చంద్రబాబు అమరావతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఐదేళ్ల క్రితం ఆగి పోయిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరిగి ప్రారంభించారు.

Update: 2024-10-19 08:42 GMT

అమరావతిలో సీఆర్‌డిఏ కార్యాలయం ఐదేళ్ల క్రితం నిర్మాణం ఆగిపోయింది. ఈ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించడంతో అధికారులు పనులు మొదలు పెట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం వద్ద సీఆర్‌డిఏ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ పూజలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు.


గతంలో రూ. 160 కోట్లతో ఏడంతస్తుల సీఆర్‌డిఏ భవనాన్ని నిర్మించేందుకు పనులు ప్రారంభించగా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులను నిలిపి వేసింది. దీంతో 2017 నుంచి ఆ పనులు అలాగే నిలిచి పోయాయి. 3.62 ఎకరాల స్థలంలో జీప్లన్‌ 7 భవనాన్ని నిర్మించాల్సి ఉంది. పార్కింగ్, ల్యాండ్‌ స్కేపింగ్‌కు సంబంధించి 2.51 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ:


చరిత్రను తిరగ రాసేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చి దిద్దిన ఘనత తమదేనని అన్నారు. ముందు చూపుతో నాడు సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు వేశాం. శంషాబాద్‌ విమానాశ్రయానికి 5వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతి చోటా ఉంటారు. అమరావతి రైతులను ఒప్పించి భూమిని సేకరించాం. రాజధాని, సమాజ హితం కోసం రైతులంతా భూములిచ్చారు. 54వేల ఎకరాలను సేకరించాం. మహిళలు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాన్ని గట్టిగా నడిపారు. వారి పోరాటాన్ని అభినందిస్తున్నా,’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒకే రాజధాని అని ప్రతి చోటా చెప్పానన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు.


ఈ సారి చంద్రబాబు నాయుడు ముఖం ధీమా కనిపించింది. ఎందుకంటే, గతంలో అమరావతికి శంకుస్థాపన చేసినపుడు ఆయన ఎవ్వరి సహకారం లేదు. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ రాజధానికి ఏమీ సాయం చేయలేదు. అంతేకాదు, ఆయనను కలుసుకునేందుకు ప్రధాని ఇష్టపడలేదు.ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు పర్యటనలు  వృధగా గా పోయాయి. చివరకు ఆయన మోదీ ప్రభుత్వం గొడవపడ్డారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. చేతులు కాల్చుకున్నారు. ఆ బొబ్బలు బాగా నొప్పించాయి.

ఇపుడు ఆయన మోదీతో కలసి నడుస్తున్నారు. ప్రధాని మోదీ కూడా చంద్రబాబు స్నేహం విలువ ఏమిటో తెలుసుకున్నారు. రాజధానికి సాయం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి  రు. 15వేల కోట్లు సాయం అందించారు. దీనితో చంద్రబాబు రాజధాని నిర్మాణం మీద ధీమా వచ్చింది. ఈ రోజు అమరావతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నపుడు ఆయన ముఖంలో ఇది కనిపించింది. ఈ సారి అమరావతి ప్రాజక్టు కంప్లీట్ చేయగలననే నమ్మకం కనిపిస్తున్నది.

Tags:    

Similar News