ఎన్నికల సిత్రాలు చూడరో.. నరుడో.. నరుడా..

ఎన్నికల వేళ ప్రచారం ప్రారంభమైంది. పార్టీల అభ్యర్థులు కొత్త అవతారాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

Update: 2024-03-29 13:20 GMT
ఇస్త్రీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: ఎన్నికల జాతరొచ్చింది. ఎన్నెన్నో గుర్తులు వచ్చాయి. జనాన్ని వెంటేసుకున్న నాయకులు, అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పల్లెల్లోనే కాదు. పట్టణ వీధుల్లో కూడా తెల్లవారకముందే వాలిపోతున్నారు. దీంతో..పండుగ వాతావరణంతో సందడిగా మారుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సందర్భాలను బట్టి పార్టీల అభ్యర్థులు జీవించేస్తున్నారు. పిల్లలతో సరదా ముచ్చట్లు. దుస్తులు ఇస్త్రీ చేయడం, దోశలు వేయడం, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

సాధారణంగా ఒక మతానికి ఒక సందర్భంలో పండగలుస్తుంటాయి. అన్ని మతాల సమ్మేళనంగా ఐదేళ్లకోసారి జరిగే రాజకీయ జాతర ఎన్నికలు ముగిసే వరకు కనువిందు చేస్తుంది. కులం, మతం అనే తేడా లేకుండా ఐదేళ్లకోసారి ఓ పండగ వస్తుంది. ఇది ఎన్నికల జాతర కూడా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తమిళ, కన్నడ అనే తేడా ఏమాత్రం లేదు. అభిమానులే కాదు నాయకులు వేసే వేషాలు కూడా కనువిందు చేస్తాయి. ప్రచారం, వాహనాలు తిరగడానికి అయ్యే ఖర్చు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వెంట వచ్చే వారికి వసతులు కల్పించడానికి చేతి చిలుము వదులుతూ ఉంటుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం ముందు నాయకులు ఇవేవీ పట్టించుకోరు.

పిల్లలతో కరుణాకర్ రెడ్డి సందడి

పిల్లలు అంటే ఎంత ప్రేమో

2024 ఎన్నికలకు చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు, రెండు పార్లమెంటు స్థానాలకు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్తున్న అభ్యర్థులు వీధుల్లో ఎక్కడికక్కడ విభిన్న తరహాలో ఓటర్లను ఆకట్టుకోవడానికి విన్యాసాలు చేస్తున్నారు. తిరుపతిలో వైసీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమున అభినయ రెడ్డి కోసం అతని తండ్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిని చుట్టేస్తున్నారు. శుక్రవారం గమ్మత్తయిన సంఘటనలు కనిపించాయి. వీధుల్లో వెళ్లేటప్పుడు తమను పలకరించిన వాళ్ల పిల్లలను ఎత్తుకొని ముద్దాడారు. పిల్లల తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగి మురిపించారు.

నేనేం తక్కువ కాదులే..

ఎట్టకేలకు తిరుపతిలో టీడీపీ వర్గాలన్నీ కలిసి రావడంతో.. జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా ముమ్మరంగా ప్రచారంలోకి దిగారు. కరపత్రాలు అందిస్తూ ఓటు అడుగుతున్నారు ఆయన. దుస్తులు ఇస్త్రీ చేసి, రజకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. మామూలుగా ఇంట్లో గ్లాసు కూడా ఎత్తి పక్కన పెట్టరు. తిరుపతిలో ప్రచారంలో ఉన్న శ్రీనివాసులు వీధిలో కనిపించిన టిఫిన్ సెంటర్ల వద్దకు వెళ్లి దోశలు వేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

పిల్లలతో సెల్ఫీ దిగుతున్న డాక్టర్ సునీల్ కుమార్

పిల్లలకు ఓట్లు లేక సరిపోయింది..

పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్.. జనం నాడి తెలిసిన వ్యక్తి. తన క్లీనిక్‌కు వచ్చే రోగులకు స్టెతస్కోప్ పెట్టి, నాడిపట్టి వైద్యం చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఏమాత్రం తగ్గడం లేదు. పెద్దలను పలకరించే డాక్టర్ సునీల్ కుమార్ వీధుల్లో ఉన్న పిల్లలతో సెల్ఫీలు దిగి వారిని ఆనంద పరుస్తున్నారు. వీధుల్లో సాగిస్తున్న వీరి వేషాలు ఎంత మేరకు ఓట్లు కురిపిస్తాయి. అనేది పోలింగ్ జరిగే రోజు వరకు వేచి చూద్దాం.



Tags:    

Similar News