Al Uma | తప్పిన 'ఉగ్ర పేలుళ్ల' ముప్పు
రాయచోటిలో అల్ ఉమా తీవ్రవాదుల అరెస్టుతో కుట్ర భగ్నం.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-03 17:09 GMT
దేశంలోని మూడు నగరాలకు ఉగ్రవాదుల నుంచి పేలుళ్ల ముప్పు తప్పింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మారుపేర్లతో సాధారణ జనంలో కలిసిపోయిన ఇద్దరు అల్ ఉమా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అరెస్టు చేయడంతో ఆ కుట్ర బయటపడింది.
పట్టణంలో గురువారం వారిద్దరి భార్యలను కూడా పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. వారి ఇళ్ళ నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో సూట్ కేసు బాంబులు, మూడు నగరాల నెట్ వర్క్ మ్యాపులు లభించడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ ఇళ్ల నుంచి 50 ఐఈడీలు తయారు చేయడానికి అవసరమైనంత పేలుడు పదార్థాలు ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన వరసకు సోదరులైన అల్ ఉమా తీవ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీని రెండు రోజుల కిందట రాయచోటిలో స్థానిక పోలీసుల సహకారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
1999 నుంచి బాంబు పేలుళ్ల కేసుల్లో పరారీలో ఉన్న వారిద్దరు 20 ఏళ్లుగా మారుపేర్లతో రాయచోటి పట్టణంలో అబూ బకర్ సిద్ధిక్ – అమానుల్లాగా, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో నివసిస్తున్నారు. వారి అరెస్టు తరువాత..
అన్నమయ్య జిల్లా పోలీసులు గురువారం సిద్ధిక్ భార్య, షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్ ను కూడా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా, వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో ఆ మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం కొత్తపల్లి, మహబూబ్బాషా వీధిలో వేరువేరుగా కాపురం పెట్టిన వారిద్దరిని అరెస్టు చేసిన తర్వాత, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దీనికోసం ప్రత్యేకంగా ఐదుగురు సీఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిలో ఒకరు స్పెషల్ బ్రాంచ్, ఇంకొకరు సైబర్ సెల్, ccs విభాగం నుంచి కూడా ఉన్నారు.
భారీగా పేలుడు సామగ్రి
స్వాధీనం చేసుకున్న పేలుడు వస్తువుల వివరాలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు వివరిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
"ఉగ్రవాదులు నివసించిన ఇళ్ల నుంచి పేలుడు పదార్థాలతో పాటు, ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్, సూట్ కేసు బాంబులు బయటపడ్డాయి" అని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ వివరించారు. ప్రధానంగా మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్ వర్క్ మ్యాపులు దొరికిన తీరుపై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
"దేశంలోని మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది. ఐబీ (). సాంకేతిక నిపుణుల దర్యాప్తు, ఉగ్రవాదులు, వారు పెళ్లి చేసుకున్న మహిళలను విచారణ చేస్తే, మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది" అని డీఐజీ కోయ ప్రవీణ రాయచోటిలో గురువారం మీడియాకు చెప్పారు. అల్ ఉమా తీవ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ సాంకేతికంగా అనుభవం () ఉందని ఆయన తెలిపారు.
కోడింగ్ బుక్
పట్టణంలో ఉగ్రవాదులు తలదాచుకున్న ఇళ్లలో స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీ లు చేశారు. ఆ ఇళ్లలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు, PETN తో నిండి ఉండే బాంబు – 20 కేజీల suitcase బాంబును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎవరికీ అర్థం కాకుండా, కోడింగ్ బుక్ కూడా ఉందని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. అందులో..
"ఫ్యూయల్ ఆయిల్‌తో కలిపిన అమ్మోనియం నైట్రేట్ – ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్, స్లర్రీ ఎక్స్‌ప్లోసివ్ – (నైట్రో గ్లిసరిన్ / TNT అయ్యి ఉండవచ్చు)
PETN తో నిండి ఉండే బాంబు – 20 కేజీల suitcase, మరొక suitcase – IED అయ్యి ఉండవచ్చు. ఒక బాక్స్ – IED అయ్యి ఉండవచ్చు. పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, పొటాషియం పెర్మాంగనేట్, గన్ పౌడర్, డ్యాగర్ (పిచి కత్తి), కొడవళ్లు, ఆయుధాలు, టైమర్‌ల కోసం గడియార యంత్రాలు, పుల్ స్విచ్‌లు, ప్రెషర్ స్విచ్‌లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు, పేలుడు పదార్థంలో తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఉపయోగించే బాల్ బెరింగ్స్, నట్-బోల్టులు, మానిటరింగ్ కోసం బైనాక్యూలర్స్, వాకీ-టాకీలు, రేడియో పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కు బుక్కులు, ఆర్థిక లావాదేవీల సమాచారం, డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, ముస్లిం సాహిత్యం, భారతదేశంలోని నగరాల మ్యాపులు, టైమింగ్ సర్క్యూట్ల మాన్యువల్స్, కోడింగ్ బుక్స్, ఆస్తి, ప్రయాణ పత్రాలు, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి" అని వివరించారు.
30 ఏళ్లుగా మకాం...
తమిళనాడు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన అల్ ఉమా తీవ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ 30 ఏళ్ల కిందట ప్రశాంతంగా ఉన్న రాయచోటి పట్టణాన్ని తమ ఉగ్ర వ్యూహాల అమలుకు కేంద్రంగా ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనేక పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారి, ఆచూకీ తెలుసుకోవడానికి తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఐబీకి ఇన్నేళ్లు పట్టింది.
రాయచోటి ప్రాంతంలో స్థానికులతో కలిసి పోవడంలో సఫలం అయ్యారు. చీరలు, ఇతర చిన్న వ్యాపారం చేయడం ద్వారా సాధారణ జనంలో కలిసిపోయారనే విషయం స్పష్టమైంది.
రాయచోటి పట్టణంలో షేక్ సైరాభాను సిద్ధిక్ , మహబూబ్ బాషా వీధిలో షేక్ షమీమ్ ను మహ్మద్ అలీ వివాహం చేసుకోవడం ద్వారా స్థానికుల్లో ఒకరిగా మారాపోయారు. ఇన్నేళ్ల వారి జీవనంలో కూడా ఇంట్లో ఉన్న వస్తువులు, పేలుడు పదార్థాల విషయం వారి భార్యలకు తెలియకుండా పోయిందా? తెలిసి, సహకరించారా? అనేక ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుందని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. జిల్లా పోలీసులతో పాటు
"ఐబీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, వారి నెట్ వర్క్ కూడా ఛేదిస్తాం" అని కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.
దర్యాప్తులో మరిన్ని వివరాలు
రాయచోటి పట్టణంలో సాధారణ జనంతో కలిసిపోయిన ఉగ్రవాదులు గుట్టచప్పుడు కాకుండా నెట్ వర్క్ నడిపినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. వారి ఇళ్ల నుంచి నకిలీ ఆధార్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు భార్యలను కూడా కష్టడీకి తీసుకుని విచారణ జరిపితే మరిన్న వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.