చీరాలలో అన్నదమ్ముల సమరం తప్పదా?
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యూహం ఏమిటి? సోదరుడు స్వాములు సహకారం లేకుండా గెలుపు సాధ్యమేనా? అయినా ఎందుకు పోటీకి దిగాలనుకుంటున్నారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-02-19 13:34 GMT
రానున్న ఎన్నికల్లో చీరాల నియోకవర్గం నుంచి అన్నాదమ్ముళ్ల సమరం తప్పదా? తప్పేట్లు లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పొత్తులో జనసేన నుంచి ఆమంచి స్వాములు సీటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరాలకు తెలుగుదేశం పార్టీ నుంచి సరైన నాయకుడు లేడనే భావనలో టీడీపీ వారు ఉన్నారు. అదే ఆలోచనతో టీడీపీ ముందుకు సాగితే జనసేనకు టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేకపోలేదనేది పరిశీలకుల భావన.
రాజీలేని ధోరణి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ నాయకుల్లో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహార శైలి రాజకీయ చర్చకు తెరలేపింది. ఎందుకు పార్టీలు మారారు. చివరకు ఏ పార్టీలోనూ ఇమడలేక స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజకీయాలు వంటబట్టవా అంటే అటువంటిదేమీ లేదని చెప్పొచ్చు. రాజకీయ వ్యూహాల్లో అందెవేసిన చేయిగా ఆమంచికి పేరు ఉంది. అయినా ఎందుకు ఈ విధంగా అడుగులు వేస్తున్నారనేదానిపై రాజకీయ నాయకుల్లో చర్చ సాగుతోంది.
రోశయ్య ప్రియ శిశ్యుడు
దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రియ శిశ్యుడు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో లీడర్‌గా ఎదిగి ఎంపీపీగా గెలుపొందారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. మొదటిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటూ జగన్ చర్యలను వ్యతిరేకించారు. జగన్ నిర్వహించిన పాదయాత్రను కూడా చీరాలలో అడ్డుకున్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వీర విధేయుడు. ఆయన మరణించిన తరువాత జగన్‌వెంట వెళతారని అందరూ భావించారు. అలా జరగలేదు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ తరువాత నవోదయం పార్టీ బీఫారం తీసుకుని గెలుపొందారు. నవోదయం పార్టీ ఎన్నికల గుర్తు ఆటో కావడం వల్ల వేరే వారు రిజిస్ట్రేషన్ చేయించిన పార్టీని కొనుగోలు చేసి ఆ ఆపార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించడం విశేషం.
తెలుగుదేశంలో చేరిక..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో 2015 సెప్టెంబర్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి 2019 ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీలో చేరాడు. వైఎస్ఆర్సిపి టికెట్ పై ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బలరాం గెలిచి ఆ మంచి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలలో కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొనసాగుతున్నారు.
పర్చూరుకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా..
ఆమంచి కృష్ణమోహన్‌ను కరణం బలరామ్ దూరంగా పెట్టారు. దీంతో అధిష్టానం పర్చూరుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించింది. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని అధిష్టానం ఆమంచిని కోరింది. తాను పర్చూరు నుంచి పోటీ చేయలేనని చెప్పారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆమంచిని పక్కనబెట్టి చీరాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు యడం బాలాజీని రంగంలోకి దించింది. పొమ్మనకుండా వైఎస్సార్‌సీపీ ఆమంచికి పొగబెట్టడంతో దిక్కుతోచని ఆమంచి చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు.
ఆమంచి వర్గం చెల్లా చెదురు
చీరాలలో గతంలో ఆమంచికి ఉన్న వర్గం ప్రస్తుతం చెల్లా చెదురైంది. కొంతమంది కరణం బలరామ్ వద్దకు చేరగా మరికొంతమంది ఎమ్మెల్సీ పోతుల సునీత వద్దకు చేరారు. అంటే వైఎస్సార్‌సీపీ ఓటర్లు మూడు వర్గాలుగా విడిపోయారు. వైఎస్సార్‌సీపీ టిక్కెట్ కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేశ్‌కు దాదాపు ఖరారైందని చెప్పొచ్చు. బలరామ్, పోతుల సునీత వర్గాలకు మధ్య వైరం ఉండటం వల్ల వారిద్దరికి ఉండే వ్యతిరేక ఓట్లు తనకు వస్తాయనే ధీమాలో ఆమంచి ఉన్నారు. వైసీపీలో మూడు వర్గాలుగా ఓటర్లు ఉంటే తెలుగుదేశం, జనసేన పార్టీ వారు ఎటువంటి అసంతృప్తులు లేకుండా ముందుకు సాగుతున్నారు. అందువల్ల వారి ఓట్లు చీలే అవకాశం లేదు. పొత్తులో చీరాల జనసేనకు కేటాయిస్తే స్వాములు రంగంలోకి దిగుతారు.
స్వాములు సహకారంతోనే గతంలో ఎమ్మెల్యే..
రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపుకు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు సహకారం ఉంది. ప్రస్తుతం స్వాములు జనసేన పార్టీలో ఉన్నారు. చీరాల నుంచి జనసేన టిక్కెట్ ఆశిస్తున్నారు. అదే జరిగితే ఏ వైపు నుంచి కూడా కృష్ణమోహన్‌కు సహకారం అందే అవకాశం లేదు. దీంతో ఆయన గెలుపు అంత తేలిక కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.