టీటీడీలో పాపాలన్నీ వైసీపీ పాలనలో జరిగినవే!

టీటీడీ ఈవో శ్యామలరావు మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన పాపాలకు లెక్కేలేదన్నారు. కరుణాకర్ రెడ్డి తీరును ఎండగట్టారు.;

Update: 2025-04-14 13:20 GMT
టీటీడీ ఈవో శ్యామలరావ్
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.
పాపాలన్నీ గత పాలన నాటివే...
ఏప్రిల్ 14న ఈవో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే "మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టిటిడి గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయి. అప్పటి విజిలెన్స్ నివేదికల్లోనూ ఇది తేలింది. గత పాలనలో గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు, మందులు ఎక్కడ తయారు చేశారో లేబుల్ లు కూడా లేని మందులు వాడారు. పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిన నీరు అందించారు. చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదు. టిటిడి విజిలెన్స్ నివేదికలో ఈ విషయం తేలినా తొక్కిపెట్టి ఉంచారు. జబ్బుపడ్డ గోవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయి. దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇపుడు వీటిపై చర్యలు చేపట్టాం. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదు, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చ. చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయి" అని చెప్పారు.
కరుణాకర్ రెడ్డి ఆరోపణలన్నీ అబద్ధాలే..
"టిటిడి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలే" అని జే శ్యామలరావు అన్నారు.
మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో (మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వీ డెయిరీ ఫామ్‌లో) టిటిడి విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లు, గణాంక ఆధారాలను, టిటిడి గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రతి నెలా 15 ఆవుల మరణం సహజమే..
ప్రతి నెలా సగటున 15 ఆవులు వయోభారంతో, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనని, ఈ ఏడాది ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని శ్యామలరావు చెప్పారు.
వాస్తవాలు ఇలా వుంటే టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు శ్రీ బి. కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన వుంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. టిటిడి గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టిటిడిని ఇపుడు పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామని శ్యామలరావు చెప్పారు.
గత జూన్ నుండి టిటిడిలో అన్నప్రసాదం, శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవలలో పారదర్శకత, దర్శన టిక్కెట్లు, వసతి, దళారులను కట్టడిచేయడం, టిటిడి ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
టిటిడి ఐటీ విభాగంలో అనర్హుని ఐటీ జీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో రూ.5 కోట్ల విలువైన కల్తీ సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు దాదాపు రూ.25 కోట్ల విలువైన టిటిడిలో పలు ప్రివిలేజేస్ నుదాతలకు కల్పిస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారని, తాము ఆ ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ ని రద్దు చేశామని ఈవో చెప్పారు.
ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని శ్యామలరావు చెప్పారు.
Tags:    

Similar News