ఆమంచి టార్గెట్ కరణం
ఏపీలో చీరాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ. పోటీలో ఉన్న వారు కాపు, కమ్మ, యాదవ సామాజిక వర్గం వాళ్లు. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-05-10 14:10 GMT
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎం కొండయ్య పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్–ఐ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీలో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ జరుగుతున్నా రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తులకు స్థానికులు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పొచ్చు. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున ఒకసారి గెలిచి, రెండో సారి 2014లో నవోదయ పార్టీ నుంచి స్వతంత్రంగానే గెలిచారు. కావలసిన పార్టీ గుర్తు కోసం నవోదయ పార్టీని ఎంపిక చేసుకున్నారు. గతంలో జడ్పీటీసీగా, ఎంపీపీగా రాజకీయాల్లో పని చేసిన అనుభవం కూడా ఆమంచికి ఉంది.
2014లో గెలిచిన ఆమంచి
2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి, టీడీపీ చీరాల అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓడి పోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో పర్చూరు నియోజక వర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్తగా నియమితులయ్యారు. చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి ఆసక్తి చూపలేదు. చీరాల టికెట్ ఆమంచికి ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. దీంతో ఆమంచి ఆ పార్టీకి రాజీనామా చేసి షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో కరణం బలరామ్‌కు కాకుండా ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.
చీరాల అభివృద్ధికి కృషి చేసిన ఆమంచి
ప్రధానంగా ఆమంచి, బలరామ్‌ల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటోంది. కరణం బలరామ్ ఎమ్మెల్యేగా ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతూ చీరాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ వైఎస్‌ఆర్‌సీపీలోకి తీసుకొచ్చారు. చీరాల నియోజక వర్గంలో టీడీపీకి సాధారణ ఓటర్లు తప్ప ముఖ్య నాయకులెవ్వరూ నియోజక వర్గ కేంద్రంలో లేరని చెప్పొచ్చు. అయితే ఆమంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడం, రోశయ్య ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా చీరాల అభివృద్ధికి కొంత మేర నిధులు తీసుకొచ్చారు. అందువల్ల చీరాల్లో ఆమంచికి కూడా ఒక ప్రత్యేక వర్గం కూడా ఉంది.
కరణం వెంకటేశ్‌ను టార్గెట్‌గా
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్యను ఆమంచి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్‌ను ప్రధాన ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా తాను ఎక్కువ ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి చీల్చగలిగితే తన ప్రత్యర్థి ఓటమి ఖాయమనే ఆలోచనలో ఆమంచి ఉన్నారు. ఈ నేపధ్యంలో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎం కొండయ్య గెలిచినా పర్వాలేదు కానీ కరణం వెంకటేశ్ ఎట్టి పరిస్థితుల్లోను గెలవ కూడదని ఓటర్లుకు చెబుతున్నారు. కాపుల్లో ఎక్కువ మంది జనసేన అభిమానులుగా ఉండటం వల్ల వారి ఓట్లు టీడీపీకే ఎక్కువుగా వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి లాభ పడుతారా? వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని ఆమంచి ఏ స్థాయిలో టార్గెట్ చేసినా ప్రయోజనం ఉండదా? అనేది కూడా చర్చగా మారింది.
వెంకటేశ్‌కు కలిసొచ్చిన బలరామ్ బలగం
కరణం బలరామ్ టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం వల్ల ఆ పార్టీ బలం రెట్టింపు కావడం బలరామ్ కుమారుడు వెంకటేశ్‌కు బాగా కలిసొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నియోజక వర్గంలో 2.20లక్షల ఓట్లు ఉంటే అందులో 75 శాతం కంటే ఎక్కువ శాతం పోలయ్య అవకాశం లేదని, ఆ విధంగా పరిశీలించినప్పుడు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమంచి కాంగ్రెస్‌లో ఒక సారి గెలవడం, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి వెళ్లడం, టీడీపీలోనైనా కొనసాగకుండా ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం ఆయన అభిమానుల్లో కొంత మందికి మింగుడు పడటం లేదు. మొత్తం పోలైన ఓట్లల్లో ఆమంచి 20 నుంచి 25 శాతం మాత్రమే సాధించగలరని, మిగిలిన ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్య ఉండే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మే 13న జరిగే ఎన్నికలు ఆమంచి రాజకీయ భవిష్యత్‌ను నిర్థారించనున్నాయి.