ్చిందన్న అజిత్ ధోవల్
పాకిస్తాన్ తీరు వల్లే ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టాల్సి వచ్చిందన్నారు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.;
By : The Federal
Update: 2025-05-07 11:43 GMT
పాకిస్తాన్ తీరు వల్లే ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టాల్సి వచ్చిందన్నారు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం గురించి ఆయన ఇతర దేశాలకు వెల్లడించారు. ఇతర దేశాల మద్దతు కూడగడతామన్నారు. చైనా, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతో ఆయన చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదని, కానీ వాటిని ఎక్కువ చేయాలని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమని దోవల్ వారికి స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యల్ని ఆయా దేశాల ప్రతినిధులకు వివరించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలను ఆయన వారికి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అక్కడి ఉగ్రవాదుల శిబిరాలపై దాడుల అమలు వివరాలు వారికి చెప్పినట్లు సమాచారం. భారత మిత్రదేశాలతో భవిష్యత్తులోనూ సమాచారం పంచుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు ఆయన 8 దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.
ఆర్మీ మాజీ చీఫ్‌ల కీలక వ్యాఖ్యలు
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్‌లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5 స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉన్న లష్కరే తోయిబాకు చెందిన గుల్పూర్ టెర్రర్ క్యాంప్ సహా 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని.. భద్రతా బలగాలు క్షిపణులు ప్రయోగించాయి. రాజౌరి - ఫూంచ్ ప్రాంతాల్లో ఇందులోని ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇక్కడే 2023, 2024లో ఫూంచ్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందినట్లు తమకు సమాచారం ఉన్నట్లు భారత అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.